ఒక డ్రెస్ తయారు కావాలంటే.. దానికి అనేక దశలు ఉంటాయి. ముందుగా బట్ట నేయాలి. తర్వాత దాన్ని సరైన ఆకారంలో కత్తిరించి, మెషిన్ మీద కుట్టాలి. ఈ ప్రాసెస్‌లో చాలా క్లాత్ వేస్ట్ అవుతుంది. ఆ వేస్ట్ వల్ల రకరకాలుగా పర్యావరణానికి నష్టం జరుగుతుంది. అందుకే.. అలాంటి క్లాత్ వేస్ట్‌ని ఉపయోగించి హ్యాండీక్రాఫ్ట్స్‌ని చేస్తున్నారు ఇద్దరు ఫ్రెండ్స్. అందుకోసం ఒక స్టార్టప్ పెట్టి.. పది మంది మహిళలకు ఉపాధి కూడా ఇచ్చారు. వాళ్లంతా కలిసి ఎందుకూ పనికిరాని వేస్ట్‌తో అందరూ ఆశ్చర్యపోయేలా అద్భుతమైన ప్రొడక్ట్స్‌ని తయారుచేస్తున్నారు.
ప్రకృతి రావు, అక్షర మెహతా కాలేజీ ఫ్రెండ్స్. వాళ్లు ఫ్యాషన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలి అనుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే జుహు బీచ్ స్టూడియో (జేబీఎస్) అనే స్టార్టప్. దాని ద్వారా టెక్స్‌టైల్ వేస్ట్‌ని పనికొచ్చే హ్యాండీక్రాఫ్టెడ్ ప్రొడక్ట్స్‌లా మారుస్తున్నారు. వీళ్లిద్దరూ ఎన్ఐడీ అహ్మదాబాద్‌లో కలిసి చదువుకున్నారు. అప్పటినుంచే తమ క్రియేటివ్ ఐడియాలను ఒకరితో ఒకరు పంచుకునేవాళ్లు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పర్యావరణం, క్రియేటివిటీ ప్రాజెక్టుల మీద రీసెర్చ్ చేశారు. అప్పుడే వాళ్లను వస్త్ర పరిశ్రమ బాగా ఆకర్షించింది. ఎందుకంటే.. ఫాస్ట్ ఫ్యాషన్ టెక్స్‌టైల్ రంగం వల్ల పర్యావరణం మీద చాలా నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుందని వాళ్లు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఫ్యాబ్రిక్ వేస్ట్, మనుషుల బాధ్యతారాహిత్యం వల్ల ఎదురవుతున్న సమస్యల మీద స్టడీ చేశారు. ఆ సమస్యలకు చెక్ పెట్టేందుకు తమవంతుగా ఏదైనా చేయాలి అనుకున్నారు. కానీ.. చదువు పూర్తయ్యాక ఇద్దరూ తమ తమ పనుల్లో బిజీ అయిపోయారు. కానీ.. కొన్నాళ్లకు మళ్లీ ముంబై చేరుకున్నారు. దేశంలోనే ముంబై రెండో అతిపెద్ద టెక్స్‌టైల్ హబ్‌గా గుర్తింపు పొందింది. అక్కడే వాళ్లు సిటీ చుట్టూ ఉన్న ఫ్యాక్టరీల నుంచి ఉత్పత్తి అవుతున్న ఫ్యాబ్రిక్ వేస్ట్ గుట్టలను, ఫాబ్రిక్ ఆఫ్‌కట్స్, డెడ్‌స్టాక్ మెటీరియల్స్‌తో నిండిన గోడౌన్‌లను చూశారు. అందుకే వాళ్లు ముంబైని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ కావాల్సినంత ఫ్యాబ్రిక్ వేస్ట్ దొరుకుతుంది. వాటితో పనికొచ్చే హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసి తమవంతుగా పర్యావరణానికి కొంతైనా మంచి చేయాలని నిర్ణయించుకున్నారు.
తొలి అడుగులు..
జేబీఎస్ ఆలోచన వాళ్లకు 2019లో వచ్చింది. 2020లో మొదటిసారి వేస్ట్‌ని సేకరించి 60 టోపీలు తయారుచేశారు. అవి చాలా తక్కువ టైంలోనే అమ్ముడయ్యాయి. ఆ తర్వాత 100 స్లింగ్ బ్యాగ్స్ తయారుచేశారు. వాటికి కూడా మంచి గిరాకీ వచ్చింది. దాంతో.. ప్రొడక్షన్ పెంచారు. 2023 నాటికి వాళ్ల దగ్గర చాలా పెద్ద కలెక్షన్ రెడీ అయ్యింది. పూర్తిగా వ్యర్థాలతోనే తయారు చేసిన 1,500 పీస్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. వాటిలో రకరకాల ఉత్పత్తులు ఉన్నాయి. టోపీల నుంచి క్లాత్‌తో చేసిన బొమ్మలు, సిగరెట్లు, పండ్లు లాంటివెన్నో జేబీఎస్‌కి ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టాయి. మొదట్లో ఇలాంటివి ఎవరైనా కొంటారా? అని చాలామంది అనుకున్నారు. కానీ.. వేగంగా మారే ఫ్యాషన్ ట్రెండ్స్‌లో ప్రతీది ప్రత్యేకమే. కాబట్టి ప్రకృతి, అక్షర మార్కెట్‌ని అర్థం చేసుకుని డిమాండ్‌కు అనుగుణంగా ప్రొడక్ట్స్‌ని తీసుకొస్తే.. కచ్చితంగా సక్సెస్ వస్తుందని నమ్మారు. ఆ నమ్మకమే నిజమైంది.
వాటితో ఏం చేస్తారు?
జేబీఎస్లో క్లాత్ వేస్ట్‌తో రకరకాల ప్రొడక్ట్స్‌ని తయారుచేస్తారు. వాటికి ఎంబ్రాయిడరీతో సహా అనేక రకాల హ్యాండ్‌వర్క్ టెక్నిక్స్‌తో తుది మెరుగులు అద్దుతారు. కొన్నింటిని మెషిన్ మీద కుడితే.. మరికొన్నింటికి చేతితో కుట్టుపని చేస్తున్నారు. చివరకు వాటిని ఫ్యాషన్ పీస్‌లుగా మార్చి మార్కెట్లో అమ్ముతున్నారు. అందుకోసం.. ముంబై అంతటా ఉన్న పారిశ్రామిక ప్రాంతాలు, తయారీ యూనిట్ల నుంచి క్లాత్ వేస్ట్‌ని తీసుకొస్తున్నారు. కొన్నిసార్లు విదేశాల నుండి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. క్వాలిటీ టెక్స్‌టైల్ వేస్ట్‌ని వెతికి పట్టుకోవడానికి సంవత్సరం అంతా పనిచేస్తూనే ఉంటారు. డైయింగ్ లోపాల వల్ల పక్కన పడేసిన పెద్ద పెద్ద బట్టల నుంచి తయారీ యూనిట్లలో బట్టలు కుట్టేటప్పుడు మిగిలిన చిన్న చిన్న స్క్రాప్ వరకూ ప్రతీది సేకరిస్తారు. అలా తీసుకొచ్చిన బట్టల క్వాలిటీ, రంగులు, సైజులను బట్టి వాళ్లు తయారుచేసే హాండీక్రాఫ్ట్స్ డిజైన్స్‌ని రెడీ చేస్తారు.
పదిమంది మహిళలకు..
జేబీఎస్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో పనిచేసేది పూర్తిగా ఆడవాళ్లే. ప్రస్తుతం అందులో ఉన్న10 మంది మహిళలు హ్యాండ్ ఎంబ్రాయిడరీ, కుట్టడం, కటింగ్, స్టఫింగ్ చేయడంలో ట్రైనింగ్ తీసుకున్నారు. వేస్ట్‌ని అందంగా మారుస్తున్నారు కాబట్టి ప్రకృతి, అక్షర వాళ్లను ప్రేమగా ‘‘వేస్ట్ ఫెలోస్” అని పిలుస్తుంటారు. రెండేళ్లుగా జేబీఎస్లో పని చేస్తున్న అంజలి పాటిల్ ‘‘ప్రకృతి, అక్షర మాకు అన్నిరకాల టెక్నిక్స్ నేర్పించారు. ఈ స్టూడియో ఇతర వర్క్ప్లేస్ల్లా లేదు. ఇంట్లో ఉండి పనిచేస్తున్నట్టే అనిపిస్తుంది. నాకు అనారోగ్య సమస్య ఉంది. దానివల్ల వేరే ఎక్కడా పనిచేయలేకపోయా. కానీ.. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేస్తున్నా. మేమంతా సరదాగా ఆడుతూ.. పాడుతూ పనిచేసుకుంటాం. అప్పుడప్పుడు జోకులు వేసుకుని నవ్వుకుంటాం. ఎప్పుడూ ఇక్కడ ప్రేమ పూర్వకమైన వాతావరణం ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది.
లైఫ్‌స్టైల్ యాక్సెసరీస్
ఇప్పుడు బిజినెస్‌ని లైఫ్‌స్టైల్ యాక్సెసరీస్ విభాగంలోకి విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. “గార్మెంట్ మార్కెట్ చాలా డెవలప్ అయ్యింది. ప్రజలు అవసరం లేకున్నా చాలా బట్టలు కొంటున్నారు. కానీ.. కొత్త లుక్ కోసం కొత్త బట్టలు కొనాల్సిన అవసరం లేదు. పాత బట్టల లుక్‌నే కొత్తగా మారిస్తే సరిపోతుంది. అందుకే మేం ప్రత్యేకంగా యాక్సెసరీస్‌ని లాంచ్ చేస్తున్నాం” అంటోంది ప్రకృతి.
జూహు బీచ్ పేరు
బ్రాండ్‌కు జూహు బీచ్ అనే పేరు పెట్టడం వెనుక కూడా ఒక కారణం ఉంది. అది ముంబైలోని చాలా అందమైన బీచ్. అందుకే రెగ్యులర్‌గా చాలామంది ప్రజలు వెళ్తుంటారు. వాళ్లలో రకరకాల నేపథ్యాలు ఉన్న వాళ్లు ఉంటారు. కొంతమంది విశ్రాంతి తీసుకోవడానికి, మరికొంతమంది శ్నాక్స్ తినడానికి, వాళ్ల బాధలను మర్చిపోవడానికి వస్తుంటారు. ప్రజలు విశ్రాంతి, ఆనందం కోసం బీచ్‌కి వెళ్లినట్టే.. జీవితాలను క్రియేటివిటీ, చైతన్యంతో నింపే జేబీఎస్ ఉత్పత్తులు వాడాలనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు.