- హైకోర్టు మాజీ సీజే నేతృత్వంలో ఏర్పాటు చేస్తం: అమిత్ షా
- గవర్నర్ అనసూయ ఉయ్‌కీ ఆధ్వర్యంలో శాంతి కమిటీ
- ఆరు కుట్ర కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తుందని వెల్లడి
- సంక్షోభానికి చర్చలే పరిష్కారమని కామెంట్
ఇంఫాల్: మణిపూర్‌లో జరిగిన అల్లర్లపై హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్ అనసూయ ఉయ్‌కీ ఆధ్వర్యంలో శాంతి కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. గురువారం ఆయన ఇంఫాల్‌లో మీడియాతో మాట్లాడారు. మణిపూర్ సంక్షోభానికి చర్చలే పరిష్కారమని చెప్పారు. ‘‘హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో జ్యుడీషియల్ దర్యాప్తునకు ఆదేశిస్తూ త్వరలోనే ప్రకటన చేస్తాం. గవర్నర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే పీస్ కమిటీలో కుకీ, మైతీ కమ్యూనిటీల ప్రతినిధులతోపాటు, అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ఉంటాయి” అని వివరించారు. మణిపూర్ లో హింసపై నమోదైన ఆరు కుట్ర కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తుందన్నారు. ‘‘హింస తాత్కాలిక దశ మాత్రమే. అపార్థాలు తొలగిపోతాయి. సాధారణ పరిస్థితులు వస్తాయి” అని ఆయన అన్నారు. రిలీఫ్ క్యాంపులను సందర్శించానని, కుకీ, మైతీ సివిల్ గ్రూపులతో భేటీ అయ్యానని, శాంతి ప్రక్రియ గురించి చర్చించానని చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు సహకరిస్తామని వాళ్లు చెప్పారన్నారు. మణిపూర్‌లో పలు సెక్యూరిటీ ఏజెన్సీలు పని చేస్తున్నాయని, వాటి మధ్య సహకారం కోసం ‘ఇంటర్ ఏజెన్సీ యూనిఫైడ్ కమాండ్’ను ఏర్పాటు చేస్తామని అమిత్ షా ప్రకటించారు.
కొత్త డీజీపీగా రాజీవ్ సింగ్
మణిపూర్ కొత్త డీజీపీగా 1993 బ్యాచ్, త్రిపుర క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ రాజీవ్ సింగ్‌ను కేంద్రం నియమించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రజా ప్రయోజనార్థం ఆయన్ను నియమిస్తున్నామని, మూడేండ్లపాటు ఆయన డీజీపీగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాజీవ్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఐజీ (ఆపరేషన్స్)గా పని చేస్తున్నారు. ఇంటర్ క్యాడర్ డిప్యుటేషన్ మీద ఆయన్ను బదిలీ చేశారు. ప్రస్తుత డీజీపీ, 1987 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ పి.డౌంగెల్‌ను హోమ్ డిపార్ట్‌మెంట్‌కు ఓఎస్‌డీగా బదిలీ చేశారు. డౌంగెల్ ఈ నెలాఖరులో రిటైర్ కావాల్సి ఉంది.
లైసెన్స్ లేని వెపన్స్ తిరిగివ్వాలి
మిలిటెంట్ గ్రూపులు కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే.. వాళ్లు సంతకం చేసిన ఒప్పందాలను ఉల్లంఘించినట్లుగానే పరిగణిస్తామని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా హెచ్చరించారు. లైసెన్స్ లేని ఆయుధాలను తక్షణమే తిరిగి ఇవ్వాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నుంచి పోలీసులు కూంబింగ్ ప్రారంభిస్తారని, ఎక్కడైనా ఆయుధాలు పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కాగా, అల్లర్లలో కుటుంబసభ్యులను కోల్పోయిన, గాయాలపాలైన, ఆస్తులను కోల్పోయిన వారికి సహాయ, పునరావాస ప్యాకేజీని త్వరలోనే ప్రకటిస్తామని అమిత్ షా తెలిపారు. మృతులు, గాయపడిన వారి కుటుంబాలకు నేరుగా అకౌంట్లలోనే పరిహారాన్ని జమ చేస్తామన్నారు.