- జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ కసరత్తు
- ప్రజలు ఇచ్చిన అఫిడవిట్ల పరిశీలనకు చర్యలు
- గత సర్కారులోని కీలక నేతలకూ నోటీసులిచ్చే చాన్స్
- హైడ్రాలజీ, టెక్నికల్ కమిటీలతో జస్టిస్ ఘోష్ మీటింగ్
- రెండు వారాల్లో రిపోర్టు ఇవ్వాలని టెక్నికల్ కమిటీకి ఆదేశం
- విజిలెన్స్ రిపోర్టు కోసం సర్కార్కు లేఖ రాయాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై జ్యుడీషియల్ కమిషన్ విచారణ వేగవంతం చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రాజెక్టులో భాగమైన మాజీ ఈఎన్సీలు, ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలను విచారించిన కమిషన్.. గత బీఆర్ఎస్ సర్కార్ లోని పలువురు కీలక నేతలకూ త్వరలో నోటీసులిచ్చి విచారణకు పిలవనున్నట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై బహిరంగ విచారణనూ వీలైనంత త్వరగా మొదలుపెట్టేందుకు కమిషన్చైర్మన్జస్టిస్ పీసీ ఘోష్కసరత్తు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా అన్ని నివేదికలను తెప్పించుకుంటున్నారు. ఇప్పటికే కాగ్ రిపోర్టును పరిశీలించిన ఆయన.. విజిలెన్స్ రిపోర్టును పరిశీలించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఆ నివేదిక రావడం ఆలస్యమవుతుండడంతో, వీలైనంత త్వరగా విజిలెన్స్ రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ప్రస్తుతం టెక్నికల్ అంశాలపైనే దృష్టి..
కాళేశ్వరం అక్రమాలపై త్వరలోనే బహిరంగ విచారణ చేపట్టేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే పబ్లిక్ నుంచి ఒపీనియన్లు తీసుకున్నది. అఫిడవిట్ల రూపంలో ప్రజలు సమర్పించిన ఆధారాలు, వివరాలను జస్టిస్ ఘోష్పరిశీలించనున్నారు. వాటి పరిశీలన పూర్తయ్యాక అఫిడవిట్లు దాఖలు చేసిన వారందరినీ కమిషన్కార్యాలయం బీఆర్కే భవన్కు పిలిపించి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రజలు, అధికారులు, నిర్మాణ సంస్థలు ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా గత బీఆర్ఎస్ సర్కారులో భాగమైన పలువురు కీలక నేతలకు నోటీసులిచ్చే చాన్స్ ఉంది. కాగా, ప్రస్తుతం టెక్నికల్ అంశాలపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన కమిషన్.. అది పూర్తయిన తర్వాతే ఆర్థికపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రస్తుతం బ్యారేజీలకు జరిగిన నష్టంపైనే విచారణ జరుగుతున్నదని పేర్కొంది. ఆర్థికపరమైన అంశాల్లో బ్యారేజీల నిర్మాణ ఖర్చు, రుణాలు, వాటిపై వడ్డీలు తదితరాలపై దృష్టి పెట్టనుంది.
ఇయ్యాల మరికొంత మంది విచారణ..
హైడ్రాలజీ, టెక్నికల్ కమిటీలతో గురువారం జస్టిస్ ఘోష్ సమావేశమయ్యారు. బ్యారేజీల్లో నీళ్లను ఎక్కువగా నిల్వ చేయడం, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే బ్యారేజీలు దెబ్బతిన్నాయని ఆయనకు అధికారులు చెప్పినట్టు తెలిసింది. నిజానికి బ్యారేజీల డెడ్ స్టోరేజీని 3 టీఎంసీల వరకే పరిమితం చేయాల్సి ఉండగా 5 టీఎంసీలకు పెంచారని, అందువల్లే బ్యారేజీలపై ఒత్తిడి పెరిగిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టెక్నికల్ అంశాలపై నివేదిక ఇవ్వాలని, 2 వారాల్లోగా మధ్యంతర నివేదిక సమర్పించాలని అధికారులను జస్టిస్ఘోష్ ఆదేశించినట్టు తెలిసింది. వీలైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని, టెక్నికల్ అంశాలనూ అఫిడవిట్ రూపంలోనే అందజేయాలని ఆదేశాలిచ్చినట్టు సమాచారం. కాగా, శుక్రవారం మరికొంత మంది అధికారులు, ప్రాజెక్టుల్లో భాగమైన వారిని విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మరోవైపు బ్యారేజీల వద్ద ఆకస్మిక పర్యటనలు చేసేందుకూ జస్టిస్ ఘోష్ సిద్ధమవుతున్నారు.