- బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించిన జూపల్లి
- వాళ్లు చేసిన అప్పుల వడ్డీతో రైతుభరోసాకు నిధులివ్వొచ్చని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మీది గొప్ప పాలనైతే రాష్ట్రం అప్పుల కుప్ప ఎందుకైందని బీఆర్ఎస్ నేతలను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకంతోనే ధనిక రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. ఆ అప్పులకు నెలకు రూ.6 వేల వడ్డీ కడుతున్నామని, ఆ వడ్డీ లేకపోతే రైతు భరోసా, ఇతర పథకాలకు నిధుల కొరత ఉండేది కాదన్నారు.
ఆదివారం గాంధీ భవన్లో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్ధమా? అని మంత్రి సవాల్ విసిరారు. మహబూబ్ నగర్ లో రైతు పండుగ, సీఎం బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని, అశేషంగా తరలొచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తానన్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రైతు పండుగ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నాయకులకు నిద్రపట్టడం లేదన్నారు. పాలమూరు రైతుల సాగునీటి కష్టాలకు బీఆర్ఎస్ సర్కార్ తీర్చలేకపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కు, జూరాల, భీమా ప్రాజెక్ట్ లకు నిధులు కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కుర్చీ వేసుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్న కేసీఆర్ పాలమూరుకు చుక్క నీరివ్వలేదని ధ్వజమెత్తారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు రాష్ట్రాన్ని నిలువునా దోచుకుని, కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని ఫైర్అయ్యారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వానిది గొప్ప పాలనైతే ఓఆర్ఆర్ ను ఎందుకు అమ్ముకున్నారు.
ఆ డబ్బుతో రైతుబంధు ఇచ్చిన మాట వాస్తవం కాదా’’ అని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ప్రజలను కేసీఆర్మోసం చేశారని, ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ బాగుపడడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదని ఆరోపించారు. అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా యువతను పక్కదోవ పట్టిస్తున్నాని మండిపడ్డారు.