ఖైరతాబాద్, వెలుగు: కళారంగంపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి తీవ్ర ఆర్థిక దోపిడీకి గురవుతున్నామని జూనియర్ ఆర్టిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వరరావు మాట్లాడారు. చిత్ర పరిశ్రమలో జూనియర్ఆర్టిస్టులు అడుగడుగునా వంచనకు గురవుతున్నారన్నారు. సభ్యత్వం లేని వారిని షూటింగ్ లకు పంపుతూ ఏజెంట్లు అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు.
దీంతో అసలైన కళాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఏజెంట్ల వ్యవహారంతో వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు పూట గడవని దుస్థితిలో కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో జూనియర్ ఆర్టిస్టుల సీఐటీయూ ఫేనల్అధ్యక్షుడు రవీందర్, ఐటీయూ నగర కార్యదర్శి వెంకటేష్, రవిశంకర్ పాల్గొన్నారు.