డాక్టర్ సంతకం ఫోర్జరీ చేసి .. రూ.1.73 లక్షలు కొట్టేశాడు

సికింద్రాబాద్, వెలుగు: గవర్నమెంట్ హాస్పిటల్​లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వ్యక్తి డాక్టర్ సంతకం ఫోర్జరీ చేసి రూ.1.73 లక్షలు కాజేశాడు. అంబర్ పేటకు చెందిన ఫిరోజ్ (35) లాలాపేటలోని అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో జూనియర్ అసిస్టెంట్. తనతోపాటు మరో13 మంది ఉద్యోగుల జీతాల వివరాలను ఎక్స్ఎల్ షీట్​లో ఎంటర్ చేసి, బ్యాంకులో అందజేస్తుంటాడు. అతడిచ్చిన వివరాలతో ఆయా అకౌంట్లలోకి బ్యాంకు అధికారులు నగదు జమ చేస్తారు.

అయితే, కొద్దిరోజులుగా ఫిరోజ్ డ్యూటీకి రెగ్యులర్ గా హాజరు కాకపోవడంతో ఆసుపత్రి ఇన్ చార్జి డాక్టర్ లావణ్య చాలాసార్లు మందలించారు. అయినప్పటికీ విధులకు డుమ్మా కొడుతుండడంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఫిరోజ్ వేతనాన్ని హోల్డ్ లో పెట్టాలని ఉన్నతాధికారులు రెండు నెలల కిందట ఆదేశించారు.

అయినప్పటికీ ఫిరోజ్ ప్రతినెలా ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన బిల్లులో తనకు బదులు మరో వ్యక్తి పేరును చేర్చి, బ్యాంకులో అందజేస్తున్నాడు. ఇటీవల జాబితాలో కొత్తపేరును వైద్యులు గుర్తించి, ఫిరోజ్​పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫిరోజ్​ను  అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.