కోర్టు తీర్పులు సాధారణ వ్యక్తి అర్థం చేసుకునే విధంగా ఉండాలి

కోర్టులు వెలువరించే తీర్పులు సరళంగా ఉండాలి. సాధారణ వ్యక్తి అర్థం చేసుకునే విధంగా ఉండాలి. తీర్పుల్లో ఎలాంటి విశేషణాలు ఉండకూడదు. చాలా మంది న్యాయమూర్తులు తమకు భాష మీద ప్రావీణ్యం ఉందని చూపించుకోవడానికి గొట్టు పదాలను వాడుతూ తీర్పును సంక్లిష్టం చేస్తారు. కొంత మంది భాష మీద ప్రావీణ్యం లేక, విషయం మీద అవగాహన లేకుండా తీర్పులను సంక్లిష్టం చేస్తుంటారు. ఇంకొంతమంది తీర్పుల్లో నీతులు బోధిస్తూ, తమ పరిధిలో లేని అంశాలను ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ పాత్ర నిర్వహించాల్సింది న్యాయమూర్తులు కాదు. వారు తీర్పులో పరిష్కరించాల్సిన విషయ పరిధి దాటకూడదు. మరికొంత మంది ముద్దాయి గురించి, సాక్షుల గురించి అనవసర విషయాలను వారి తీర్పుల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. ఇది కూడా సరికాదు. తీర్పులు సుదీర్ఘంగా ఉండకూడదు. అలా రాయడం గొప్ప అనుకుంటారు. తీర్పులు అవసరమైన దానికి మించి ఉండటానికి వీల్లేదు. ఇన్ని పేజీలు ఉండాలన్న నియమం ఏమీ లేదు. విషయం ప్రధానం. దాన్ని చెప్పడానికి ఎన్ని పేజీలు అవసరమో, నిర్ణయానికి రావడానికి ఎంత అవసరమో అన్ని పేజీలు మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఒక్క పదం ఎక్కువ, ఒక్క పదం తక్కువ కూడా ఉండటానికి వీల్లేదు. 

సుప్రీంకోర్టు ఆగ్రహం

తీర్పుల రాత గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే ఇటీవల కాలంలో హైకోర్టులు వెలువరిస్తున్న తీర్పుల పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తపరుస్తున్నది. 2018 డిసెంబర్​ నెలలో ఓ చిన్న కేసులో ఓ హైకోర్టు 60 పేజీల తీర్పు ప్రకటించింది. ఆ కేసును తిరిగి హైకోర్టుకే తిప్పి పంపిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్​ఏఎం సప్రె, జస్టిస్​ ఇందూ మల్హోత్రాలు తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. తీర్పులు రాసే క్రమంలో భాషను చాలా జాగ్రత్తగా వాడాలి. అవసరమైనంత మేరకే పదాలను ఉపయోగించాల్సి ఉంటుంది. సుదీర్ఘంగా రాయడం కన్నా క్లుప్తంగా రాయడమే గొప్ప అని సుప్రీం న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. 2017లో హిమాచల్​ప్రదేశ్​హైకోర్టు వెలువరించిన ఓ తీర్పు పట్ల కూడా ఇలాంటి అసంతృప్తే వ్యక్తమైంది. ‘‘న్యాయమూర్తులు తమ తీర్పులో ఏం రాశారో మాకు అర్థం కావడం లేదు. ఇది ఇంగ్లీషులో ఉన్నప్పటికీ లాటిన్​ మాదిరి ఉంది. ఒక్క పదాన్ని కూడా మేం అర్థం చేసుకోలేకపోతున్నాం” అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ​కేఎం జోసెఫ్, జస్టిస్​ పీఎస్​నర్సింహలు అభిప్రాయపడ్డారు. 2017లోనే మరో తీర్పులో కూడా తీర్పులో వాడిన ఇంగ్లీష్​ భాష తీరును చూసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్​మదన్​ బి లోకూర్, జస్టిస్​ దీపక్​ గుప్తాలు అసంతృప్తి వ్యక్తపరిచారు. తీర్పులో వాడిన భాష మెలికలు తిరిగిందని, దీన్ని అర్థం చేసుకోవడం తమ వల్ల కావడం లేదని, హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి, కేసును తిప్పి పంపారు. అది ఓ ఇంటి యజమాని, కిరాయికి ఉన్న వ్యక్తి మధ్య గల వివాదం. 1999లో అద్దెకు ఉన్న వ్యక్తి తన ఇంటి నుంచి ఖాళీ చేయాలని ఓ యజమాని దరఖాస్తు పెట్టాడు. ఆ ఇంటిని తిరిగి స్వాధీన పరుచుకోవడానికి ఆ యజమానికి 2011లో  వారంట్​లభించింది. 2016లో కిరాయిదారుడు దాఖలు చేసిన అప్పీలును ఆమోదించి, యజమానికి అనుకూలంగా ఇచ్చిన తీర్పును కోర్టు రద్దు చేసింది. కోర్టు రాసిన వాక్యాలను సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. 12 వాక్యాలు ఉన్న ఒక పేరాలో ఎక్కడా ఫుల్​స్టాప్ ​లేదని, అదొక సుదీర్ఘ వాక్యం, అర్థం కాకుండా ఉందని అభిప్రాయపడింది.

హైకోర్టు జడ్జిలకూ.. 

తీర్పులు సహేతుకంగా ఉండాలి. చట్టం కూడా అదే చెప్తుంది. తగిన కారణాలతో తీర్పులు ఉంటేనే కోర్టుల మీద, తీర్పుల మీద విశ్వసనీయత పెరుగుతుంది. అంతేకాదు అవి సులువుగా ఉండాలి. సంక్లిష్ట తీర్పులు ప్రకటించిన ఓ హైకోర్టు న్యాయమూర్తిని మరో హైకోర్టుకు బదిలీ చేశారు. ఆ న్యాయమూర్తి అక్కడ కూడా అలాంటి తీర్పులను రాయరన్న గ్యారంటీ ఏముంది? కింది కోర్టు జడ్జిలు ఇలాంటి తీర్పులను వెలువరించినప్పుడు వారిని జ్యుడీషియల్​అకాడమీలకు శిక్షణ కోసం పంపిస్తుంటారు. అలాంటి పరిస్థితి హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో ఎందుకు లేదో అర్థం కాని స్థితి. హైకోర్టు న్యాయమూర్తులకు ఉద్యోగ భద్రత మరీ ఎక్కువ. న్యాయవ్యవస్థ స్వతంత్రత కోసం అది అవసరమే  కాదనలేం. సరిగా తీర్పులను రాయని జడ్జిలకు కొంతకాలం పనిలేకుండా చేస్తే ఎలా ఉంటుంది? ఇది సుప్రీం ఆలోచించాల్సిన విషయమే మరి!

తీర్పులు కక్షిదారుల కోసం

2022 ఆగస్టులో ఓ తీర్పు సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను న్యాయమూర్తులు జస్టిస్​ డీవై చంద్రచూడ్, జస్టిస్ ​సుధాంశ్ ​దూలియాలు పరిశీలించారు. ఆ తీర్పులో ఏదీ స్పష్టంగా లేదని, దాన్నుంచి ఏమీ గ్రహించలేని పరిస్థితి ఉందని చెప్పారు. ‘‘హైకోర్టు ఉత్తర్వులను మేం ఏ రకంగానూ అర్థం చేసుకోలేకపోతున్నాం. కింది కోర్టు జారీ చేసిన అసెస్​మెంట్ ను హైకోర్టు ఎందుకు రద్దు చేసిందో అర్థం కావడం లేదు”అని అభిప్రాయపడ్డారు. ఆ తీర్పును రద్దు చేస్తూ, మళ్లీ ఆ కేసును తిరిగి విని పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించారు. తీర్పులు అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండాలని, అవి న్యాయవాదులు,  జడ్జిల కోసం రాసినవి కాదని, కోర్టుకు వచ్చే కక్షిదారుల కోసం అని కోర్టులు గుర్తుపెట్టుకోవాలని సుప్రీం పేర్కొంది. 

“డేటా ప్రొటెక్షన్​ ​బిల్లు కొత్త వెర్షన్‌‌పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆన్​లైన్ ​ప్రపంచాన్ని మరింత జవాబుదారిగా చేయడానికి ఇది చాలా అవసరం. అతి త్వరలో ప్రభుత్వం ఒక టెలికాం బిల్లును కూడా తేనుంది’’

- అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి

 ‘‘గత ఎనిమిదేండ్ల ఎన్డీయే ప్రజావ్యతిరేక పాలనలో అన్ని రంగాలు కుంటుపడ్డాయి. దేశం అన్నిరంగాల్లో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. కాంగ్రెస్​లీడర్​ రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్రతో దేశాన్ని ఏకం చేసే చారిత్రక బాధ్యత తీసుకున్నారు’’

- కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ లీడర్​

“గత కాంగ్రెస్ ​ప్రభుత్వాల పాలన వల్లే వానలకు బెంగళూరు మునిగే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ముంపు సమస్య పునరావృతం కాకుండా చూసేందుకు మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది’’

- బసవరాజ్​ బొమ్మై, కర్నాటక సీఎం 

- మంగారి రాజేందర్, రిటైర్డ్​ జిల్లా జడ్జి