- కావాలనే సమాచారం దాస్తున్నారా? అంటూ ప్రశ్న
- అఫిడవిట్లో ఉన్న డెడికేషన్ చేతల్లో కనిపించడం లేదంటూ ఫైర్
- చేసిన పని కూడా గుర్తుండకపోతే ఎలా అంటూ నిలదీత
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లపై జ్యుడీషియల్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అడిగిన వాటికి సరైన సమాధానాలు చెప్పడం లేదని.. కావాలని సమాచారం దాస్తున్నారని.. కమిషన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. కమిషన్‌ను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అఫిడవిట్లో డెడికేటెడ్‌గా పనిచేస్తున్నామని చెబుతున్నారని, ఆ డెడికేషన్ చేతల్లో కనిపించడం లేదని పేర్కొంది.
చేసిన పని కూడా గుర్తులేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓపెన్ కోర్ట్ క్రాస్ ఎగ్జామినేషన్‌లో భాగంగా ఇంజనీర్లను విచారిస్తున్న జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్.. బుధవారం మరో 15 మంది ఇంజనీరింగ్ అధికారులను విచారించారు. డిజైన్ఫ్లడ్ గురించి హైడ్రాలజీ సీఈ జి.శంకర్‌నాయక్‌ను జస్టిస్ ఘోష్ ప్రశ్నించగా.. సమాధానం చెప్పలేక తటపటాయించారు.
డిజైన్ ఫ్లడ్పై స్టడీ చేశారా అని కమిషన్ ప్రశ్నించగా.. చేశామని ఓసారి, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), వ్యాప్కోస్ చేసిన స్టడీలనే తాము ప్రపోజ్ చేశామని మరోసారి బదులిచ్చారు. 2016 జనవరి 17న అప్పటి సీఎం ముందు నిర్వహించిన మీటింగ్‌లో వ్యాప్కోస్ డీపీఆర్‌ను సమర్పించింది కదా అని కమిషన్ ప్రశ్నిస్తే.. తాను ఆ మీటింగ్‌లో లేనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వరద, డిశ్చార్జ్ ఫ్లడ్‌కు సంబంధించి సీడబ్ల్యూసీనే క్లియరెన్స్ ఇచ్చిందని పేర్కొన్నారు.
నీటి లభ్యత స్టడీస్ చేయాలని సూచించినం
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించే ప్రదేశాల్లో నీటి లభ్యతపై అధ్యయనం చేయాలని కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులకు సూచించామని జి. శంకర్ నాయక్ తెలిపారు. వందేండ్ల సగటు వరద లేదా ఐఎస్ కోడ్ 5,477 నిర్దేశించిన వరద ప్రమాణాల్లో ఏది ఎక్కువుంటే దాని మేరకు స్టడీస్ చేయాలని సూచించామన్నారు. క్రాస్ సెక్షన్లుండడం, వాగులు వంకలు కలుస్తుండడంతో ఆయా ప్రదేశాల్లో వరద డిశ్చార్జ్‌పైనా అధ్యయనం చేయాలని సూచించామన్నారు.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద నీటి లభ్యత, డిశ్చార్జ్ ఫ్లడ్పై మరోసారి స్టడీ చేయాల్సిందిగా అధికారులతో చెప్పానన్నారు. బ్యారేజీల లొకేషన్లను మార్చడంతో రీఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పానన్నారు. దానికి సంబంధించి మూడు లెటర్లు రాశామని వివరించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద ఉన్న నీటి లభ్యత కలిపి మేడిగడ్డ వద్ద అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. వాస్తవానికి నీటి లభ్యత స్టడీస్ జరిగి ఆ రిపోర్ట్ వచ్చాకే బ్యారేజీల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని.. కానీ, ఈ బ్యారేజీల విషయంలో ఆ స్టడీ రిపోర్ట్ రాకుండానే నిర్మాణం మొదలు పెట్టారని ఆయన కమిషన్‌కు వివరించారు.
బ్యారేజీల జనరల్ అలైన్మెంట్(జీఏ) డ్రాయింగ్స్‌ను కూడా ఆ స్టడీస్ పూర్తయ్యాకే చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే, పలు విషయాల్లో ఆయన సరైన సమాధానం చెప్పకపోవడంతో జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలిసి చెప్పడం లేదా? అసలు తెలియదా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ సర్వీస్‌లోనే ఉన్నారు కదా.. కనీసం చేసిన పనులు కూడా గుర్తుండవా అని నిలదీశారు.
ఎక్కడ మీ డెడికేషన్?
అన్నారం ఏఈఈగా పనిచేస్తున్న ఓ అధికారి తాను డెడికేటెడ్‌గా పనిచేస్తున్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే, కమిషన్ అడిగిన ప్రశ్నలకు మాత్రం తనకేమీ తెలియదన్నట్టుగా వ్యవహరించారు. అన్నారం బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోయినప్పుడు అధికారులకు సమాచారమిచ్చారా అని ప్రశ్నించగా.. ఇచ్చానన్నారు. పై అధికారులకు లెటర్ రాశారా అని ప్రశ్నించగా.. లెటర్లేమీ రాయలేదని, ఓరల్గానే చెప్పామని బదులిచ్చారు.
దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన జస్టిస్ ఘోష్.. ఇదేనా మీ డెడికేషన్ అంటూ ఆ అధికారిని ప్రశ్నించారు. నిజంగా డెడికేషన్ ఉండి ఉంటే పై అధికారులకు లేఖ ద్వారా సమాచారమిచ్చేవారు కదా అని ప్రశ్నించారు. కాగా, ఇప్పటి వరకు 90 మంది ఇంజనీరింగ్ అధికారులను ఓపెన్ కోర్టులో కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మూడు రోజుల పాటు వారు చెప్పిన అంశాల ఆధారంగా ప్రాథమికంగా ఓ నోట్‌ను తయారు చేయనుంది. మళ్లీ సోమవారం నుంచి క్రాస్ ఎగ్జామినేషన్‌ను పునఃప్రారంభించనుంది.