పొంగులేటి ఆత్మీయ సమ్మేళానానికి జూపల్లి..? సస్పెన్స్ వీడే చాన్స్..!

  • కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం..కార్యకర్తలతో వెళ్తున్న జూపల్లి
  • పార్టీ మార్పుపై సస్పెన్స్ వీడే అవకాశం

బీఆర్ఎస్  రెబల్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్తున్నారు. తుక్కుగూడ నుంచి కార్యకర్తలతో ర్యాలీగా కొత్తగూడెం వెళ్లనున్నారు జూపల్లి. ఇప్పటికే జూపల్లి నివాసానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.గత కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ వీడే అవకాశం ఉంది. తాను ఏ పార్టీలో చేరాలనే దానిపై కూడా జూపల్లి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ తో కొంతకాలంగా జూపల్లి కృష్ణారావుకి విబేధాలు కొనసాగుతున్నాయి. ఈ ఇద్దరికి అస్సలు పడడం లేదు. నాయకులిద్దరూ ఒకే పార్టీలో ఉన్నా..ఆధితప్య పోరు కొనసాగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నుంచి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జూపల్లి ఓడిపోయారు. హర్షవర్ధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. కొన్నాళ్ల తర్వాత ఎమ్మెల్యే హర్షవర్ధన్ అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరారు. ఇక అప్పటి నుంచి జూపల్లి, హర్షవర్ధన్ కు అస్సలు పడడం లేదు. 

చాలాసార్లు బహిరంగంగానే హర్షవర్ధన్ రెడ్డి తీరును తప్పుపట్టారు జూపల్లి. ఇద్దరి మధ్య పంచాయతీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లింది. ఈ క్రమంలో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు జూపల్లి. సిట్టింగులకే టిక్కెట్లు ఇస్తానని కేసీఆర్ ప్రకటించడంతో.. జూపల్లి పార్టీపై మరింత అసంతృప్తి పెంచుకున్నారు. కొల్లాపూర్ నుంచి పోటీ చేద్దామనుకుంటే సిట్టింగులకే టిక్కెట్లు ఇస్తానని ప్రకటించడంతో జూపల్లి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం కూడా సాగింది. కానీ, ఇప్పటివరకూ జూపల్లి ఏ పార్టీలోనూ చేరలేదు.

తమలాంటి నాయకులకు పార్టీలు ముఖ్యం కాదని, తెలంగాణ అభివృద్ధి ముఖ్యమని అంటున్నారు జూపల్లి. తాను పార్టీలో ఉన్నానో లేదో బీఆర్ఎస్ వాళ్లే చెప్పాలంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో మరో ఉద్యమం రావాల్సిన పరిస్థితి కనపడుతోందన్నారు.