కాళేశ్వరం ఆర్థిక అక్రమాలపై కమిషన్​ నజర్!

  • ఎల్లుండి నుంచి  ఓపెన్​ కోర్టు​
  • ఈసారి హరీశ్, కేసీఆర్​ విచారణ లేనట్టే
  •  52 మంది ఇంజినీర్లకు నోటీసులు.. 14 మంది చొప్పున విచారణ
  • ఆ తర్వాత ఐఏఎస్ లు,​ కాంట్రాక్టర్లు, సబ్​కాంట్రాక్టర్ల ఎంక్వైరీ
  • ఫైనల్​ రిపోర్టును నేరుగా ప్రభుత్వానికే సమర్పించనున్న కమిషన్​
  • ఎల్లుండి నుంచి ఓపెన్​ కోర్టు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఆర్థిక అవకతవకలపై జ్యుడీషియల్​ కమిషన్​ దృష్టి సారించింది. ఈసారి ఓపెన్​ కోర్టులో అధికారులు, కాంట్రాక్టర్లను ఈ అంశంపైనే​విచారించనున్నట్టు తెలిసింది. సోమవారం నుంచి తదుపరి దశ ఓపెన్​ కోర్టును నిర్వహించనున్న కమిషన్.. తొలుత మరో 52 మంది ఇంజినీర్లను విచారించనుంది. అందులో ఫీల్డ్​లో పనిచేసిన ఇంజినీరింగ్​అధికారులే ఎక్కువ మంది ఉన్నట్టు తెలిసింది. 

ప్రాజెక్టుకు సంబంధించిన ఎగ్జిక్యూషన్​లో వాళ్ల పాత్రే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న కమిషన్.. వారిని ఓపెన్​ కోర్టులో ప్రశ్నించనున్నట్టు తెలిసింది. అందులో ఏఈఈ, డీఈఈ, ఈఈ కేడర్​అధికారులున్నట్టు సమాచారం. మూడు నాలుగు రోజుల్లో 14 మంది చొప్పున ఇంజినీర్లను క్రాస్​ ఎగ్జామినేషన్​ చేసి.. డిపార్ట్​మెంట్​అధికారుల విచారణను పూర్తి చేయనున్నట్టు తెలిసింది. 

ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మెయింటెయిన్​ చేసిన రికార్డులు, మెజర్​మెంట్​ బుక్స్​ గురించి ఆరా తీయనున్నట్టు తెలిసింది. వారి విచారణ పూర్తికాగానే ప్రాజెక్టులో భాగమైన, పనిచేసిన ఐఏఎస్​అధికారులను ఓపెన్​ కోర్టుకు పిలవనున్నట్టు కమిషన్​ వర్గాలు చెబుతున్నాయి. 

మాజీ సీఎస్​ సోమేశ్​ కుమార్, ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లో పనిచేసిన సెక్రటరీలు ఎస్కే జోషి, రజత్​ కుమార్, స్మితా సభర్వాల్, మాజీ, ప్రస్తుత ఫైనాన్స్​సెక్రటరీలను ఓపెన్​ కోర్టులో కమిషన్​ క్రాస్​ ఎగ్జామిన్​ చేస్తుందని తెలిసింది. ఇప్పటికే వారు అఫిడవిట్లు సమర్పించడంతో ఇంజినీర్ల విచారణ పూర్తికాగానే.. ఐఏఎస్​లకు కమిషన్​ సమన్లు జారీ చేయనున్నట్టు సమాచారం. 

కాంట్రాక్టర్లపైనా ఫోకస్..​

ఈసారి ఎంక్వైరీలో కాంట్రాక్టర్లపై కూడా కమిషన్​ ఫోకస్​పెట్టినట్టు తెలిసింది. కాంట్రాక్టర్లకు ప్రాజెక్టును అప్పగించిన విధానాలు, టెండర్లు, వారు చేసిన పని, ఆర్థిక లావాదేవీలను ఆరా తీయనున్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి చేసిన చెల్లింపులు, ప్రాజెక్టు కుంగాక తీసుకున్న చర్యలపై కాంట్రాక్టర్ల నుంచి వివరాలు రాబట్టనున్నారు. 

మరోవైపు కాంట్రాక్టర్ల నుంచి సబ్​కాంట్రాక్టులను అప్పగించిన తీరు.. వారికి చేసిన చెల్లింపులు, ఏ బేసిస్​లో పనులను అప్పగించారన్న అంశాలనూ విచారణలో కమిషన్​ తేల్చనుంది. వారితో పాటు అకౌంట్స్​ డిపార్ట్​మెంట్​ అధికారులను కూడా ఓపెన్​ కోర్టులో విచారించనుంది. అధికారులతో పాటు వ్యక్తిగతంగా అఫిడవిట్లు సమర్పించిన విద్యుత్​ రంగ నిపుణుడు రఘు సహా పలువురు వ్యక్తులు, ఎన్జీవోల ద్వారా కూడా ఓపెన్​ కోర్టులో వివరాలను సేకరించనుంది. 

అయితే, ఈసారి ఓపెన్​ కోర్టులో ప్రజాప్రతినిధుల విచారణ లేనట్టేనని తెలిసింది. హరీశ్​ రావును విచారణకు పిలుస్తారని చర్చ జరిగినా.. ముందుగా అధికారుల విచారణను పూర్తి చేయాలని కమిషన్​ భావిస్తున్నట్టు తెలిసింది. అలాగే, కేసీఆర్​ను కూడా ఓపెన్​ కోర్టుకు పిలిచే అవకాశాలు లేవని తెలుస్తున్నది. 

రిపోర్ట్​ నేరుగా ప్రభుత్వానికే..

కమిషన్​ విచారణ ఆలస్యమవుతుండడంతో వీలైనంత త్వరగా పూర్తిచేసి నివేదికను సిద్ధం చేయాలని కమిషన్​ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అధికారులు ఇచ్చిన అఫిడవిట్లు, ఇప్పటిదాకా జరిగిన ఓపెన్​ కోర్టు క్రాస్​ఎగ్జామి నేషన్​ ఆధారంగా ఎప్పటికప్పుడు రిపోర్టు అంశాలను కమిషన్​ సిద్ధం చేస్తున్నట్టుగా తెలిసింది.

 అధికారుల విచారణ పూర్తయ్యాక ఓ పూర్తి స్థాయి నివేదికను తయారు చేసి నేరుగా ప్రభుత్వానికే కమిషన్ అందిస్తుందని తెలిసింది. మరోవైపు ప్రభుత్వానికి చేరిన విజిలెన్స్​ రిపోర్టు ఇంకా కమిషన్​కు అందలేదని తెలిసింది. ఆ రిపోర్టు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరనున్నట్టు సమాచారం. ఎన్​డీఎస్​ఏ నివేదిక కూడా ఇంకా రాలేదని చెప్తున్నారు.