తెలంగాణలో మరింత అన్యాయం

ఇటీవల ఉత్తర ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అమలు చేయడం లేదనే కారణంగా ఉత్తర ప్రదేశ్ హైకోర్టు బీసీ కోటా లేకుండానే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ, ఎన్నికలను పూర్వ పద్ధతిలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్వహించాలని మధ్యంతర ఉత్తరులను జారీ చేసింది. ఈ మధ్యకాలంలో వెలువడుతున్న సుప్రీంకోర్టు తీర్పులు దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.  

ట్రిపుల్​ టెస్ట్​ ద్వారా బీసీ రిజర్వేషన్లు

సుప్రీంకోర్టు 2010లో ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం కె. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసు తీర్పులో దేశంలోని స్థానిక సంస్థలైన పంచాయతీలు, మునిసిపాలిటీల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా బీసీ కోటాను నిర్ధారించిన తర్వాత మాత్రమే అమలు చేయాలని తెలిపింది. ట్రిపుల్ టెస్ట్ లోని నిబంధనలు (1) వెనుకబడ్డ తరగతుల పౌరుల వెనుకబాటుకు సంబంధించి ప్రత్యేక బీసీ కమిషన్ ద్వారా ఆమోద యోగ్యమైన లెక్కలు తీయాలి (2) అట్టి లెక్కల ద్వారా బీసీ కోటాను నిర్ధారించాలి (3) ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన, బీసీ రిజర్వేషన్లతో కలిపి 50 శాతం సీలింగ్ దాటకూడదు.  అదేవిధంగా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర మధ్య జరిగిన కేసు తీర్పులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 2022లో జారీచేసిన మరో ఉత్తర్వును ఉటంకిస్తూ, సుప్రీంకోర్టు ఆదేశానుసారం దేశంలో 2022 నుంచి నిర్వహించబోయే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా అమలు చేయాలని, లేనట్లయితే బీసీ రిజర్వేషన్లు లేకుండానే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల ఎన్నికలు  నిర్వహించాలని జారీ చేసిన సుప్రీంకోర్టు ఉత్తర్వులను కారణంగా చూపి, ఉత్తరప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అట్టి తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది, వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ, బీసీ రిజర్వేషన్ల అమలు, బీసీ కులగణన అనే రెండు అంశాలూ రాజ్యాంగ బద్ధమైనవని వీటిని అమలు చేయాల్సిన  బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదని తెలుపుతూ, పూర్వ పద్ధతిలోనే బీసీలకు 27 శాతం రిజర్వేషన్లతో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించుకోవాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

రాజ్యాంగ రచనలోనే అన్యాయం

రాజ్యాంగ రచనలోనే  బీసీ కులాలకు తీరని అన్యాయం జరిగింది. ప్రజాస్వామ్యం ముసుగులో కులస్వామ్యంలో విలసిల్లుతున్న దేశంలో నేటికీ విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో బీసీ కులాలకు జనాభా దామాషా పద్ధతిలో ప్రాతినిధ్యం లభించడం లేదు. రాజ్యాంగంలో బీసీ కులాలను కాస్త తరగతులుగా/ వర్గాలుగా చిత్రీకరించి బీసీ కులాలే లేవన్నట్లుగా తెలిపారు. ఫలితంగా బీసీ కులగణన చేయడం లేదు. దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం చివరిగా 1931లో చేసిన కులాల లెక్కలు నేటి ప్రభుత్వాలకు ఆధారంగా మిగిలింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 15(5), 16(4) ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారు విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందటానికి అర్హత కల్గి ఉన్నారు, అయా కులాల జాబితా వేరుగా ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం వెనుకబడిన తరగతుల పౌరులు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పొందాలంటే ఆయా కులాల జాబితా వేరుగా ఉండాలని సుప్రీంకోర్టు తెలియజేస్తుంది. ఈవిధంగా రాజ్యాంగ రచనలో బీసీ కులాలకు అస్థిత్వం లేకుండా, నిర్దిష్టమైన అధికరణలను పొందుపరచలేదు. అందుకే నేడు కోర్టుల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై వివాదాలు తలెత్తుతున్నాయి.

తెలంగాణలో మరింత అన్యాయం

సుప్రీంకోర్టు తీర్పుల అమల్లో భాగంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలు ఆర్టికల్ 243 ప్రకారం బీసీ కులాల లెక్కలను తయారు చేశాయి. కానీ, రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు  ఎలాంటి కసరత్తు ప్రారంభించలేదు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ల సీలింగును సాకుగా చూపి 1994 నుండి అమలు చేస్తున్న 34 శాతం బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి అమలు చేశారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల్లో బీసీలు 1000కి పైగా సర్పంచ్ స్థానాలను, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో 10 శాతం సీట్లను కోల్పోయారు.  అదే గ్రేటర్ హైరాబాదుతో సహా మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కాయి. అందుకు కారణం మునిసిపాలిటీలో ఎస్సీ, ఎస్టీల జనాభా తక్కువ ఉంటుంది గనుక 50% సీలింగుకు లోబడి బీసీ కోటాను 34 శాతం అమలు చేశారు. ఇప్పటికైనా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమల్లో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్టికల్ 243 ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల పౌరుల జనాభాను లెక్కించి బీసీ రిజర్వేషన్ల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలి. లేదంటే తగ్గించి అమలు చేస్తున్న 24 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది.


- కోడెపాక కుమార స్వామి
రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం