
పోస్టింగ్ దక్కని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు తమకు సంబంధం లేదంటూ వారిని రోజంతా ఆఫీసుల చుట్టూ తిప్పించారు. ఉన్నతాధికారులే చేతులెత్తేయడంతో ఎవరికి చెప్పుకోవాలోనంటూ ఆవేదన చెందుతున్నారు. సెక్రటేరియట్ లో సీఎస్ ఎస్ కే జోషి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్‌ను కలిసి తమకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇచ్చారు. తమ చేతుల్లో ఏం లేదని, ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని వారు సమాధానమిచ్చారు. సీఎస్‌ను కలిసేందుకు వచ్చిన జూనియర్ కార్యదర్శులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పీఏ ఫోన్ చేయగా నలుగురిని మాత్రమే అనుమతించారు. మరో నలుగురికి విజిటర్ పాసులిచ్చారు. అంతకు ముందుపోస్టింగ్ దక్కని 50 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు హిమాయత్ నగర్ లోని పంచాయతీరాజ్ కమిషనరేట్‌కు వెళ్లగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రానిదే తామేం చేయలేమని డిప్యూటీ కమిషనర్ రామారావు చెప్పారు . కమిషనర్ నీతూప్రసాద్ , కేటీఆర్‌లను కలిసేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు. తెలంగాణ భవన్ కార్యాలయకార్యదర్శి ద్వారా వరంగల్ లో ఉన్న మంత్రి ఎర్రబెల్లితో మాట్లాడగా, సెక్రటేరియట్ కు వెళ్లాలని ఆయన సలహా ఇచ్చారని కార్యదర్శులు చెప్పారు . ఇంతా తిరిగినా తమకు ఏ హామీ దొరకలేదని వాపోయారు.