అర్హులందరికీ ప్రభుత్వ స్కీంలు అందాలి

అర్హులందరికీ ప్రభుత్వ స్కీంలు అందాలి
  • మంత్రి జూపల్లి కృష్ణారావు

మహూబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  పేద ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  మంగళవారం  ప్రజా పాలన దినోత్సవాల అనంతరం కలెక్టరేట్‌‌‌‌లో వివిధ అంశాలపై మంత్రి జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. మండల, గ్రామస్థాయిలో ప్రజల సమస్యలకు వెంటనే స్పందించాలని, భూములకు సంబంధించిన సమస్యలపై ఎలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

కార్యక్రమంలో  మహబూబ్ నగర్ శాసనసభ్యుడు యెన్నం  శ్రీనివాసరెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జే . అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు.  జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,   రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెదుల్లా  కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్,  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, ఈ సమావేశానికి హాజరయ్యారు. 

జటప్రోలులో రూ. 80 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్ 

కొల్లాపూర్, వెలుగు: కొల్లాపూర్ సెగ్మెంట్ లో రూ. 80 కోట్ల తో  ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌‌‌‌ను పెంట్లవెల్లి మండలం జటప్రోల్ గ్రామంలో నెలకొల్పనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.  పేద పిల్లలకు నాణ్యమైన విద్య, వసతి సౌకర్యం కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమన్నారు. జటప్రోలు గ్రామంలో స్కూల్ ఏర్పాటుకు కావాల్సిన ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. కొల్లాపూర్ ఆర్డీవో నాగరాజ్ సంబంధిత శాఖల అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.