ఉమ్మడి పాలమూరును అన్నిరంగాల్లో డెవలప్​ చేస్తాం

ఉమ్మడి పాలమూరును అన్నిరంగాల్లో డెవలప్​ చేస్తాం

చిన్నంబావి, వెలుగు: ఉమ్మడి  పాలమూరు జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో మంత్రి పర్యటించారు. చిన్నంబావి మండలంలోని పెద్దదగడ గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్  సర్కారు ఏర్పాటుతో దుర్మార్గ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిందన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన కొల్లాపూర్  ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. 

వీపనగండ్ల మండలం సంగినేనిపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ బిల్డింగ్​ను ప్రారంభించారు. అడిషనల్​ కలెక్టర్  సంచిత్ గంగ్వార్, డీపీవో సురేశ్, సర్పంచులు సురేందర్ సింగ్, మౌలాలి, అంజయ్య నాయక్, ఎంపీటీసీ పుష్పవతి, జడ్పీటీసీ మాధురి, పీఏసీఎస్​ చైర్మన్  రామన్ గౌడ్​ పాల్గొన్నారు.

హామీని నిలబెట్టుకుంటా..

కొల్లాపూర్: ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మండలంలోని మల్లేశ్వరం, మంచాలకట్ట గ్రామాల్లో శనివారం జరగాల్సిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదేండ్ల బీఆర్ఎస్​ పాలనతో ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పారు. రాష్ట్రంలోని అర్హులైన లబ్దిదారులందరికీ ఆరు గ్యారంటీలు అందేలా చూస్తామన్నారు. మంచాలకట్ట గ్రామస్తులను గత పాలకులు వేధింపులకు గురి చేశారని, ఇకనుంచి ధైర్యంగా ఉండాలన్నారు. మల్లేశ్వరం సర్పంచ్  నాగరాజు, పార్టీ నాయకులు నరసింహ, వెంకటేశ్, ఎంపీడీవో రామయ్య, ఏపీవో మోహన్ కృష్ణ, టీఏ రవి కుమార్  పాల్గొన్నారు.

అంబేద్కర్ విగ్రహావిష్కరణ

పానగల్: మండలంలోని మాధవరావుపల్లె గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన అంబేద్కర్  విగ్రహాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. అంబేద్కర్  ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విగ్రహ దాత చిన్న నరసింహను మంత్రి అభినందించారు. పగిడాల శ్రీనివాస్, సర్పంచ్ సునీత రాంచందర్, మాజీ జడ్పీటీసీ రవి, మాజీ ఎంపీపీ  వెంకటేశ్ నాయుడు, బ్రహ్మయ్య, పుల్లారావు పాల్గొన్నారు.