- రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్
- మంత్రులతోపాటు పార్టీ ముఖ్య నేతల హాజరు
హైదరాబాద్, వెలుగు: పీసీసీ కార్యవర్గ సమావేశం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రజా భవన్ లో జరగనుంది. పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి దీనికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయంపై ప్రధానంగా ఇందులో చర్చించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రతి పల్లెకు, ప్రతి గడపకు తీసుకెళ్లేలా చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా డిస్కస్ చేయనున్నారు.
రైతు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీపై కూడా చర్చ జరగనుంది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఆరు గ్యారంటీల అమలు తీరును ప్రజలకు తెలియజేసేందుకు అవసరమైన చర్యలపై చర్చించనున్నారు. సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధపై విస్తృత ప్రచారం సాగేలా రూపొందించాల్సిన కార్యక్రమాలను డిస్కస్ చేయనున్నారు.
ప్రతిపక్ష నేతగా రాహుల్ ఎన్నికైన విషయాన్ని ఇందులో ప్రస్తావిస్తూ ఆయనకు ఈ సమావేశం అభినందనలు తెలియజేయనుంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, దానికి ముందు చేపట్టాల్సిన కుల గణనపై కూడా చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై డిస్కస్ చేయనున్నారు.