శక్తిగా వస్తున్నాం.. కేసీఆర్​.. కాస్కో

  • నీలో నిజాయితీ ఏదీ.. నియంత పాలన సాగిస్తున్నవ్​
  • మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్​
  • ఉద్యమకారులను అక్రమ కేసులతో వేధిస్తున్నరు
  • ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నరు
  • ప్రజల సొమ్మును కాంట్రాక్టర్లకు కట్టబెడ్తున్నరు
  • పేపర్ లీకేజీపై సీఎంకు బాధ్యత లేదా? అని నిలదీత
  • అధికారం ఎవడబ్బ సొత్తు కాదు: పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి
  • డబ్బు కొల్లగొట్టడమే కేసీఆర్ సర్కారు లక్ష్యమని మండిపాటు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఉద్యమకారులను అక్రమ కేసులతో సీఎం కేసీఆర్​ వేధిస్తున్నారని బీఆర్​ఎస్​ అసమ్మతి నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. రాష్ట్రానికి ట్రస్టీగా ఉండాల్సిన సీఎం, ‘మేము.. మాది’ అనే అహంకారంతో పరిపాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కొత్తగూడెంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. ‘‘సీఎం కేసీఆర్.. రాష్ట్ర ధర్మకర్త గా ఉండాల్సిన నీలో నిజాయితీ లోపించింది. ప్రజల సొమ్మును కాంట్రాక్టర్లకు కట్టబెడ్తూ నియంత పాలన సాగిస్తున్నవ్​.  తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను  అవమానిస్తున్నవ్. మీతో అవమానాలు పడిన ప్రతి వ్యక్తి ఒక శక్తిలా మారి వస్తున్నం.. ఇక కాస్కో.. మీపై పోరాటానికి బీజం పడింది..’’  అని  హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారిని కేసీఆర్​ అవమానిస్తూ, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదికి వస్తేనే రాష్ట్రం వచ్చిందని, నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ఆత్మ గౌరవం కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని తెలిపారు. ఆ ఆత్మ గౌరవం దెబ్బ తినడం వల్లే ఇప్పుడు ఈ ఆత్మీయ సమావేశాలు పెట్టాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. ‘‘ప్రాంతేతరులు మోసం చేస్తే పొలిమేర ఆవలకు తరిమి కొడతాం.. ప్రాంతం వాళ్లే మోసం చేస్తే పొలిమేర లోపలే పాతర వేస్తాం అన్న  కాళోజీ  కవిత ను కేసీఆర్​ గతంలో చెప్పిండు.. దాన్ని ఇపుడు అమలు చేస్తున్నరా?’’  అని జూపల్లి ప్రశ్నించారు. 2011 లో ఎమ్మెల్యే గా ఉండి, ఉద్యమంలో భాగంగా పదవికి తాను రాజీనామా చేశానని, కానీ ఇప్పుడు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్  రోజూ ఉదయం  9 నుంచి 10 గంటల వరకు ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకునే వారు. కానీ ఇప్పుడు ప్రతి పక్షాలకు కూడా  కలిసే అవకాశం లేని నియంతృత్వ పాలన సాగుతున్నది. అత్త సొమ్ము అల్లుడు దానం అన్న చందంగా ప్రజల సొమ్మును కాంట్రాక్టర్లకు కట్ట బెడుతున్నరు. సీఎం, మంత్రులు పేపర్ లీక్ తమ బాధ్యత కాదంటున్నరు. అది సీఎం పరిధిలో లేదా? ” అని నిలదీశారు. దళిత బంధు కింద ఇప్పటి వరకు రూ.17 వేల కోట్లు బడ్జెట్​లో పెడితే రూ.4 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు. రాష్ట్రంలో పాలన మారాలని, ఖమ్మం జిల్లా నుంచే ఆ మార్పు వస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా ఉమ్మడి జిల్లాలో  పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తరఫున 10కి 10 అసెంబ్లీ స్థానాలను గెలిపించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 

స్వలాభం కోసమే పార్టీ పేరు మార్చుకున్నరు: పొంగులేటి

‘‘ధనిక రాష్ట్రం అని మీరు చెప్పిన తెలంగాణలో గత 8 ఎండ్ల లో రూ.4.86 లక్షల కోట్లు అప్పు చేసింది మీరు కాదా.. ఆ అప్పులో ఎన్ని వేల కోట్లు మీ కుటుంబానికి వచ్చాయి?  దోచుకుంది చాలక మళ్లీ గెలిపించాలని అడుగుతున్నరా?” ” అంటూ కేసీఆర్​పై పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి మండిపడ్డారు.  నీళ్లు, నిధులు, నియామకాలు కోసం ఉద్యమం జరిగిందని, అన్నీ కేసీఆర్​ కుటుంబ సభ్యులకు మాత్రమే దక్కాయని అన్నారు. ‘‘సాధించుకున్న తెలంగాణను 2 విడతలుగా కేసీఆర్ పరిపాలిస్తున్న తీరు చూస్తున్నాం. స్వలాభం, స్వార్థం కోసం పార్టీ పేరు మార్చుకున్నారు. రాష్ట్రం వస్తే అందరి బతుకులు మారతాయని జనం ఆశించారు. ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఎక్కడికి పోయాయి? దళితుడిని ముఖ్య మంత్రి చేశారా? రైతు రుణ మాఫీ చేశారా? దళితులకు 3 ఎకరాలు ఇచ్చారా? ఎన్ని కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారు? ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు?” అని ఆయన ప్రశ్నించారు. టీఎస్​పీఎస్సీ  పేపర్ లీక్ చేసి నిరుపేద నిరుద్యోగుల భవిష్యత్ ను దెబ్బతీశారని ఈ సందర్భంగా పొంగులేటి మండిపడ్డారు. ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, డీసీసీబీ డైరెక్టర్​ లు తుళ్ళూరి బ్రహ్మయ్య, మేకల మల్లిబాబు, రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మాజీ డి.సి.సి.బి చైర్మన్ మువ్వా విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీల రిజర్వేషన్ల కోసం కేసు వేసేందుకు పైసలు లేవా?

‘‘కేసీఆర్​కు తన బిడ్డను రక్షించుకోవడానికి సుప్రీంకోర్టులో లాయర్లను పెట్టుకోడానికి డబ్బు ఉంది.. కానీ మైనార్టీ లకు 12 శాతం రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టులో కేసు వేసేందుకు పైసలు లేవా? సింగరేణి కార్మికులు బోర్డర్ లో ఉన్న సైనికులతో సమానం అని చెప్పిన కేసీఆర్.. గడిచిన 8 ఏండ్లలో 123 మంది గనుల్లో చనిపోతే ఏ కుటుంబాన్నైనా పరామర్శించారా?” అని పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి నిలదీశారు. ‘‘తెలంగాణ ఏర్పడే సమయంలో సింగరేణి దగ్గర ఉన్న డిపాజిట్లు రూ.3,525 కోట్లు.. మొన్న మార్చి ఆఖరి నాటికి సింగరేణికి ఉన్న అప్పు రూ.8 వేల కోట్లు. లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల పాలు చేసింది మీరు కాదా..? డబ్బు ఎక్కడ ఉన్నా, కొల్లగొట్టడమే  లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నది”అని పొంగులేటి మండిపడ్డారు. అధికారం ఎవడబ్బ సొత్తు కాదని అన్నారు. ‘‘రాష్ట్ర ఏర్పాటు కోసం కష్టించిన ప్రతి ఒక్కరినీ కేసీఆర్ ఇబ్బంది పెట్టారు.. ఇప్పుడు వారందరూ ఏకం అవుతారు..  మీరు చేసిన పనులకు ఫలితం అనుభవిస్తారు” అని హెచ్చరించారు.