తెలంగాణలోని పీడిత, వంచిత వర్గాలకు తన పదునైన పాటలతో తిరుగుబాటును నేర్పారు ప్రజాకవి గూడ అంజయ్య. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపురం గ్రామంలో లక్ష్మమ్మ,- లక్ష్మయ్య దంపతులకు నిరుపేద దళిత కుటుంబంలో 1955లో ఆయన జన్మించారు. అనేక ఆటుపోటులను ఎదుర్కొని విద్యను అభ్యసించారు. బాల్యం నుంచే ప్రగతిశీల భావాలు కలిగిన అంజయ్య సమాజాన్ని సూక్ష్మ పరిశీలన చేశారు. ఈ క్రమంలోనే ప్రజా ఉద్యమాల వైపు ఆకర్షితుడయ్యారు. ఆనాడు దొరలు, పెత్తందారుల ఆగడాలపై తన అక్షరాన్నే ఆయుధంగా సంధించారు. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపారు. ఒక వైపు కుటుంబ పోషణ కోసం వృత్తిరీత్యా ఫార్మసిస్ట్ గా పనిచేస్తూ.. మరోవైపు విప్లవ, దళిత, సామాజిక ఉద్యమాల్లో అంజయ్య పాటై పోటెత్తారు. 'ఊరిడిసి నే పోదునా.. అయ్యో ఉరి పోసుకొని సద్దునా ' అంటూ వడ్డీలతో కుదేలవుతున్న రైతన్నల దీనస్థితిని తన తొలి పాటలోనే కళ్లకు కట్టారు. ' నేను రాను బిడ్డో.. సర్కార్ దవాఖానకు ' అంటూ సరైన సదుపాయాలు లేకుండా పేదలను వెక్కిరించే ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిని సైతం వివరించారు.
పట్నం దోపిడీని తెలియజేస్తూ.. 'భద్రం కొడుకో.. నా కొడుకో కొమురయ్య జర' అంటూ పొట్టకూటి కోసం పల్లెను విడిచి పట్నానికి బయలుదేరిన యువకుడికి తన పాటతో జాగురత చెప్పాడు. ఇక ఆనాటి దొరల అరాచకాలను సవాల్ చేస్తూ.. కాలు కింది దుమ్ము లేచి కంట్లో పడినట్లుగా ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా.. నడుమ దొర ఏందిరో .. వాడి పీకుడేందిరో అనే పాటతో సామాన్యులకు ధిక్కారం నూరిపోశాడు. జనాన్ని ఉర్రూతలూగించి..16 భాషల్లో అనువాదమైన ఈ పాటను ఆర్.నారాయణమూర్తి తన ఎర్రసైన్యం సినిమాలో ఉపయోగించుకున్నారు. మలి తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్న అంజయ్య..
' తెలంగాణ ధూంధాం' సాంస్కృతిక సంఘం రూప కల్పనలో కీలక భూమిక పోషించారు. 'అయ్యోనివా.. నువ్వు అవ్వోనివా.. తెలంగాణోడికి తోటి పాలోనివా? అంటూ ఆంధ్ర దోపిడీ వర్గాలను పాటతో సూటిగా ప్రశ్నించారు. ' పుడితొక్కటి.. సత్తె రెండు రాజిగా ఓరి రాజిగ.. ఎత్తుర తెలంగాణ జెండా ' అంటూ సబ్బండ వర్గాలను ఉద్యమ కదనరంగంలోకి దూకేలా చేశాడు. వందలాది సభలు, సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ భావజాల వ్యాప్తి కోసం తీవ్రంగా శ్రమించారు. నాలుగు దశాబ్దాల పాటు చైతన్యవంతమైన పాటలు, స్ఫూర్తినిచ్చే కథలు రాసిన అంజయ్య 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కళ్లారా చూశారు. అనంతరం పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2016 జూన్ 21న ఆయన తుదిశ్వాస విడిచారు.
అంజయ్య చివరి కోరికను పట్టించుకోని కేసీఆర్
తొలి, మలి తెలంగాణ ఉద్యమాల్లో తన పాటలతో ప్రజలను కదిలించిన గూడ అంజయ్య 2016లో తీవ్ర అనారోగ్యం బారినపడి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో.. 'తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూడాలని ఉంది' అంటూ అంజయ్య స్వయంగా తన చివరి కోరికను వెల్లడించారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో మానవీయ దృక్పథంతో.. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కేసీఆర్.. అంజయ్య చివరి కోరికను కూడా పట్టించుకోలేదు. అంజయ్యను భావితరాలు గౌరవించుకునేలా ప్రభుత్వ పక్షాన నిర్ణయాలు తీసుకుంటామంటూ ఆనాడు మంత్రి హోదాలో తన్నీరు హరీష్ రావు చెప్పిన మాటలు కూడా కార్యరూపం దాల్చలేదు. పేద వర్గాల గొంతుకగా నిలిచిన ప్రజా యుద్ధనౌక గద్దర్, కవి అందెశ్రీలకు కూడా గత ప్రభుత్వ హయాంలో అవమానాలు ఎదురైన విషయం తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ దృష్టిలో అట్టడుగు వర్గాల అక్షరం కూడా అంటరానిదైంది.
అసెంబ్లీలో అంజయ్యను గుర్తు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో..' టీఆర్ఎస్ పాలనలో ప్రజాకవి గూడ అంజయ్యకు ఘోర అవమానం జరిగింది, అతని చివరి కోరికను సైతం కేసీఆర్ నెరవేర్చలేదు' అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతాన్ని గుర్తు చేశారు. ప్రజా పాలన సాగిస్తున్న తమ ప్రభుత్వం ప్రజా కవులు, రచయితలను గౌరవిస్తుందని, త్వరలో ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరిట సినీ అవార్డులు, అందెశ్రీ రచించిన 'జయ జయహే తెలంగాణ ' పాటను రాష్ట్ర గీతంగా ఆమోదిస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం గద్దర్ తొలి జయంతిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఇటీవల జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో ప్రభుత్వం 'జయ జయహే తెలంగాణ'ను రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించింది. ఇదే తరహాలో.. తొలి, మలి ఉద్యమాల్లో పాటగా పోరాడిన గూడ అంజయ్యకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత గౌరవం ఇవ్వాలని తెలంగాణ సమాజం వినమ్రంగా కోరుకుంటోంది.
నరేష్ పాపట్ల,
ఉస్మానియా యూనివర్సిటీ