జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్

జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన
  • ఎమర్జెన్సీతో ప్రజాస్వామ్యం గొంతు నులిమారని విమర్శ

న్యూఢిల్లీ : దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్యా దివస్( రాజ్యాంగ హత్యా దినం)గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం శుక్రవారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ లో పోస్ట్ చేశారు. "1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ  దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు.

తన నియంతృత్వ పాలనతో ఎలాంటి కారణం లేకుండానే లక్షలాది మందిని జైల్లో పెట్టారు. మీడియా గళాన్ని అణగదొక్కారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్ 25ను 'సంవిధాన్ హత్య దివస్'గా నిర్వహించాలని నిర్ణయించాం. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తుచేసుకుందాం" అని అమిత్ షా రాసుకొచ్చారు.

చీకటి దశను గుర్తుచేస్తుంది: మోదీ

హోంశాఖ ప్రకటనపై ప్రధాని మోదీ స్పందించారు. "నాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్ హత్య దివస్ మనకు గుర్తుచేస్తుంది. దేశ చరిత్రలో కాంగ్రెస్ రాసిన చీకటి దశ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ స్మరించుకునే రోజు అది" అని పేర్కొంటూ మోదీ ట్వీట్ చేశారు.