
స్థానికులకు అంగన్వాడీ పోస్ట్ కేటాయించాలని డిమాండ్
జూలూరుపాడు, వెలుగు: స్థానిక మహిళలకు అంగన్వాడీ పోస్ట్ కేటాయించాలని అంగన్వాడీ కేంద్రానికి తాళం వేసి నిరసన తెలిపిన ఘటన శుక్రవారం జూలూరు మండల కేంద్రంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో మండల పరిధిలోని వెంగన్న పాలెం గ్రామం అంగన్వాడీ 2 కేంద్రంలో ఆయా పోస్ట్ కు నోటిఫికేషన్ రాగా గతంలో పని చేసిన అధికారులు స్థానికేతర మహిళ స్థానికత ఉన్నట్లు పత్రాలను సృష్టించి పోస్ట్‌ను ఆమె కేటాయించారు. కాగా, ఇటీవల జూలూరుపాడు అంగన్ వాడీ4 లో టీచర్, ఆయా పోస్ట్ ఖాళీ ఉండటంతో ఆ సదరు మహిళ తన స్థానికత ఇక్కడే ఉందంటూ అక్కడికి పోస్ట్ మార్పించుకుంది.
శుక్రవారం జూలూరుపాడు అంగన్ వాడీ 4 కేంద్రంలో ఉన్నతాధికారులు సెక్టార్ మీటింగ్ కు వస్తున్నారన్న సమాచారంతో గ్రామంలోని మహిళలు అంగన్ వాడీ కేంద్రానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. గతంలో వెంగన్నపాలెం అంగన్ వాడీ 2 కేంద్రంలో స్థానికత అంటూ అక్రమ మార్గంలో ఉద్యోగం పొంది, ఇప్పుడు జూలూరుపాడు అంగన్వాడీ 4 కేంద్రానికి రావడం ఎంత వరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆమెను యథాస్థానానికి పంపించి స్థానిక మహిళకు పోస్టు కేటాయించాలని నిరసన తెలిపారు. సీడీపీఓ సలోమికి విషయం వివరించి న్యాయం చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతానని సీడీపీఓ హామీ ఇచ్చారు.