పద్మారావునగర్/బషీర్ బాగ్, వెలుగు : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీ హాస్పిటల్లోని జూనియర్ డాక్టర్లు శనివారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. హాస్పిటల్ఎదుట కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ప్రతినెలా స్టైఫండ్ఇవ్వాలని, ఏపీ స్టూడెంట్లకు 15 శాతం రిజర్వేషన్లను తొలగించాలని కోరారు. ఉస్మానియా హాస్పిటల్కు కొత్త బిల్డింగ్, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని స్టూడెంట్ల కోసం మెరుగైన హాస్టళ్లు నిర్మించాలని డిమాండ్చేశారు. డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 24 నుంచి డ్యూటీలను బహిష్కరించి
నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సూపర్ స్పెషాలిటీ ఎస్ఆర్ ల ప్రెసిడెంట్ డా.హరీశ్, జూడాల స్టేట్ ప్రెసిడెంట్ డా.శ్రీహర్ష, గాంధీ జూడాల ప్రెసిడెంట్డా.ఎం.వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో శనివారం మధ్యాహ్నం జూనియర్ డాక్టర్లు కండ్లకు గంతలు కట్టుకుని నిరసనకు దిగారు. కాలేజీ జూడా అసోసియేషన్ అధ్యక్షుడు దీపాంకర్ మాట్లాడుతూ..
ఆరు నెలలుగా తమకు స్టైఫండ్ సరిగ్గా అందడం లేదని తెలిపారు. ఉస్మానియా హాస్పిటల్ కోసం కొత్త బిల్డింగ్నిర్మించాలని కోరారు. డాక్టర్లకు ఎలాంటి సౌకర్యాలు ఉండడం లేదని వాపోయారు. హాస్టల్స్ పెంచడం లేదని, ఇరుకు గదుల్లో ఉంటున్నామని చెప్పారు. జూడాలు చంద్రిక, ఐశాక్, రాహుల్, సతీశ్, జగన్ తదితరులు పాల్గొన్నారు.