వెడ్డింగ్ ఈవెంట్స్ లో తెలంగాణ కల్చర్ ని భాగస్వామ్యం చేయాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వెడ్డింగ్ ప్లానర్స్ ఎక్స్ పో జరగనుంది. జూన్ 14, 15వ తేదీల్లో రెండు రోజుల పాటు హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో వెడ్డింగ్ ప్లానర్స్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి దాదాపు 7 వందల మందికి పైగా ప్రతి నిధులు పాల్గొననున్నారు. వెడ్డింగ్ ఈవెంట్స్ లో వస్తున్న మార్పుల పట్ల అవగాహన కల్పించే విధంగా ఎక్స్ పో జరగనుంది.
జూన్ 9వ తేదీ ఆదివారం బేగంపేట్ ప్లాజా హోటల్ లో ఇంటర్నేషనల్ వెడ్డింగ్ ప్లానర్స్ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ వేదికగా ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందన్నారు. పెళ్లిళ్ల వేడుకలకు హైదరాబాద్ అనువైన నగరమన్నారు. తెలంగాణలో బుద్దవనం లాంటి గొప్ప పర్యాటక ప్రదేశాలున్నాయని చెప్పారు. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ ప్రోగ్రాం ద్వారా వెడ్డింగ్ ఈవెంట్స్ స్థాయి పెరగాలని ఆకాంక్షించారు. దీంతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయన్నారు.
తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రదేశాల సందర్శనకు ఈ సందర్భంగా మంత్రి ఆహ్వానించారు. పర్యాటక ప్రదేశాలలో ఈవెంట్స్ నిర్వహణకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. తెలంగాణ పర్యాటక ప్రదేశాలలో ఈవెంట్స్ చేసే వారికి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం పర్యటక రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని.. కానీ, సీఎం రేవంత్ రెడ్డి పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని మంత్రి తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరిగే ఈవెంట్ కు సీఎం రేవంత్ ను నిర్వాహకులు ఆహ్వానించనున్నారు.