మైనార్టీ కాలేజీల లెక్చరర్ల పోస్టుల నియామకంలో అక్రమాలు
రిజల్ట్స్ ప్రకటించకుండానే ఉద్యోగ నియామకాలు
అయోమయంలో అభ్యర్థులు
ఇంటర్వ్యూలు ఆపాలని డిమాండ్
మహబూబ్నగర్, వెలుగు: మైనార్టీ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల రిజల్ట్స్ ప్రకటించకుండానే నియామకాలు చేపట్టడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కొత్తగా ఐదు మైనార్టీ జూనియర్ కాలేజీలు 2020–-21 విద్యా సంవత్సరానికి మంజూరయ్యాయి. ఆ కాలేజీల్లో 32 మంది జూనియర్ లెక్చరర్ల భర్తీ కోసం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి బాధ్యత అప్పగించారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో 459 మంది దరఖాస్తు చేసుకున్నారు. 216 అప్లికేషన్లను జిల్లా విజిలెన్స్కమిటీ రిజెక్ట్ చేసింది. 243 మందికి ఈ నెల 6న పరీక్ష పెట్టారు. ఎగ్జామ్ రిజల్ట్స్వెల్లడించకుండానే బుధవారం కొంతమందికి నేరుగా ఇంటర్వ్యూలకు రమ్మని ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నుంచి ఫోన్లు వెళ్లాయి.
ఫలితాలపై అనుమానాలు
రిజల్ట్స్ ప్రకటించకుండా ఏకంగా ఇంటర్వ్యూలు నిర్వహించడం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 9 ఉమ్మడి జిల్లాలకు స్టేట్ మైనార్టీ వెల్ఫేర్అసోసియేషన్ ఈ ఏడాది కొత్తగా కాలేజీలను కేటాయించింది. జూనియర్ లెక్చరర్ల నియామకానికి పరీక్షలు నిర్వహించారు. ఆయా జిల్లాల పేపర్లను ఇతర జిల్లాల్లో కరెక్షన్ చేయించారు. అయితే రిజల్ట్స్ ప్రకటించకుండా ఇంటర్వ్యూలు ఆయా జిల్లాల్లో కాకుండా ఇతర ఉమ్మడి జిల్లాల్లో గురువారం నుంచి నిర్వహిస్తున్నారు. ఇక్కడే అసలు మతలబు జరిగిందని, రాష్ట్రస్థాయిలోనే ఔట్ సోర్సింగ్ఏజెన్సీలు, అధికారులు కుమ్మక్కై పోస్టులను అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మాకేం సంబంధం లేదు
మైనార్టీ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులకు పరీక్షలు నిర్వహించాం. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో అవార్డు అనే ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియామకాలు జరుగుతున్నాయి. మాకేం సంబంధం లేదు. అంతా ఏజెన్సీ వాళ్లే చూసుకుంటున్నారు.
‑ శంకరాచారీ, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్
లిస్ట్ ఇచ్చారు.. పిలుస్తున్నం
ఉమ్మడి జిల్లాలో జూనియర్ లెక్చరర్ల పోస్టుల నియమకాలకు అభ్యర్థులకు పరీక్ష నిర్వహించాం. పేపర్లను ఇతర జిల్లాలోని కాలేజీల్లో దిద్దించారు. రిజల్ట్మాత్రం స్టేట్ మైనార్టీ వెల్ఫేర్ఆఫీసర్లే చూస్తున్నారు. మాకు లిస్ట్ ఇచ్చారు. వాళ్లను పిలవమని చెప్పడంతో ఇంటర్వ్యూలకు పిలుస్తున్నం.
‑ వెంకటయ్య, అవార్డు ఔట్సోర్సింగ్ ఏజెన్సీ, పాలమూరు
For More News..