- ఇప్పటికే పవర్ కమిషన్ రెండుసార్లు నోటీసులు
- త్వరలోనే కాళేశ్వరం కమిషన్ కూడా ఇచ్చే చాన్స్
- ఇన్ని రోజులు ఏ విచారణకైనా సిద్ధమన్న గులాబీ బాస్
- ఇప్పుడేమో పవర్ కమిషన్‌పై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, వెలుగు: ఓవైపు పవర్ కమిషన్, మరోవైపు కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీతో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొన్నటిదాకా తన పదేండ్ల పాలనపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పిన గులాబీ బాస్.. ఇప్పుడేమో ఆగమాగమవుతున్నారు. విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి పవర్ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలను తేల్చేందుకు ఏర్పాటైన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది.
మొదటిసారి నోటీసులు జారీ చేసినప్పుడు కమిషన్ విచారణను తప్పుబడుతూ కేసీఆర్ రాసిన లేఖతో ఆయనలోని టెన్షన్బయటపడిందని నిపుణులు అంటున్నారు. ఆధారాలను క్రాస్ చెక్ చేసుకోవడంతో పాటు ఏమైనా వివరాలు ఉంటే కమిషన్ ముందుకొచ్చి ఇచ్చేందుకు అవకాశం ఇస్తున్నామని కమిషన్ రెండోసారి నోటీసులు జారీ చేయగా, ఆ వెంటనే కేసీఆర్హైకోర్టుకు వెళ్లారు. దీంతో కమిషన్ల ఎంక్వైరీ విషయంలో కేసీఆర్‌కు క్లారిటీ వచ్చిందని, వాటి ఆర్డర్లు తనకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆయనకు అర్థమైందని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు కాళేశ్వరం కమిషన్కూడా కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉండడంతో పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయనే అవగాహన ఆయనకు ఉందని.. అందులో భాగంగానే బీఆర్ఎస్ఎమ్మెల్యేలు, లీడర్లతో నిత్యం అందుబాటులో ఉంటున్నారని పేర్కొంటున్నారు. ఏదైనా జరిగితే ఆందోళలకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్లోని తన సన్నిహితులకు కేసీఆర్ఇప్పటికే సూచించినట్టు తెలుస్తున్నది.
మరోవైపు ఇప్పటి వరకు ఏయే రాష్ట్రాల్లో ఇలా జ్యుడీషియల్కమిషన్లు వేశారు? వాటి ఆర్డర్లు ఎలా ఉన్నాయి? తదితర వివరాలను తెప్పించుకుని కేసీఆర్ స్టడీ చేసినట్టు తెలిసింది. కాగా, హైకోర్టులో కుదరకపోతే కమిషన్లపై వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
విచారణ వేగవంతం..
కాళేశ్వరంపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. ఆయన కీలక కేసుల్లో తీర్పులు ఇచ్చారు. ఇక కరెంట్వ్యవహారాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నర్సింహరెడ్డి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. ఆయన కూడా ముఖ్యమైన కేసుల్లో తీర్పులు వెలువరించారు. వాళ్లకున్న అనుభవంతో ఈ రెండు అంశాలపై లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు. కాళేశ్వరంపై టెక్నికల్ కమిటీ వేసి మరీ ఆయా అంశాలను కూడా జస్టిస్పీసీ ఘోష్ తెలుసుకున్నారు. రిటైర్డ్ఇంజినీర్లు, ఈఎన్సీలను పిలిపించుకుని సమాచారం తీసుకున్నారు. వారి నుంచి ఎవిడెన్స్‌గా అఫిడవిట్లు సైతం తీసుకున్నారు. త్వరలోనే కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మినిస్టర్‌కు కూడా నోటీసులు ఇస్తారని తెలుస్తున్నది.
ఇక చత్తీస్ గఢ్ తో విద్యుత్‌కొనుగోలు ఒప్పందాల వల్ల జరిగిన నష్టం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్పవర్ప్లాంట్ల నిర్మాణ పనుల్లో జరిగిన అవకతవకలపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌కు ఇప్పటికే క్లారిటీ వచ్చినట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే సాక్ష్యాధారాలను క్రాస్చెక్చేసుకోవాలంటూ కేసీఆర్ కు నోటీసులు పంపినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కాగా, రెండు కమిషన్లు విచారణను వేగవంతం చేశాయి. 2014 నుంచి గత బీఆర్ఎస్ప్రభుత్వం ఇచ్చిన జీవోలు, సర్క్యులర్లు, మెమోలు, ఒప్పంద పత్రాలను పరిశీలించడంతో పాటు ఓరల్ ఆదేశాలతో ఏవైనా పనులు జరిగితే అవి ఎవరు చెబితే చేశారనే వివరాలను కూడా కమిషన్లు రికార్డు చేస్తున్నాయి.
కమిషన్ల గడువు పెంపు?
కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో మరో రెండు నెలలు గడువు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇక జస్టిస్ నర్సింహారెడ్డితో ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ గడువు కూడా ఇంకో నెల పెంచనున్నారు. దీంతో రెండు కమిషన్లు మరింత లోతుగా ఎంక్వైరీ చేసి ఆర్డర్లు ఇవ్వనున్నాయి.