మోదీ గెలిస్తే దేశం నాశనమే : జూలకంటి రంగారెడ్డి

నకిరేకల్, వెలుగు : ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద మోసగాడు అని, మూడోసారి ఆయన గెలిస్తే దేశాన్ని నాశనం చేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. బుధవారం పట్టణంలోని నర్రా రాఘవరెడ్డి భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోకు, అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరిస్తున్న విధానాలకు సంబంధం లేదన్నారు.

 గత పదేండ్లలో మోదీ దేశాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు నష్టం కలిగించే విధానాలను పెద్ద ఎత్తున అవలంభిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టకుండా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని ప్రకటించడం సరికాదన్నారు.  అర్థంపర్థం లేని విమర్శలు చేసి తమ స్థాయిని దిగజార్చుకోవడం సమంజసం కాదన్నారు. 

భువనగిరి సీపీఎం ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్ ను గెలిపించాలని కోరారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల, జిల్లా కమిటీ సభ్యులు బోజ్జ చిన్న వేంకులు, రాచకొండ వెంకట్ గౌడ్, నాయకులు వంటిపాక వెంకటేశ్వర్లు, సీహెచ్ మారయ్య, ఒంటెపాక కృష్ణ, చెన్నబోయిన నాగమణి, ఏర్పుల తాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.