జూరాల గేట్ల రిపేర్లు పూర్తయ్యేదెన్నడో?

  • నాలుగేండ్లుగా నిర్లక్ష్యం
  • 25 శాతం పనులే కంప్లీట్
  • రోప్, లీకేజీల రిపేర్లను అసలే పట్టించుకోవట్లే

గద్వాల,వెలుగు: జూరాల ప్రాజెక్టు గేట్ల రిపేర్లపై అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతోంది. 2021లో రిపేర్ల పనులు ప్రారంభిస్తే.. ఇప్పటివరకు కేవలం 25 శాతం పనులు మాత్రమే కంప్లీట్ చేశారు. ప్రాజెక్టులో 64 గేట్లు ఉండగా, 18 గేట్లకు ఇనుప రోప్​లు, రబ్బర్ సీల్స్ తో పాటు, 64 గేట్లకు మైనర్ రిపేర్లు చేసేందుకు 2021లో రూ.12 కోట్లతో టెండర్లు పిలిచారు. 

హైదరాబాద్ కు చెందిన స్వప్న కన్​స్ట్రక్షన్ కంపెనీ టెండర్లు దక్కించుకొని, పనులు స్టార్ట్ చేయగా అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం గ్యాంటి క్రేన్ రిపేర్లు, వాక్ వే బ్రిడ్జికి సాండ్ బ్లాస్టింగ్ పనులతో పాటు పెయింటింగ్ పనులు మాత్రమే చేశారు. గేట్ల రోప్ డ్యామేజీ, గేట్ల నుంచి నీటి లీకేజీల రిపేర్ పనులు మాత్రం ఇప్పటివరకు చేయలేదు. 

మూడేండ్ల నుంచి రిపేర్​ పనులు

జూరాల ప్రాజెక్టులో ఎనిమిది గేట్లకు రోప్ డామేజ్ ఉన్నట్లు గుర్తించారు.  12 గేట్ల నుంచి నీరు లీకేజ్ అవుతున్నదని, ముఖ్యంగా నాలుగు గేట్ల నుంచి ఎక్కువ మొత్తంలో నీరు లీకేజ్ అవుతుందని గుర్తించారు. వీటికి వెంటనే రిపేర్లు చేయాలని 2020 లోనే నిర్ణయించి టెండర్లకు  పిలిచారు.  కాంట్రాక్టుదక్కించుకున్న కంపెనీ మూడేళ్ల నుంచి పనులను సాగిస్తోంది. 

ఆరు నెలల్లోనే కంప్లీట్ చేయాలి..

టెండర్లలో రిపేరు పనులను దక్కించుకున్న కంపెనీ పనులను ఆరు నెలల్లో కంప్లీట్ చేయాలని అగ్రిమెంట్ లో పేర్కొన్నారు. కేవలం పైపై పనులు మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారని, ముఖ్యమైన గేట్ల లీకేజీ, ఇనుప రూపుల ఏర్పాటు,రబ్బర్ సిల్స్ వెయ్యడము తదితర ముఖ్యమైన పనులు అన్నిటినీ పక్కనపెట్టి కేవలం పెయింట్ వేయడం, సాండ్ బ్లాస్టింగ్ పనులు చేసి కాలయాపన చేశారనే విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా గ్యాంటీ క్రేన్ రిపేర్ల పేరిట ఏడాది కాలం వెళ్లదీశారని పలువు విమర్శిస్తున్నారు.

8 గేట్లకు రోప్​  ముప్పు..

ప్రాజెక్టులో  18 గేట్లు రిపేరు ఉన్నట్లు గుర్తించారు.   ముఖ్యంగా 8 గేట్లకు రోప్​  ముప్పు ఉందని గుర్తించి పనులు స్టార్ట్ చేసిన ఇప్పటివరకు కంప్లీట్ కాలేదని రైతులు వాపోతున్నారు. ప్రమాదం జరిగాక హడావుడి  చేసే దానికన్నా ప్రమాదం జరగక ముందే రిపేర్లను గుర్తించి కంప్లీట్ చేయాల్సిన ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు దక్కించుకున్న కంపెనీ ఆలస్యం చేసినా..  చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆఫీసర్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

2009 ఏడాదిలో జూరాల ప్రాజెక్టుకు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. అలాంటి వరదలే మళ్లీ ఈ మధ్యకాలంలో వచ్చి ఉంటే ప్రాజెక్టు గేట్లకు ఇబ్బంది ఏర్పడేదని నిపుణులు చెప్తున్నారు. ఇటీవల వరద ఉధృతికి కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్​ ఉన్న ఒక గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. 

మేజర్  రిపేర్లు ఉన్నా నిర్లక్ష్యమే..

జూరాల ప్రాజెక్టుకు మేజర్ రిపేర్లు ఉన్నప్పటికీ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎనిమిది గంటలకు రూప్ డ్యామేజ్ ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. వరద ఎక్కువగా వస్తే రోప్​ తెగిపోయి గేటు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంటుంది లీకేజీలతో ప్రతిరోజు 12 గేట్ల ద్వారా 1500 నుంచి 2000 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వృథాగా అవుతుంది. పోయే నీళ్లను జూరాల కున్న రెండు కాలువల ద్వారా దిగువకు వదిలే అవకాశముంటుంది. ప్రమాదం జరగక ముందే జూరాల ప్రాజెక్టు రిపేర్లపై దృష్టి  పెట్టాలని రైతులు కోరుతున్నారు.  

రిపేర్లపై దృష్టి పెడుతున్నాం..

జూరాల ప్రాజెక్టు గేట్ల రిపేర్ల పై దృష్టి పెడుతున్నాం. ప్రస్తుతం జూరాలకు వరద లేదు ఈ ఆరు నెలల్లోనే పనులు కంప్లీట్ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికిప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఏమీ లేవు. - జుబేర్ అహ్మద్, ఈఈ, జూరాల ప్రాజెక్టు