జులై నెలలో వచ్చే పండుగలు.. వాటి ప్రాముఖ్యత ఇదే..

జులై నెలలో వచ్చే పండుగలు.. వాటి ప్రాముఖ్యత ఇదే..

భారతదేశం, విభిన్న సంస్కృతులు ... వివిధ  నమ్మకాలు.. పలు ఆచారాల కు  నిలయం. హిందూ పురాణాల్లో ప్రతి పండుగ ప్రత్యేకమైనది.  ఈ నెలలో తెలంగాణలో ఎంతో వైభవంగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటారు. జులై నెలలో ఏఏ పండుగలు ఉన్నాయి.. వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.

 జూలై 3చంపకుళం.. బోట్ రేస్, కేరళ : ఎంతో ప్రాచీనమైన బోట్​ రేస్​ . అలప్పుజకు సమీపంలోని చంపాకుళం వద్ద పంపా నదీ తీరంలో ఈ రేస్​ ప్రారంభమవుతుంది. జులైలో వర్షాల కాలంలో నదులు, జలాశయాల్లో భారీగా నీరు చేరి నిల్వ ఉంటుంది.  పంటలు బాగా పండాలని  నదీమతల్లులకు పూజలు జరిపి  కేరళలో నిర్వహించే రేసులలో ఇది మొదటిది. 

జూలై 5డ్రీ ఫెస్టివల్: అరుణాచల్​ ప్రదేశ్​లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జులై 5న అపాటాని తెగ ప్రజలు ..  రైతు పండుగను జరుపుకుంటారు. ఆ తెగ ఆచారాల ప్రకారం  వారి కుల దేవతలైన  తమూ, మేటిస్, డానీ,  హర్నియాంగ్ దేవతలను పూజిస్తారు. ఈ పండుగ రోజు బియ్యంతో పొంగలి ప్రసాదం చేసి అమ్మవార్లకు నివేదన సమర్పించి...ఇరుగు పొరుగువారికి పంచి పెడతారు.  అలాగే ఇంట్లోని పెద్దలకు, తోబుట్టువులకు, అత్త మామలకు, తల్లిదండ్రులకు, అక్క చెల్లెళ్లకు బట్టలు పెట్టి ఎంతో ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. 

జూలై 7 నుండి జూలై 14 వరకు తెలంగాణలో బోనాలు:  ఆషాఢమాసం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్​ లో బోనాల హడావిడి  ప్రారంభమవుతుంది.  ఓ పక్క అమ్మవారి భక్తులు... మరో పక్క రాజకీయ నేతల హడావిడి అంతా ఇంతా కాదు.  తెలంగాణలో బోనాల పండుగకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. జంట నగరాలైన హైదరాబాద్​, సికింద్రాబాద్​ లలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. మహంకాళీ అమ్మవారి బోనాలు ఈ వేడుకలో ప్రధానమైనది.  ఆరోజున హైదరాబాద్​ అంతటా కోలాహలంగా ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేస్తారు. 

జూలై 7... పూరీ జగన్నాథ రథయాత్ర:  ఒరిస్సా తో పాటు దేశవ్యాప్తంగా ఈ పండుగ సంబరాలు జరుపుకుంటారు. అత్యంత గౌరవనీయమైన వేడుకలలో ఒకటి జగన్నాథ రథయాత్ర.  ఒరియా క్యాలెండర్‌ ప్రకారం శుక్ల పక్ష ఆషాఢ మాసం రెండవ రోజున జరుపుకుంటారు. దీనిని గుండిచా యాత్ర, రథోత్సవం, నవాదిన యాత్ర అని కూడా అంటారు. ఆ తర్వాత తొమ్మిదవ రోజున, దేవతలు .. రథయాత్ర ద్వారా  ప్రధాన ఆలయానికి తిరిగి వస్తారు. పూరీ జగన్నాథుడి రథయాత్ర సమయంలో దేశం నలుమూలల నుంచి భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు. 

జులై 11–- 17లడఖ్ లో పోలో ఫెస్టివల్ ఉత్సవాలు:  బాల్టిస్తాన్ యువరాణి 14 వ శతాబ్దంలో ఈ పండుగను ప్రారంభించింది. లడఖ్ సంస్కృతిని కాపాడేందుకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.  ఆ ప్రాంత ప్రజలు  జులై 11 నుంచి 17 వరకు ఆట పాటలతో పాటు.. వాయిద్య సంగీతం ,జానపద నృత్యాలు...   విలువిద్య పోటీలు, సాంప్రదాయ విందు, హస్తకళల ప్రదర్శన లాంటివి కూడా నిర్వహిస్తారు .  ప్రతి ప్రార్ధనా మందిరాన్ని రంగులతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

జూలై 22 అంతర్జాతీయ మామిడి పండుగ దినోత్సవం: దీనినే మామిడి పండుగ అంటారు. ఆ రోజున ( జులై 22) ఢిల్లీలో దసరా, లాంగ్రా, చౌసా, ఫజ్లీ, నీలాలు,జలాలు, పునాస మామిడి, బంగన్‌పల్లి, అల్ఫోన్సో ఇంకా  500 రకాల మామిడి పండ్లతో ఎగ్జ్​బిషన్​ నిర్వహిస్తారు. ఈ రోజున   కొత్త రకాలైన మామిడిపండ్లతో తయారు చేసిన పదార్దాలను రుచి చూడటంతోపాడు... మామిడి పండ్లు తినడం.. మ్యాంగో జ్యూస్​ పంచిపెట్టడం వంటివి చేస్తుంటారు. కొన్ని ప్రదేశాల్లో మామిడి పండ్ల ఈవెంట్​లు నిర్వహిస్తుంటారు.