ఎమ్మెల్సీ ఎన్నికకు జంబో బ్యాలెట్..బరిలో 52 మంది అభ్యర్థులు

  •     ఈ నెల 27న పోలింగ్, జూన్​ 5న కౌంటింగ్​
  •     ఓటేయనున్న 4,61,806 మంది పట్టభద్రులు
  •     ప్రచారానికి పర్మిషన్ తప్పనిసరి
  •     2 జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు
  •     ఆర్ఓ, నల్గొండ దాసరి హరిచందన

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ, ఖమ్మం,- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నట్లు నల్గొండ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్​అధికారి దాసరి హరిచందన తెలిపారు. ఈ నెల 2న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్​రాగా నామినేషన్లను స్వీకరించి 13న స్క్రూట్రీని నిర్వహించామన్నారు. 11 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారని తెలిపారు.

బుధవారం నల్గొండ కలెక్టరేట్​లోని ఆర్ఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్​మీట్ లో ఆమె మాట్లాడారు. పార్లమెంట్​ఎన్నికల నిర్వహణ సజావుగా సాగిందని, జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఇబ్బందులు తలెత్తలేదన్నారు. ఈవీఎంలను అనిశెట్టి దుప్పలపల్లిలోని గోదాముల్లో పోలీస్ పహారా నడుమ భద్రపరిచామని, కౌటింగ్​కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు.

పట్టభద్రుల ఎన్నికల ప్రచారం నిర్వహించే అభ్యర్థులు ఆయా జిల్లాల్లో తప్పనిసరిగా ఏఆర్ఓల పర్మిషన్ తీసుకోవాలన్నారు. అభ్యర్థి ప్రచారంలో నిర్వహించే ఖర్చుకు ఎలాంటి లిమిట్ లేదని, వివరాలు మాత్రం కచ్చితంగా తెలపాలన్నారు. ఇంటి గోడలకు పోస్టర్ వేయాలన్నా ఓనర్ అనుమతి తీసుకోవాలని సూచించారు. 12 జిల్లాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదులకు సీ విజిల్, సాక్ష్యం యాప్​లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ఎన్నికలో 52 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో జంబో బ్యాలెట్ ద్వారా పోలింగ్​నిర్వహించనున్నామని

ప్రింటింగ్ కూడా ప్రారంభమైందని వివరించారు. 12 జిల్లాలలో మొత్తం 4,61,806 మంది పట్ట భద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. అందుకు సంబంధించి 605 పోలింగ్​ కేంద్రాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సిద్దిపేటలో 4,679, జనగామలో 23,419 ఓటర్లు, హన్మకొండ లో 43,729, వరంగల్ లో 43,812, మహబూబాబాద్ లో

34,933, ములుగు 10,299, జయశంకర్ భూపాలపల్లి 12,535, భద్రాద్రి 40,106, ఖమ్మం 83,879, యాదాద్రి 34,080, సూర్యాపేట 51,497, నల్గొండ 80,871 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారన్నారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 83,879 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా సిద్దిపేటలో ఉన్నారు.

ఉప ఎన్నిక నిర్వహణపై వీసీ

ఉప ఎన్నిక నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్ దాసరి హరిచందనతో పాటు12 జిల్లాల ఏఆర్ఓలు నల్గొండ జిల్లా కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. ఉప ఎన్నికలో బ్యాలెట్ బాక్స్ లు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణపై పలు సూచనలు చేశారు. శాసన మండలి ఉప ఎన్నిక నిర్వహణకు సరిపడా బ్యాలెట్ బాక్సులు ఉన్నాయని, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, అనుమతులు, ఎన్నికల ప్రచారం, ర్యాలీలు తదితర అంశాలపై అభ్యర్థులకు బుధవారం జరిగిన  సమావేశంలో

అవగాహన కల్పించామని ఆర్ఓ  హరిచందన ఎన్నికల సంఘం అధికారులకు తెలిపారు. అడిషనల్ ఎన్నికల అధికారులు సర్ఫరాజ్ అహ్మద్, లోకేశ్ కుమార్, డిప్యూటీ సీఈ ఓ సత్యవాణి , నల్గొండ కలెక్టరేట్ నుంచి మిర్యాలగూడ ఆర్డీఓ, ఏఆర్ఓ శ్రీనివాసరావు, చండూరు ఆర్డీఓ, ఏఆర్ఓ సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.