- బీఆర్ఎస్ను ఓడించేందుకు కలిసి రావాలని ఫోన్లు
- హీటెక్కిన కొల్లాపూర్, వనపర్తి రాజకీయం
వనపర్తి, వెలుగు: మంత్రి నిరంజన్‌రెడ్డి తీరుపై అసంతృప్తితో పార్టీ వీడిన వనపర్తి జడ్పీ చైర్మెన్ లోక్‌నాథ్‌రెడ్డి, మరో ఇద్దరు ఎంపీపీలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తనతో రావాలంటూ ఫోన్ చేశారు. వనపర్తిలో మంత్రిని కట్టడి చేసేందుకు తాము ఓ ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, మీ సహకారం కావాలంటూ ఫోన్ చేయడంతో ఆయన ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డిలతో సమావేశమయ్యారు. వారు తమ అనుచరులతో ఈ విషయాన్ని ప్రస్తావించడంతో ఇది బయటికు పొక్కింది.
జూపల్లి వర్సెస్ నిరంజన్‌రెడ్డి..
మొదటి నుంచి మాజీ మంత్రి జూపల్లికి, మంత్రి నిరంజన్ రెడ్డికి విభేదాలున్నాయి. 2014 ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి జూపల్లి, వనపర్తి నుంచి నిరంజన్ రెడ్డి పోటీ చేశారు. నిరంజన్ రెడ్డి గెలిస్తే తనకు మంత్రి పదవి రాదని భావించిన జూపల్లి అతన్ని ఓడించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. నిరంజన్ రెడ్డి ఓడిపోయినా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నామినేటెడ్ పదవి దక్కించుకొని ఉమ్మడి జిల్లాలో తిరిగి తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ లో ఇద్దరి మధ్య పోటాపోటీ రాజకీయాలు నడిచాయి. 2018లో కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోగా, ఆయనపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంలో మంత్రి నిరంజన్ రెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత జూపల్లి కృష్ణారావుకు బీఆర్ఎస్కు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. బీరం హర్షవర్ధన్ రెడ్డిని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు చేస్తూ జూపల్లి కృష్ణారావు సొంతంగా కొల్లాపూర్ లో రాజకీయాలు చేశారు. పార్టీలో ఒక వర్గాన్ని తన వెంట తిప్పుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో మొన్నటి దాకా బీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని ప్రచారం చేసుకున్నారు. దీంతో హర్షవర్ధన్ రెడ్డి వర్గం అయోమయంలో పడిపోయింది. ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో జతకట్టి బీఆర్ఎస్ పై విమర్శలు చేయడంతో, జూపల్లిని బీఆర్ఎస్ నుంచి బహిష్కరించారు. దీంతో జూపల్లి వ్యతిరేక వర్గాన్ని చేరదీసేందుకు వారితో మంతనాలు చేస్తున్నారు. జూపల్లి అనుచరులు ఇప్పటికే వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డిలతో పాటు పార్టీలోని అసంతృప్త నేతలను కలిసి జూపల్లితో కలిసి రావాలని ఆహ్వానించారు. ఏ పార్టీలో చేరాలన్న దానిపై స్పష్టత కావాలని అడుగుతున్నప్పటికీ, తమకు ఒక ప్రణాళిక ఉందని అందుకు అనుగుణంగా అంతా కలిసి బీఆర్ఎస్ ను ఓడించేందుకు సిద్ధమవుదామని చెప్పుకొస్తున్నారు.
ఎటూ తేల్చుకుంటలేరు..
బీఆర్ఎస్ నుంచి బయటపడ్డ వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి ఏ పార్టీలో చేరాలన్న దానిపై స్పష్టత రావడం లేదు. ఇప్పటికే బీజేపీ చీఫ్ బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. తమలో ఒకరికి టికెట్ ఇచ్చేందుకు హామీ ఇస్తే పార్టీలో చేరుతామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాము చేరే పార్టీ లేదంటే, కొత్తగా పెట్టే పార్టీ నుంచి వనపర్తి టికెట్, గెలిచేందుకు సహకారం అందిస్తామని లోక్ నాథ్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వనపర్తి, కొల్లాపూర్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. బీఆర్ఎస్, జూపల్లి వర్గాల మధ్య వాట్సాప్, సోషల్ మీడియాలో పోస్టుల యుద్దం కొనసాగుతోంది.