పాలమూరు, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి అరాచక పాలన కొనసాగించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున మన్నె జీవన్ రెడ్డి మంత్రితో కలిసి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆస్తులు అమ్ముకొని, అప్పులు తెచ్చి పనులు చేస్తే బిల్లులు కూడా చెల్లించలేదన్నారు.
బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చి కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెండుస్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నెజీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా అవకాశం కల్పించిన మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్ల ఆశ్వీరాదంతో ఎమ్మెల్సీగా గెలుస్తాననే నమ్మకం ఉందన్నారు. ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవి, గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి, రాజేశ్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, వినోద్ కుమార్, ఎన్పీ వెంకటేశ్, బెనహర్ పాల్గొన్నారు.