అర్ధరాత్రి వేళ తహసీల్దార్ ఆఫీసులో... జూనియర్ ​అసిస్టెంట్, తాజా మాజీ సర్పంచ్​ కంప్యూటర్​ వర్క్​

అర్ధరాత్రి వేళ తహసీల్దార్ ఆఫీసులో... జూనియర్ ​అసిస్టెంట్, తాజా మాజీ సర్పంచ్​ కంప్యూటర్​ వర్క్​
  •     పట్టుకుని ప్రశ్నించిన కాంగ్రెస్​ లీడర్లు 
  •     పొంతన లేని సమాధానాలతో తికమక
  •     భూపత్రాలు తారుమారు చేసేందుకేనని ఆరోపణలు  
  •     పోలీసుల అదుపులో నిందితులు


అచ్చంపేట, వెలుగు: భూముల వివరాలు తారుమారు చేసేందుకు అచ్చంపేట తహసీల్దార్ ఆఫీసు జూనియర్ అసిస్టెంట్​తో కలిసి తాజా మాజీ సర్పంచ్​ బోడ్కానాయక్​ప్రయత్నిస్తున్నాడనే సమాచారంతో కాంగ్రెస్ నేతలు వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. స్థానికులు, కాంగ్రెస్​లీడర్ల కథనం ప్రకారం..నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట తహసీల్దార్ ఆఫీసులో గురువారం అర్ధరాత్రి బొమ్మనపల్లి మాజీ సర్పంచ్​బోడ్కానాయక్ తో కలిసి ఆఫీస్​జూనియర్ అసిస్టెంట్ హన్మంతునాయక్ కంప్యూటర్ వర్క్ చేస్తున్నారు.

వీరిద్దరూ కలిసి బొమ్మనపల్లికి చెందిన రెవెన్యూ రికార్డులు దొంగిలించడంతో పాటు, అందులోని వివరాలు తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. లోపల జరుగుతున్న తంతంగాన్నంతా సెల్​ఫోన్లలో రికార్డు చేశారు. తర్వాత ఏం చేస్తున్నారని వారిని నిలదీశారు. విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో సీఐ రవీందర్ అక్కడికి చేరుకొని ఇద్దరినీ ప్రశ్నించారు. భూమి వివరాలు విరాసత్  చేయించేందుకు ఆన్​లైన్ చేయిస్తున్నానని బోడ్కానాయక్​చెప్పగా, జూనియర్ అసిస్టెంట్ హన్మంత్​నాయక్​ మాత్రం కల్యాణలక్ష్మి, ఓటర్ వివరాలు నమోదు చేయిస్తున్నానని చెప్పాడు. అయితే, తహసీల్దార్ పాండు మాత్రం తాను సదరు ఉద్యోగికి ఎలాంటి పనులు అప్పగించలేదని స్పష్టం చేశారు. దీంతో మాజీ సర్పంచ్, జూనియర్​ అసిస్టెంట్​ను​పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయమై కాంగ్రెస్ నేతలు తహసీల్దార్​పాండును కలిసి ఫిర్యాదు చేశారు. బోడ్కనాయక్ ఇది వరకే గ్రామంలోని కొందరి భూములను వారికి తెలియకుండానే రెవెన్యూ అధికారుల సహకారంతో మరొకరి పేరుపై మార్చాడని గ్రామస్తులు ఆరోపించారు. తహసీల్దార్​ఆఫీసులో భూములకు సంబంధించిన పాస్​బుక్​లతో పాటు, ఇతర రికార్డులు ఉండడంతో వాటి వివరాలు మార్చేందుకే అక్కడ ఉన్నాడని చెబుతున్నారు. దీనికి పై అధికారుల సహకారం కూడా ఉందన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ నేతలు గౌరీశంకర్, రామనాథం, సంతోష్, అజయ్, బొమ్మన్​పల్లి 
గ్రామస్తులు కోరారు.