
- అహంకారంలో కేసీఆర్‌ను మించినోళ్లు లేరు: జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలేనని, అహంకారంలో ఆయనను మించినోళ్లు ఎవరుంటారని కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణా రావు అన్నారు. తనను అహంకారి అన్న కేసీఆర్ కామెంట్లను జూపల్లి కొట్టిపారేశారు. తనది అహంకారం కాదని, ఆత్మగౌరవమని పేర్కొన్నారు. కేసీఆర్ చెప్పినట్టు వినలేదు కాబట్టే తనను అహంకారి అని కేసీఆర్ అంటున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీతో కేసీఆర్‌కు ఎప్పటి నుంచో లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. తనవైపు వేలు చూపించే హక్కు కూడా కేసీఆర్‌కు లేదన్నారు. కమ్యూనిస్టులను తోక పార్టీలు అన్న కేసీఆర్‌ది అహంకారం కాదా అని ప్రశ్నించారు. ప్రగతిభవన్‌లో కనీసం మంత్రులకూ అనుమతివ్వని కేసీఆర్‌దే అహంకారమన్నారు. అది ప్రగతి భవన్ కాదని, బానిసల భవన్ అని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్‌లో అలాంటి పరిస్థితి ఉండదన్నారు. సోనియా గాంధీని రాష్ట్రస్థాయి నేతలెవరైనా ఎప్పుడైనా కలిసేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేసీఆర్ మాట మీద నిలబడే వ్యక్తి కాదన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కేసీఆర్ కూడా ఓసారి ఎన్నికల్లో ఓడిపోలేదా అని ప్రశ్నించారు. ఆయన కూతురు కవిత, వినోద్ కుమార్‌కూ భంగపాటు తప్పలేదని గుర్తు చేశారు. ధర్నా చౌక్ ఎత్తేసిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవాలంటూ కేసీఆర్ తనకు చెప్పారని, అందుకు తాను నో చెప్పినందుకే తనపై అహంకారి అనే ముద్ర వేస్తున్నారని విమర్శించారు.