అప్పటివరకు అన్నీ తామై ఉంటారు. ఇంటిల్లపాదికి గొడుగు అవుతారు. కానీ వయసు మీద పడ్డాక పలు కారణాల వల్ల శరీరం సహకరించదు. మానసికంగా డస్సిపోతారు. అయితే ఇలానే అందరూ ఉంటారని కాదు. కానీ... వయసు మీద పడిన వాళ్లకు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు ఒక ఎత్తయితే... ఆర్ధికంగా, ఎమోషనల్‌గా, శారీరకంగా ఎదుర్కొనే వేధింపులు మరొకవైపు. అవ్వాతాతలు ఎదుర్కొనే సమస్యల గురించి జనాల్లో అవగాహన కలిగించి, ఆ సమస్యలన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది జూన్15న వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే జరుపుతున్నారు.
కుటుంబ సభ్యులు, బయటి వాళ్లు పెద్దవాళ్లని నిర్లక్ష్యం చేయడం, వేధించడం వంటి వాటికి చెక్ పెట్టాలనే లక్ష్యంతో ఏర్పడిందే ఈ డే. ఓల్డేజ్ వాళ్ల మీద అమెరికాలో ఒక స్టడీ చేశారు. వయసుమీద పడిన పదిమందిలో ఒక అమెరికన్ ఏదో ఒక వేధింపుకు గురవుతున్నారని తేలింది అందులో. ఇలాంటి ఒకటో రెండో కేసులు మాత్రమే అధికారుల వద్దకు వెళ్తున్నాయి. అందుకు కారణం ఇలాంటి కేసుల గురించి బాధితులు రిపోర్ట్ చేయలేని పరిస్థితులు కావచ్చు. ఇలాంటప్పుడు చుట్టుపక్కల వాళ్లు ఎవరైనా రిపోర్ట్ చేయొచ్చు.
వాళ్ల విలువ వెలకట్టలేనిది
అవ్వాతాతలని సరిగా చూడకపోవడం, వేధించడం వల్ల వెలకట్టలేని ఆ ఆస్తిని సమాజం కోల్పోవాల్సి వస్తోంది. ఇలాంటి వేధింపుల గురించి ఎన్నో వార్తలు చూస్తున్న ఈ రోజుల్లో వాటి గురించి ఎంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. శారీరక వేధింపులతో మొదలుపెట్టి ఆర్థికంగా వాళ్లను దోచుకోవడం వరకు ప్రపంచవ్యాప్తంగా కామన్ ప్రాబ్లమ్. అయితే అటువంటి సమస్యలను కుటుంబ సమస్యలుగా చూస్తున్నారే తప్ప పెద్దవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలుగా చూడట్లేదు.
ఒకవేళ గుర్తించినా వాటికి రెస్పాన్స్ కూడా చాలా తక్కువ. అందుకే ఇలాంటి ఒక డేను చేయడం వల్ల గ్లోబల్‌గా కొన్ని లక్షల మంది అవ్వాతాతల ఆనందాల్ని, ఆరోగ్యాన్ని కాపాడొచ్చు. సమాజంలో వాళ్లు గౌరవంగా బతికేలా చేయడమే ఈ డే ముఖ్య ఉద్దేశం.
ఇలా మొదలైంది...
ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో చిన్న గ్రూప్ ఒకటి 1997వ సంవత్సరంలో ‘ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఎల్డర్ ఎబ్యూజ్(ఐఎన్పిఇఎ)’ను స్థాపించింది. అలా మొదలైన ఈ గ్రూపులో తరువాతి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వందల మంది సభ్యులు చేరారు. దీని లక్ష్యం అవ్వాతాతల మీద జరుగుతున్న వేధింపుల గురించి అవగాహన కల్పించడం.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్ఓ), ఐఎన్పీఇఎతో కలిసి 2002లో ‘‘మిస్సింగ్ వాయిసెస్” అనే ఒక స్టడీ చేసింది. దాని ద్వారా పెద్దవాళ్ల మీద జరుగుతున్న వేధింపుల గురించి గ్లోబల్‌గా అవగాహన కల్పించింది. ఈ పార్ట్నర్షిష్లో ‘వరల్డ్ ఎల్డర్ ఎబ్యూజ్ అవేర్నెస్ డే’ను 2006లో మొదలుపెట్టారు. న్యూయార్క్‌లో మొట్టమొదటి డే చేశారు. ఆ తరువాత జెనివా, ఒట్టావా, ప్యారిస్, టొరంటోలలో దీనికి సంబంధించిన ఈవెంట్లు జరిగాయి. అప్పటినుంచి గ్లోబల్‌గా అన్ని దేశాలు ‘ఎల్డర్ జస్టిస్’ను లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఆస్ట్రేలియాలో తొలి అడుగులు పడిన ఈ జర్నీ యాన్యువల్ ఈవెంట్ జరిగాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ విషయం గురించి గ్లోబల్‌గా ఎందుకు మాట్లాడాలో కూడా అప్పుడే అందరికీ తెలిసింది. అవ్వాతాతలకు గౌరవం దక్కాలి. వాళ్లను సురక్షితంగా ఉంచాలి. వేధింపులు ఎదుర్కోని, నిర్లక్ష్యానికి గురికాని సమాజాన్ని వాళ్లకు ఇవ్వాలి. దానికోసం అందరూ కలిసి పనిచేయాలని డిసైడ్ అయ్యారు.
స్పెషల్ డేను ఇంకా స్పెషల్‌గా...
పర్పుల్ పవర్ : పర్పుల్(ఊదా రంగు)తో ఈ స్పెషల్ డేను మరింత స్పెషల్‌గా మార్చాలి. వరల్డ్ ఎల్డర్ ఎబ్యూజ్ అవేర్నెస్ డే అఫీషియల్ కలర్ ఇది. అందుకే ఆ రోజున ఊదా రంగు లేదా ప్లమ్ కలర్(గోధుమ ఊదా రంగు) బట్టలు వేసుకుని సంఘీభావం చూపించొచ్చు.
సోషల్ మీడియా : సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో డిజిటల్ వారియర్ అయిపోండి. అవ్వాతాతల మీద జరిగే వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడొచ్చు. వాస్తవాలు, కథలు లేదా అందుకు సంబంధించిన మెసేజ్‌లు WEAAD (వరల్డ్ ఎల్డర్ ఎబ్యూజ్ అవేర్నెస్ డే) హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ చేయొచ్చు.
మాటలు, ముచ్చట్లు : వర్చువల్ టీ పార్టీ ఏర్పాటుచేయొచ్చు. లేదా ఒక చిన్నపాటి గెట్ టు గెదర్ ఏర్పాటుచేసి స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా కొలీగ్స్‌ని పిలవచ్చు. అలా నలుగురు కలిసిన దగ్గర పెద్దవాళ్లు ఎదుర్కొనే వేధింపులను ఆపేందుకు ఎలా ఫైట్ చేయాలనే విషయాలు మాట్లాడుకోవచ్చు. సీరియస్ విషయాలు మాట్లాడి బుర్ర హెవీగా అయ్యిందే అని ఫీల్ కాకుండా సరదాగా అందరి నోళ్లు తీపి చేసేందుకు కేక్ కటింగ్ కూడా చేసుకోవచ్చు. నోటికి అందిన తీపితో పెద్దవాళ్లకు సురక్షితమైన సమాజాన్ని ఎలా ఇవ్వాలనే విషయాలు ఆలోచించొచ్చు.
నలుగురితో కలిసి : అవ్వాతాతల మీద జరుగుతున్న వేధింపుల గురించి తెలుసుకోవడమే కాకుండా చుట్టుపక్కల వాళ్లను కూడా ఎడ్యుకేట్ చేయాలి. అందుకు అనేకమార్గాలు ఉన్నాయి. ఆన్లైన్ వాడుకోవచ్చు, వెబినార్ వంటివి పెట్టొచ్చు. ఆ ఆన్లైన్ సమావేశానికి స్పీకర్స్, ఎక్స్‌పర్ట్స్‌ను పిలిచి వాళ్లతో మాట్లాడించొచ్చు. వీలైతే ఇంట్లోనే చిన్న కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు.
కళ ద్వారా : విజువల్ ఆర్ట్, కవిత్వం లేదా సంగీతం వంటి కళా రూపాల ద్వారా పెద్దవాళ్ల మీద జరుగుతున్న వేధింపుల గురించి మాట్లాడొచ్చు.ఇలాంటి యాక్టివిటీల వల్ల అవగాహన పెంచడమే కాకుండా అవ్వాతాతలకు రక్షణ, విలువలతో కూడిన ఒక మంచి సమాజాన్ని ఏర్పాటుచేసే ప్రయత్నం చేయొచ్చు.