41 డిగ్రీల ఎండలో క్రికెట్ మ్యాచ్.. ఉపవాసం ఉంటూ చనిపోయిన పాకిస్థాన్ సంతతి క్రికెటర్

41 డిగ్రీల ఎండలో క్రికెట్ మ్యాచ్.. ఉపవాసం ఉంటూ చనిపోయిన పాకిస్థాన్ సంతతి క్రికెటర్

అడిలైడ్‌ వేదికగా జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో విషాదం చోటు చేసుకుంది. పాకిస్తాన్ సంతతికి చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్ జునైద్ జాఫర్ ఖాన్ తీవ్రమైన ఎండలో క్రికెట్ ఆడడం వలన మైదానంలో కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటన శనివారం (మార్చి 15) సాయంత్రం 4 గంటలకు జరిగింది. కాన్కార్డియా కాలేజ్ ఓవల్‌లో ఓల్డ్ కాన్కార్డియన్స్, ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ ఓల్డ్ కొలీజియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పారామెడిక్స్ నుండి అతనికి వెంటనే వైద్య సహాయం అందించినప్పటికీ ఖాన్‌ను బ్రతికించలేకపోయారు.

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఇది సమ్మర్ సీజన్ అక్కడ ఉష్ణోగ్రతలు 40°C కంటే ఎక్కువగా ఉన్నాయి. మ్యాచ్ జరిగే సమయంలో ఉష్ణోగ్రత 41.7 డిగ్రీలుగా ఉన్నట్టు సమాచారం. పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటూ జునైద్ జాఫర్ ఖాన్  మరణించినట్టు తెలుస్తుంది. జునైద్ రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉన్నప్పటికీ రోజంతా నీరు తాగేవాడట. ముస్లింలు ఆరోగ్యం బాగాలేనప్పుడు మంచి నీరు తాగడానికి అనుమతి ఉంటుందట. 40 ఏళ్ల వయసులో ఉన్న ఖాన్ 2013లో పాకిస్తాన్ నుండి అడిలైడ్‌కు వెళ్లాడు.అక్కడే ఉంటూ టెక్ పరిశ్రమలో కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.

Also Read :- ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బంపరాఫర్

క్లబ్ ఓల్డ్ కాలేజియన్స్ జునైద్ జాఫర్ ఖాన్ కు సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. "ఓల్డ్ కాన్కార్డియన్స్ క్రికెట్ క్లబ్‌కు చెందిన విలువైన సభ్యుడి మరణం మాకు చాలా బాధ కలిగించింది. ఈ రోజు కాన్కార్డియా కాలేజ్ ఓవల్‌లో ఆడుతున్నప్పుడు విషాదకరంగా అతను ఇబ్బందులకు గురయ్యాడు. పారామెడిక్స్ ఎంత ప్రయత్నించినా అతను బ్రతకలేదు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబం, స్నేహితులు, సహచరులతో నా ఆలోచనలు, హృదయపూర్వక సానుభూతి ఉన్నాయి." అని తమ సంతాపం ప్రకటించింది.