జూనియర్​ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్​ చేయాలి

దేశానికి గ్రామాలే ఆయువు పట్టు. వాటిని సంతులన  వృద్ధితో నడిపిస్తూ, సుస్థిరాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వ నిర్ణయాలను, అమలు చేసే పథకాలను గ్రామస్థాయిలోని ప్రతి ఇంటికి చేరువ అయ్యేలా చూడడానికి 2018లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నోటిఫికేషన్ వేశారు.  మూడు సంవత్సరముల ప్రొబేషనరీ  పీరియడ్  నిబంధనలతో పరీక్ష జరిపి  ఉద్యోగంలో చేర్చుకున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల  ప్రొబేషనరీ పీరియడ్ కాలాన్ని ఇంకో సంవత్సరం పెంచారు. ఆ తర్వాతనే రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. నోటిఫికేషన్ కి విరుద్ధంగా చేసిన ఆ ప్రకటన వల్ల ఒకింత నిరుత్సాహానికి, మరింత బాధను దిగమింగుతూ కేవలం సీఎంపై గౌరవంతో ఆ నిర్ణయాన్ని శిరసా వహించాము. కానీ ఏప్రిల్ 12, 2023 నాటికి మా నాలుగు సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి అయింది. కానీ ఇంకా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఎందుకు లేదో అర్థం కావట్లేదు.

 అవార్డుల్లో  కార్యదర్శుల శ్రమ ఉంది

ఈ నాలుగు సంవత్సరాల కాలంలో గ్రామస్థాయిలో ఎన్నో కార్యక్రమాలను అనగా నర్సరీలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, కిచెన్ గార్డెన్ ల వంటి సామాజిక ఆస్తుల నిర్మాణాలను, ప్రభుత్వం నిర్ణయించిన పల్లె ప్రగతి కార్యక్రమాలను, హరితహారం కార్యక్రమాన్ని, స్వచ్చ భారత్ వారోత్సవాలను ప్రయత్న లోపం లేకుండా, ఎంతో పకడ్బందీగా, ఎంతో ఉత్సాహంతో దిగ్విజయంగా నిర్వర్తించాము. ఈ నాలుగు సంవత్సరాల మా శ్రమకు నిదర్శనంగా జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పారిశుద్ధ్యం, పరిశుభ్రత విషయాలలో అనేక అవార్డులను సాధించేలా , మన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా సేవలను అందించాము.  మా తోటి పంచాయతీ కార్యదర్శులు ఒత్తిడికి లోనై పని చేస్తూ ప్రాణాలు వదిలిన వారు ఉన్నారు. గుండెపోటుతో కొందరు, రోడ్డు ప్రమాదాలలో ఇంకొందరు ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ప్రభుత్వం అప్పగించిన పనుల పూర్తి కోసం పస్తులు ఉండి మరీ పూర్తి చేసిన రోజులు చాలానే ఉన్నాయి. కానీ పనిచేయకుండా లేని రోజులైతే లేవు. ఇటీవల కాలంలో జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అవార్డులను గమనిస్తే వాటిలో మా కృషి ఎంత ఉందో స్పష్టం అవుతుంది. గ్రామస్థాయిలో ఎన్ని కార్యక్రమాలు తు.చ తప్పకుండా అమలు చేస్తున్న మమ్మల్ని , మా సేవలను గుర్తించి రెగ్యులరైజ్ చేయకపోవడానికి ఇబ్బందులు ఏమిటో మాకు అంతుచిక్కడం లేదు.

ముఖ్యమంత్రికి వినతి

అందుకనే ఏప్రిల్ 15న  రాష్ట్రవ్యాప్తంగా జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల  సేవలను గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని సమ్మెకు పిలుపునిస్తూ అధికారులకు సమ్మె నోటీసులు అందజేశాము. ఏప్రిల్ 28 వరకు ఈ విషయంలో సరియైన నిర్ణయం తీసుకోకపోతే నిరంతర సమ్మెకు పిలుపునివ్వాలని నిర్ణయించాము .ఇట్టి విషయంలో నాలుగు సంవత్సరాల  ప్రొబెషనరీ కాలాన్ని సర్వీస్ కాలంగా గుర్తించి వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. 
అలాగే ప్రభుత్వం ఈ సమస్యలను గుర్తించి  మానవతాదృక్పథంతో ఆలోచించి,  జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల మానసిక ఒత్తిడిని తగ్గించి, పరిష్కారం చూపే విధంగా ముఖ్యమంత్రి  చొరవ చూపాలి.  చిరు ఉద్యోగుల   బతుకులలో  ఆనందం వెల్లివిరిసేలా ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను ఉత్సాహంగా అమలు పరిచేలా, జూ.ప. కార్యదర్శుల సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. లేకుంటే గ్రామస్థాయిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులను కూడా ఉద్యమంలో మమేకం చేసుకుని పరిపాలనను స్తంభింప చేస్తామని ముఖ్యమంత్రికి వినమ్ర పూర్వకంగా 
తెలియజేస్తున్నాము.

- రేకులపల్లి భాస్కర్ రెడ్డి, యాదాద్రి - భువనగిరి,