- జ్యుడీషియల్కమిషన్టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో కేవలం బ్యారేజీలే..
- కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌లను చేర్చని సర్కార్
- పంప్హౌస్లలోనూ భారీగా అక్రమాలు గుర్తింపు
- వాటిపైనా విచారించాలని గతంలో భావించిన కమిషన్
- కానీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో లేకపోవడంతో బ్యారేజీలకే పరిమితం
- అందులో పంప్ హౌస్‌లను చేరిస్తే విచారించేందుకు అవకాశం
- పంప్‌హౌస్‌ల మోటార్లు, పంపులను విదేశాల నుంచి తెప్పించిన మేఘా కంపెనీ
- 2022లో వరదలకు నీటమునిగిన పంప్‌హౌస్‌లు..
- రిపేర్లకు వెయ్యి కోట్లకు పైనే ఖర్చు.. ఈ ఖర్చు ఎవరు భరించారో నో క్లారిటీ
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం పంప్‌హౌస్‌లలో జరిగిన అక్రమాలపై జ్యుడీషియల్ కమిషన్ విచారిస్తుందా? అంటే.. ఆ సూచనలు కనిపించట్లేదు. 2023 అక్టోబర్21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో.. దానిపై విచారణ జరిపించేందుకు పోయినేడాది మార్చిలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్‌గా జ్యుడీషియల్కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇంజనీర్లు, ఐఏఎస్‌లు, ఇతర వ్యక్తుల నుంచి అఫిడవిట్లు స్వీకరించిన కమిషన్.. 108 మందిని విచారించింది.
పలు సందర్భాల్లో ప్రాజెక్ట్ పంప్హౌస్లపైనా కమిషన్ దృష్టిపడింది. మేడిగడ్డపై విచారణను మొదలుపెట్టే ముందు చైర్మన్ జస్టిస్ ఘోష్.. మూడు బ్యారేజీలతో పాటు ఆ బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు నిర్మించిన కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంప్హౌస్లనూ పరిశీలించారు. ఆ తర్వాత వాటిపై సమగ్ర అధ్యయనం చేశారు.
ఈ క్రమంలోనే విచారణ జరిగే సందర్భంలో బ్యారేజీలతో పోలిస్తే పంప్‌హౌస్‌లలో భారీగా అక్రమాలను కమిషన్గుర్తించినట్టు తెలిసింది. అందుకు అనుగుణంగా పంప్‌హౌస్‌ల సీఈ, ఎస్ఈ, ఈఈ సహా అధికారులను విచారించాలని కమిషన్ గతంలో భావించింది. కానీ, వారిని విచారించలేదు. ఎందుకంటే కమిషన్‌ఏర్పాటు సమయంలో టర్మ్స్ఆఫ్రిఫరెన్స్లో కేవలం బ్యారేజీలనే ప్రభుత్వం పేర్కొన్నది.
Also Read : నీళ్లు, ప్లాస్టిక్ తో పెట్రోల్ తయారు చేసిన కొరియా సైంటిస్టులు
పంప్‌హౌస్‌లను మెన్షన్ చేయలేదు. దీంతో కమిషన్విచారణ కేవలం బ్యారేజీలకే పరిమితమైనట్టు తెలుస్తున్నది. పంప్హౌస్లపైనా విచారణ చేయాలని ప్రభుత్వం అడిషనల్టర్మ్స్ఆఫ్రిఫరెన్స్ను కొత్తగా జోడించి ఉత్తర్వులు జారీ చేస్తే తప్ప.. వాటిపై ఎంక్వైరీ చేయలేని పరిస్థితి ఉందని అధికార వర్గాలు అంటున్నాయి.
భారీగా ఖర్చు..
రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన గత బీఆర్ఎస్ సర్కార్.. మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణ కాంట్రాక్ట్‌ను మేఘా సంస్థకు ఇచ్చింది. ఆ కంపెనీ తొలుత కన్నెపల్లి పంప్‌హౌస్‌లో 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 11 మోటార్లను రూ.440 కోట్లతో ఏర్పాటు చేసింది. అనంతరం మూడో టీఎంసీ కోసం మరో ఆరు మోటార్లను ఏర్పాటు చేసింది. వీటికి మరో రూ.240 కోట్లు ఖర్చు చేసింది. ఈ పంప్‌హౌస్‌ను రూ.4,300 కోట్లతో మేఘా సంస్థ నిర్మించింది. అన్నారం పంప్‌హౌస్‌కు రూ.2,700 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించారు. అందులో 2 టీఎంసీలు ఎత్తిపోసేందుకు రూ.400 కోట్లతో 8 మోటార్లు.. మూడో టీఎంసీ కోసం రూ.200 కోట్లతో 4 మోటార్లను పెట్టారు.
ఈ మోటార్ల కెపాసిటీ కూడా 40 మెగావాట్లు. సుందిళ్ల పంప్‌హౌస్‌లో తొలుత రూ.200 కోట్ల విలువైన 9 మోటార్లు ఏర్పాటు చేయగా.. అదనపు టీఎంసీ కోసం మరో ఐదు మోటార్లను విదేశాల నుంచి తెప్పించి ఏర్పాటు చేసింది. దీనికి మొత్తం రూ.2,970 కోట్లు మేఘా ఖర్చు చేసింది. ఆఫ్రికా, ఫిన్లాండ్, జర్మనీ, చైనా, జపాన్ వంటి దేశాల నుంచి మేఘా సంస్థ ఈ మోటార్లను తెప్పించి బిగించింది. వాస్తవానికి పంప్‌హౌస్‌లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికీ అసలు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్సులే లేవని గతంలో కేంద్రం తేల్చి చెప్పింది.
అంతేగాకుండా వాటి నిర్మాణాన్ని చేపడుతున్న కాంట్రాక్ట్ సంస్థకు టెక్నికల్ఎక్స్పీరియన్స్కూడా లేదని చెప్పింది. అయినా కూడా నాటి ప్రభుత్వం మేఘా సంస్థకు కాంట్రాక్ట్ఇచ్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. విదేశాల నుంచి అప్పటి ప్రభుత్వమే నేరుగా ఆ మోటార్లు, పంప్‌లను సమకూర్చుకుంటే ఖర్చు తగ్గేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్ట్ సంస్థకు దోచిపెట్టేందుకే నాటి ప్రభుత్వం ఇలా సంస్థకు కాంట్రాక్ట్‌లు ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి.
రిపేర్ల ఖర్చు ఎవరిది?
2022 జులై 14న వచ్చిన గోదావరి వరదల్లో కన్నెపల్లి పంప్హౌస్సేఫ్టీ వాల్ కూలి 17 మోటార్లు దెబ్బతిన్నాయి. వరదల కారణంగానే పంప్హౌస్లుమునిగాయని అప్పటి సర్కార్ కవర్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఎఫ్ఆర్ఎలం దిగువన కట్టడం వల్లే కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్‌లు నీటమునిగాయని పలువురు నిపుణులు తేల్చి చెప్పారు. అన్నారం పంప్ హౌస్‌ను 131 మీటర్ల ఎత్తులో కట్టేందుకు అనుమతిస్తే 125 మీటర్ల ఎత్తులో, కన్నెపల్లి పంప్‌హౌస్‌ను 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే 120 మీటర్ల ఎత్తులో కట్టారని, దీంతో వరదలకు సేఫ్టీ వాల్కూలి పంప్‌హౌస్‌లు మునిగిపోయాయని చెప్పారు.
ఇరిగేషన్డిజైన్స్విభాగం ఎక్స్పర్ట్స్ కూడా పలుమార్లు పంప్‌హౌస్‌లను విజిట్ చేసి హెడ్రెగ్యులేటర్గేట్లలో లీకేజీలు, ప్రొటెక్షన్వాల్పరిస్థితిపై హైచ్చరికలు చేశారు. అయినా కూడా వాటిని మేఘా సంస్థ పెడచెవిన పెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ రెండు పంప్‌హౌస్‌లు ప్రమాదంలోనే ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. పంప్‌హౌస్‌ల రిపేర్ల ఖర్చును కాంట్రాక్ట్సంస్థే భరిస్తుందని నాటి సర్కార్, అధికారులు గతంలో చెప్పారు. వాటికి ఇప్పటిదాకా రూ.వెయ్యికోట్లకుపైగా ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. మరి, ఆ ఖర్చు ఎవరు భరించారన్న దానిపై క్లారిటీ లేదు.
సబ్ కాంట్రాక్టులు ఉన్నాయని అనుమానాలు!
ఓపెన్కోర్టు విచారణలో భాగంగా బ్యారేజీల్లో ఎలాంటి సబ్‌కాంట్రాక్టులు ఇవ్వలేదని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. అయితే, లేబర్, ముడిసరుకుల విషయంలో కాంట్రాక్ట్ సంస్థలు.. స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లకు సంస్థ సబ్‌కాంట్రాక్టులు ఇచ్చాయన్న అనుమానాలను కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. లేదంటే ఒకేసారి 6 వేల మంది లేబర్‌ను కంపెనీ నియమించుకునేందుకు అవకాశం ఉంటుందా? అన్న సందేహాలనూ వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే సంస్థకు చెందిన ప్రముఖులనూ ఓపెన్ కోర్టుకు పిలిచే అవకాశాలపై కమిషన్ యోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. అధికారులను ఇప్పటికే విచారించడంతో అవసరమనుకుంటే మరోసారి పిలిచే అవకాశాలూ ఉన్నాయని సమాచారం.