లండన్/వాషింగ్టన్: గూఢచర్యం ఆరోపణల కేసులో అమెరికాతో సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఎట్టకేలకు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. నేరాన్ని అంగీకరిస్తానని.. అందుకు బదులుగా అదనపు శిక్ష విధించకుండా తనను విడుదల చేయాలంటూ అమెరికా న్యాయ శాఖతో ఆయన డీల్ కుదుర్చుకున్నారు. డీల్‌లో భాగంగా అసాంజే నేరాన్ని అంగీకరించేందుకు సిద్ధమయ్యారంటూ బ్రిటన్ కోర్టుకు అమెరికా న్యాయ శాఖ సోమవారం డాక్యుమెంట్లను అందజేసింది.
దీంతో అమెరికా కోర్టులో హాజరయ్యేందుకు వీలుగా మంగళవారం ఉదయం అసాంజేను బ్రిటన్ కోర్టు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. జైలు నుంచి విడుదలైన ఆయన ప్రత్యేక విమానంలో ఆస్ట్రేలియా సమీపంలో ఉన్న అమెరికన్ భూభాగమైన నార్తర్న్ మరియానా ఐల్యాండ్స్ రాజధాని సైపన్‌కు బయలుదేరారు. బుధవారం అక్కడి యూఎస్ కోర్టులో హాజరై తన నేరాన్ని అంగీకరించనున్నారు. అసాంజే నేర అంగీకార పత్రంపై జడ్జి సంతకం చేయగానే.. ఆయన ఈ కేసు నుంచి బయటపడనున్నారు. జడ్జి తీర్పు తర్వాత ఆయన తన సొంత దేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు.
ఇదీ కేసు..
ఆస్ట్రేలియాకు చెందిన అసాంజే (52) 2006లో వికీలీక్స్ సంస్థను స్థాపించారు. అమెరికా ఆర్మీ ఇంటెలిజెన్స్ మాజీ ఆఫీసర్ చెల్షియా మానింగ్ నుంచి మిలిటరీ సీక్రెట్ ఫైల్స్ సేకరించి 2010లో పబ్లిష్ చేయడంతో అసాంజే పేరు అంతర్జాతీయంగా మారుమోగింది. ఇరాక్‌లోని బాగ్దాద్‌లో అమెరికా చేసిన ఎయిర్ స్ట్రైక్ లో ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టులు సహా అనేక మంది ప్రజలు చనిపోయిన ఘటన వీడియోను రిలీజ్ చేయడం సంచలనంగా మారింది.
ఇరాక్, అఫ్గానిస్తాన్ యుద్ధాలకు సంబంధించిన వీడియోలను, యూఎస్ డిప్లమాటిక్ డాక్యుమెంట్లతో సహా లక్షలాది సీక్రెట్ ఫైల్స్‌ను ఆయన బయటపెట్టారు. అయితే, అసాంజే గూఢచర్యానికి పాల్పడ్డారని, తమ దేశ మిలిటరీ రహస్య పత్రాలను బహిర్గతం చేశారని అమెరికా కేసు నమోదు చేసింది. స్వీడన్లో ఓ మహిళపై అత్యాచారం చేశారంటూ మరో కేసు నమోదైంది.
ఈ కేసులో అసాంజేను స్వీడన్‌కు అప్పగించాలని బ్రిటీష్ కోర్టు 2012లో ఆదేశించడంతో.. ఆయన లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకున్నారు. 2019లో అసాంజేకు ఈక్వెడార్ ఆశ్రయం రద్దు చేయడంతో అరెస్ట్ అయ్యారు. బెయిల్ రూల్స్ ఉల్లంఘించినందుకు బ్రిటిష్ కోర్టు 50 వారాల జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష పూర్తయినా.. గూఢచర్యం కేసులో అమెరికాకు అప్పగించడానికి సంబంధించిన విచారణ పెండింగ్‌లోనే ఉండటంతో అప్పటి నుంచి ఆయన బ్రిటన్ జైలులోనే ఉన్నారు. తాజాగా అమెరికాతో డీల్‌తో ఆయన ఐదేండ్ల తర్వాత రిలీజ్ అయ్యారు.