హైదరాబాద్, వెలుగు : జాబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 2007లో స్థలం కొనుగోలు చేసి నిర్మించిన ఇంటిపై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డీఆర్‌టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని నటుడు జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. బ్యాంకులకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఎన్టీర్ తరఫున జీపీఏ హోల్డర్ కె.రాజేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ జె.శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం పిటిషన్‌ను విచారించింది.
డీఆర్‌టీ ఇచ్చిన డాకెట్ ఆర్డర్ సమర్పించేందుకు వారం గడువు కావాలని, తదుపరి వెకేషన్ కోర్టులో విచారణకు అనుమతించాలని ఎన్టీఆర్ లాయర్ చేసిన వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. జూన్ 6న రెగ్యులర్ కోర్టు విచారణ చేస్తుందని ప్రకటించింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 881 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2007లో ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణాలు చేపట్టారు. 1996లోనే ఈ స్థలాన్ని తనఖా పెట్టి ఇంటి జాగాపై రుణం పొందారని, రుణం చెల్లించని కారణంగా ఆ ఆస్తిపై హక్కులు తమవేనని పేర్కొంటూ ఎస్‌బీఐ తో పాటు ఇతర బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. వీటిని రద్దు చేయాలంటూ పిటిషనర్ డీఆర్‌టీని ఆశ్రయించారు.
సమగ్ర విచారణ చేయకుండానే డీఆర్‌టీ ఆదేశాలు ఇచ్చిందంటూ హైకోర్టును ఆశ్రయించారు. స్థలాన్ని అమ్మిన వారిపై కేసు పెట్టినట్లు పిటిషనర్ లాయర్ తెలిపారు. అయితే డాకెట్ ఆదేశాలు అందాల్సిఉందని, కొంత సమయం ఇస్తే వాటి వివరాలు సమర్పిస్తామని చెప్పారు. వచ్చే వారానికి వివరాలు ఇస్తామన్నారు. దీనిపై విచారణను వచ్చే వారానికి వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. జూన్ 3లోగా డాకెట్ ఉత్తర్వులను సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. విచారణను జూన్ 6కు వాయిదా వేసింది..