ఇవాళ స్వర సారథి ఎస్పీ బాలు జయంతి

ఆయన పాడితే దివిలో పారిజాతాలు విరిశాయి. ఆయన గళం నుంచి వెలువడి సప్త స్వరాలూ పులకించి పోయాయి. విరహ గానమో.. విప్లవ గీతమో.. భక్తి సారమో.. ఏదైనా ఆయన పెదవుల నుంచి జాలువారాక సూటిగా మనసుల్లోకి దూసుకెళ్లాల్సిందే. అందుకే ఆయన గాన గంధర్వుడు అయ్యారు. గగన సీమకేగిపోయినా ప్రతి గుండెకీ గుర్తుండిపోయారు. ఆయనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఈ పేరు వింటేనే సంగీత ప్రియులకు చెవుల్లో అమృతం పోసినట్టనిపిస్తుంది. వందల, వేల పాటల్లోని మాధుర్యం ఒక్కసారిగా చుట్టుముట్టి తన్మయత్వంలో ముంచేస్తుంది. భారతీయ సినీ సంగీతానికే వన్నె తెచ్చిన ఎస్పీబీ జయంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ.

ప్రాణమే గానమై..

బాలు పూర్తి పేరు శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. 1946లో నెల్లూరులోని కోనేటమ్మపేటలో పుట్టారాయన. చిన్నప్పటి నుంచీ పాటంటే ప్రాణం. పాట తోడిదే లోకం. తండ్రి సాంబమూర్తి హరికథలు చెప్పేవారు. అందువల్లే ఆయనకి రాగతాళాల పరిజ్ఞానం పుష్కలంగా ఉండేది. దాంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. మొదట్లో ఓ మ్యూజిక్ ట్రూప్‌లో లైట్ మ్యూజిక్ పాడేవారు బాలు. అక్కడే గిటారిస్టుగా ఉన్న ఇళయరాజాతో పరిచయం ఏర్పడింది. అది గాఢమైన స్నేహంగానూ మారింది. ఇక ఘంటసాల గానం రాజ్యమేలుతున్న సమయంలో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు బాలు. కోదండపాణి మ్యూజిక్‌ అందించిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రంతో సింగర్‌‌గా ఆయన ప్రస్థానం మొదలయ్యింది. వారం తిరిగేసరికి ఓ కన్నడ సినిమాలో పాడే చాన్స్ వచ్చింది. తర్వాత ఎమ్మెస్ రెడ్డి ‘కాలచక్రం’ చిత్రంలోని పాటలన్నీ బాలుతోనే పాడించడంతో ఇక ఇండస్ట్రీలో ఆయన పేరు మారుమోగింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లోనూ చాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఎయిటీస్‌కి వచ్చేసరికి ఎంత బిజీ అయిపోయారంటే.. బెంగళూరులోని ఓ స్టూడియోలో ఉదయం తొమ్మిదింటి నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు ఉపేంద్ర కుమార్ కంపోజ్‌ చేసిన ఇరవయ్యొక్క పాటలు కంటిన్యుయస్‌గా పాడారు బాలు. ఇదో పెద్ద రికార్డ్. అలాగే ఒక్కరోజులో పంతొమ్మిది తమిళ, తెలుగు పాటలు పాడారు. మరో సందర్భంలో ఒకే రోజు పదహారు హిందీ పాటలు కూడా పాడి సెన్సేషన్ క్రియేట్ చేశారు. నటుడి వాయిస్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా పాడటం.. మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా తనని తాను మౌల్డ్ చేసుకుంటూ పోవడంతో ఆయనకి తిరుగు లేకుండా పోయింది. యాభై ఏడేళ్ల కెరీర్‌‌లో.. పద్నాలుగు భాషల్లో.. నలభై వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డ్ సాధించారు బాలు.

స్వర సారథిగా..

పాట పాడటమే కాదు.. స్వరపర్చడంలోనూ బాలుది ఓ ప్రత్యేకమైన శైలి. సింగర్‌‌గా ఆయన ఎంత మంచి ముద్ర వేశారో, మ్యూజిక్‌ డైరెక్టర్గానూ అంతే ఆకట్టుకున్నారాయన. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నలభై అయిదు సినిమాలకు సంగీతం అందించారు బాలు. ‘మయూరి’ చిత్రంలోని ‘నీ పాదం.. ఇలలోన నాట్యవేదం’ పాటని ఎవ్వరూ మర్చిపోలేరు. అలాగే ‘పడమటి సంధ్యారాగం’లోని ‘ఈ తూరుపు ఆ పశ్చిమం’ పాట కూడా ఎంతో పాపులర్ అయ్యింది. ఇంకా వివాహ భోజనంబు, శిఖరం లాంటి ఎన్నో సినిమాలకు మంచి మంచి పాటలు సమకూర్చారు బాలు. కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్‌ కూడా రూపొందించారాయన. మ్యూజిక్ డైరెక్టర్‌‌గా ఇంకా చేయాలని ఉన్నా.. సింగర్‌‌గా చాలా బిజీగా ఉండటంతో అవకాశం దొరకలేదని ఓ సందర్భంలో చెప్పారు బాలు.

మాటే మంత్రము

పాటలే కాదు.. బాలు మాటలు కూడా ఎంతో మధురంగా ఉంటాయి. అందుకే డబ్బింగ్ ఆర్టిస్ట్గానూ ఆయన ఓ వెలుగు వెలిగారు. మొదటిసారి ‘మన్మథలీల’ సినిమాకి అనుకోకుండా ఆయన తన వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత అది కంటిన్యూ అయ్యింది. వందకు పైగా సినిమాల్లో పలువురు స్టార్స్కి వాయిస్ అందించారు బాలు. కమల్ హాసన్‌ సినిమాల తెలుగు వెర్షన్స్ అన్నింట్లోకీ ఆయనకి బాలునే డబ్బింగ్ చెప్పారు. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, కార్తీక్, జెమినీ గణేశన్, అనిల్ కపూర్, భాగ్యారాజా, గిరీష్ కర్నాడ్, విష్ణువర్థన్, అర్జున్‌, రఘువరన్ లాంటి ఎంతోమందికి డబ్బింగ్ చెప్పిన బాలు.. ‘అన్నమయ్య’ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రకి వాయిస్ ఇచ్చినందుకుగాను నంది అవార్డును కూడా అందుకున్నారు. 

నటనలోనూ మేటి

సాధారణంగా సింగర్స్ ఎప్పుడైనా ఓ సినిమాలో తళుక్కుమంటుంటారు. కానీ బాలు అలా కాదు. నలభై అయిదుకు పైగా చిత్రాల్లో యాక్ట్ చేశారు. అతిథి పాత్రల దగ్గర్నుంచి విలన్ క్యారెక్టర్స్‌ వరకు అన్ని రకాల పాత్రల్నీ పోషించారు. కామెడీ పండించారు. కన్నీళ్లూ పెట్టించారు. బాలు నటించిన మొదటి సినిమా.. జంధ్యాల డైరెక్ట్ చేసిన ‘మల్లెపందిరి’. ఆ తర్వాత ‘పక్కింటి అమ్మాయి’లో ఇంపార్టెంట్ రోల్ చేశారు. వివాహ భోజనంబు, పర్వతాలు పానకాలు, ప్రేమ, చిరుజల్లు, పవిత్ర బంధం, ఆరోప్రాణం, ప్రేమదేశం, ప్రేమికుడు లాంటి ఎన్నో చిత్రాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ని పండించారాయన. ఇక దేవస్థానం, మిథునం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో తానెంత గొప్ప నటుడో ప్రూవ్ చేసుకున్నారు. 

నిర్మాతగా..

డబ్బు సంపాదన కోసం కాకుండా, తన మనసుకు నచ్చే సినిమాలు చేయడం కోసం ఓ దశలో నిర్మాతగా మారారు బాలు. ఆదిత్య 369, భామనే సత్యభామనే చిత్రాల నిర్మాణంలో ఆయనకి భాగస్వామ్యం ఉంది. కమల్ హాసన్ హీరోగా నటించిన ‘శుభసంకల్పం’ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన అభిరుచి నిర్మాతగా ప్రశంసలు అందుకున్నారాయన. 

పర్‌‌ఫెక్ట్ ఫ్యామిలీ మేన్‌

తన వృత్తిగత జీవితానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారో.. వ్యక్తిగత జీవితాన్నీ అంతే ప్రాధాన్యతనిచ్చేవారు బాలు. ఆయన భార్య పేరు సావిత్రి. ఆవిడంటే బాలుగారికి ప్రాణం. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఆది దంపతుల్లా కనిపించేవారు. వారికి ఇద్దరు పిల్లలు.. చరణ్, పల్లవి. చరణ్‌ తండ్రి బాటలోనే నడిచాడు. సింగర్‌‌గా, నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఇక చెల్లెలు శైలజ అంటే కూడా బాలుకి ఎంతో ప్రేమ. అలాంటి అన్నకి చెల్లెల్ని కావడం తన అదృష్టమని శైలజ కూడా చెబుతారు. ఆమె భర్త శుభలేఖ సుధాకర్ కూడా పలు సందర్భాల్లో బాలు గొప్పదనం గురించి చెప్పారు. నటుడు చంద్రమోహన్, దర్శకుడు కె.విశ్వనాథ్‌ ఇద్దరూ బాలుకి దూరపు బంధువులు. వీళ్లందరూ ఆయన్ని ఎంతో ఇష్టపడతారు. రిలేషన్స్కి బాలు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చేవారని చెబుతుంటారు. 

మనసున్న మనిషి

కేవలం తన పాటతోనే కాదు.. మంచి మనసుతోనూ, చక్కని ప్రవర్తనతోను కూడా అందరినీ ఆకట్టుకున్నారు బాలు. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన్ని చూసే నేర్చుకోవాలి అనేవారంతా. చిన్నవాళ్లను సైతం గౌరవించడం, ఒక్కసారి స్నేహం చేస్తే జీవితాంతం దాన్ని కొనసాగించడం బాలుకి అలవాటు. ఇళయరాతో చిరకాల స్నేహం, కమల్‌ హాసన్‌తో  జీవితకాల అనుబంధం ఉంది బాలుకి. ఇక సమాజ సేవలోనూ ముందుండేవారు. తన తండ్రి పేరుతో ట్రస్ట్ పెట్టి ఎంతోమందికి సాయపడ్డారు. తన సొంత ఊరులో ఉన్న ఇంటిని వేద పాఠశాల పెట్టడం కోసం విరాళంగా ఇచ్చేశారు. అవతలివారి ఇచ్చుకునే పరిస్థితుల్లో లేకపోతే ఎంతో తక్కువ రెమ్యునరేషన్‌కి పాడి సాయపడేవారు. సేవా కార్యక్రమాలకి విరాళాలు సేకరించేందుకుగాను ఉచితంగా ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చేవారు. కొవిడ్ సమయంలో కూడా శ్రోతలు కోరిన పాటలు పాడి విరాళాలు సేకరించారు బాలు.

ఆ గాత్రానికి ఎన్నో అవార్డులు వశం...

కేంద్రప్రభుత్వం నుంచి 2001 లో పద్మశ్రీ, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని బాలు అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వివిధ విభాగాల్లో 29 సార్లు నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 2012 లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది, ప్రత్యేక బహుమతి లభించింది. 

కానీ అదే కరోనాకి ఆయన బలైపోతారు ఎవరూ ఊహించలేదు. యాభయ్యొక్క రోజుల పాటు హాస్పిటల్‌లో చావుతో పోరాడారాయన. బాలు గెలవాలని, తిరిగి వచ్చి తన గొంతు వినిపించాలని దేశ విదేశాల్లోని వారంతా ప్రార్థనలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. ఆయన వెళ్లిపోయారు. తన పాటని అందరికీ తోడుగా వదిలి ఆయన మాత్రం ఒంటరిగా వెళ్లిపోయారు. బాలూ గారూ.. వియ్ మిస్‌ యూ!

మరిన్ని వార్తల కోసం...

సినిమాలు ధియేటర్లలోనే చూడాలి..

ఓటిటిలో మలయాళానికే ప్రేక్షకుల ఓట్లు....