‘నన్నే టోల్ అడుగుతావా’.. హైదరాబాద్ ORR టోల్ సిబ్బందిపై ప్రభుత్వ ఉద్యోగి దాడి

 ‘నన్నే టోల్ అడుగుతావా’.. హైదరాబాద్ ORR టోల్ సిబ్బందిపై ప్రభుత్వ ఉద్యోగి దాడి

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద ప్రభుత్వ ఉద్యోగి హల్ చల్ చేశాడు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండి విచక్షణా రహితంగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు పాటించకుండా.. టోల్ అడిగినందుకు సిబ్బందిపై దాడికి దిగాడు. ఆపాల్సిన కుటుంబ సభ్యులు తలో చేయి వేసి సిబ్బందిపై దాడికి దిగటంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు సిబ్బంది.

మంగళవారం (ఏప్రిల్ 15) ORR  రాజేంద్రనగర్ ఎగ్జిట్ 17 దగ్గర టోల్ కట్టకుండా వెళ్లేందుకు ప్రయత్నించాడు జూనియర్ అసిస్టెంట్ సిద్ధిఖీ. రంగారెడ్డి కలెక్టరేట్ లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న హుస్సేన్ సిద్ధిఖీ.. తనకు టోల్ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరాడు. టోల్ మినహాయింపు లేకపోవడంతో డబ్బులు చెల్లించాలని టోల్ సిబ్బంది సూచించారు.

అయితే మినహాయింపు ఉన్న వాహనాలు వెళ్లే దారి గుండా వెళ్లేందుకు ప్రయత్నించడంతో సిబ్బంది అడ్డుకున్నారు. అయినా తోసుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్యోగి కారుకు అడ్డంగా నిలుచున్నాడు. దీంతో ఆగ్రహించిన సిద్దిఖీ.. వెంటనే కారు దిగి ఉద్యోగిపై దాడికి దిగాడు. ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులు కూడా ఉద్యోగిపై దాడి చేయటం సీసీ టీవీ ఫూటేజ్ లో రికార్డయ్యింది. గొడవను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఇతర సిబ్బందిపై కూడా దాడి చేశారు. దీంతో హుస్సేన్ సిద్ధిఖీ తోపాటు అతని కుటుంబ సభ్యులపై పోలీసులకు పిర్యాదు చేసిన టోల్ సిబ్బంది.