బీఆర్ఎస్ అసమ్మతి నేతలపై జూపల్లి ఫోకస్

బీఆర్ఎస్ అసమ్మతి నేతలపై జూపల్లి ఫోకస్
  • బీఆర్ఎస్ అసమ్మతి నేతలపై జూపల్లి ఫోకస్
  • వనపర్తిలో ఆత్మీయ సమ్మేళనానికి అనుచరుల ఏర్పాట్లు
  • మాజీ మంత్రి కదలిలకలపై ఇంటలిజెన్స్​ వర్గాల ఆరా
  • ఏ పార్టీలో చేరతారనే విషయంపై స్పష్టత కరువు
  • అయోమయంలో కాంగ్రెస్​, బీజేపీ నేతలు

వనపర్తి, వెలుగు : బీఆర్ఎస్  పార్టీలోని అసమ్మతి వాదులను చేరదీయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్  బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు దృష్టి పెట్టారు. ఇందులోభాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల చివరి వారంలో రాష్ట్రంలోని ప్రముఖులు, ఉమ్మడి జిల్లా నేతలను ఆహ్వానించి భారీ సభకు ప్లాన్  చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో మాజీ ఎంపీ, సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం లాంటి సభను ఏర్పాటు చేసి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్  పార్టీ వ్యతిరేకులను ఏకం చేసే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది.  రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసేలా ఉమ్మడి పాలమూరు జిల్లాపై ప్రభావం చూపేలా సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అనుచరులు పేర్కొంటున్నారు. 

మద్దతు కూడగట్టేందుకు చర్చలు..

బీఆర్ఎస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న యువత, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల మద్దతు పొందేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నేతగా జూపల్లి కృష్ణారావుకు పేరుంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయనకు అభిమానులున్నారు. వారితో మాట్లాడుతూ అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేల బలాలు, బలహీనతలపై ఫోకస్​ చేస్తున్నారు. గతంలో ప్రాతినిధ్యం వహించిన కొల్లాపూర్ నియోజకవర్గంతో పాటు ఆయన సొంత జిల్లా నాగర్ కర్నూల్ జిల్లాలోని నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి ఎమ్మెల్యేలతో జూపల్లికి సఖ్యత లేదు. వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలతో పాటు వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి తో కూడా వైరం ఉంది. గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూపల్లి కృష్ణారావుకు పాత పరిచయాలు ఉన్నాయి. బీఆర్ఎస్  ఎమ్మెల్యేలను టార్గెట్  చేస్తూ ఆ పార్టీలోని అసమ్మతివాదులకు తనతో కలిసి పని చేయాలని ఆహ్వానిస్తున్నారు. చాలామంది పరోక్షంగా జూపల్లికి మద్దతు తెలుపుతుండగా, కొందరు ప్రత్యక్షంగా మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

అందరిలో అయోమయం..

జూపల్లి కృష్ణారావు టీఆర్ఎస్​ను వీడడంతో బీఆర్ఎస్​తో పాటు  కాంగ్రెస్, బీజేపీల్లో అసెంబ్లీ టికెట్  ఆశిస్తున్న వారు అయోమయానికి గురవుతున్నారు. మొన్నటి దాకా బీఆర్ఎస్ లో ఉండి ఎమ్మెల్యే  హర్షవర్ధన్ రెడ్డికి చెమటలు పట్టించిన ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం అదే పార్టీలోని హర్షవర్ధన్  వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు. కొల్లాపూర్ కాంగ్రెస్  పార్టీ టికెట్ ఆశిస్తున్న జగదీశ్వరరావు, యువనేత అభిలాష్ రావు సైతం జూపల్లి నిర్ణయం ఎలా ఉంటుందోనని వేచి చూస్తున్నారు. జూపల్లి కాంగ్రెస్ లోకి వస్తే తమ పరిస్థితి ఏమిటన్న విషయంపై వారు పార్టీ పెద్దలతో చర్చిస్తున్నారు. కలిసి పని చేయాలా? ఇంకో దారి వెతుక్కోవాలా ? అన్న ఆలోచన చేస్తున్నారు. కొల్లాపూర్ లో బీజేపీ నుంచి పోటీ చేసిన సుధాకర్ రావు సైతం జూపల్లి బీజేపీలోకి వస్తే తన పరిస్థితి ఏమిటని మదన పడుతున్నారు. ఆయన ఓట్లను చీల్చి జూపల్లి ఓటమికి కారణమయ్యారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో జూపల్లితో కలిసి పని చేయడం కుదరదని తేల్చి చెబుతున్నారు. ఈ రెండు పార్టీలు కాకుండా కొత్త పార్టీ పెడితే తాడోపేడో తేల్చుకుంటామని ఈ పార్టీల నేతలు చెబుతున్నారు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు జూపల్లి కదలికలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. 
వచ్చే ఎన్నికల్లో ఆయనను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నారు.

జూపల్లి కదలికలపై  ఇంటెలిజెన్స్  ఆరా.. 

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కదలికలపై ఇంటలిజెన్స్  వర్గాలు నిఘా పెట్టాయి. జూపల్లి ఎవరెవరితో మాట్లాడుతున్నది, ఆయనకు అనుకూలంగా ఎవరు ఉన్నారన్న దానిపై ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఇంటెలిజెన్స్  పోలీసులు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తున్నారు. వనపర్తి, దేవరకద్ర, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో జూపల్లి అనుచరులు, అభిమానులపై కూడా ఇంటెలిజెన్స్  వర్గాలు దృష్టి పెట్టాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్  అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా పని చేసేందుకు సిద్ధం కావాలని అభిమానులకు పిలుపునిచ్చారు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఏ పార్టీలో చేరతామన్నది ముఖ్యం కాదని, బీఆర్ఎస్  ఎమ్మెల్యేల ఓటమే లక్ష్యంగా కూటమి తయారు చేస్తున్నట్లు జూపల్లి వర్గీయులు చెబుతున్నారు. ఇదిలాఉంటే ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో బలమైన నేతలను గుర్తించే పనిలో పడ్డారు. ఆ తర్వాత కార్యకర్తల అభిప్రాయం తీసుకొని ఏ పార్టీలో చేరాలనే విషయాన్ని ప్రకటిస్తామని జూపల్లి చెబుతున్నారు.