ప్రమాదాలకు నిలయంగా జూరాల.. రక్షణ చర్యలు చేపట్టని ఆఫీసర్లు

ప్రమాదాలకు నిలయంగా జూరాల.. రక్షణ చర్యలు చేపట్టని ఆఫీసర్లు
  • బ్యాక్ వాటర్, మెయిన్​ కెనాల్స్​లో ఈత సరదాతో ప్రమాదాలు

వనపర్తి, వెలుగు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్​ ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ప్రతీ ఏడాది జూరాల ప్రాజెక్టు, మెయిన్​ కెనాల్స్ లో మునిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సంబంధిత ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో ప్రతీ సంవత్సరం ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో ప్రతి రోజు వేల సంఖ్యలో పర్యాటకులు జూరాల ప్రాజెక్టుకును సందర్శిస్తున్నారు. అనుమతి లేకున్నా ప్రాజెక్ట్  బ్యాక్  వాటర్, ప్రధాన కెనాల్స్​లో ఈత కొడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

తరచూ ప్రమాదాలు..

జూరాల ప్రాజెక్ట్, బ్యాక్ వాటర్, మెయిన్  కెనాల్స్​లో సరదాగా ఈత కొట్టేందుకు యువకులు, పిల్లలు, విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారు. ఇంట్లో వాళ్లకు తెలవకుండా ఈత కోసం వస్తున్నారు. ఈత వచ్చినవారితో పాటు రాని వారు నదిలో దిగుతూ సరదా తీర్చుకుంటున్నారు. కొందరు సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదాలను గుర్తించలేకపోతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదానికి గురవుతున్నారు. ఈత రానివారు పారుతున్న నీటిలోకి దిగడం ఆందోళన కలిగిస్తోంది. వీరిని అడ్డుకునే వారు ఎవరూ లేకపోవడంతో ప్రాణాలు పోతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా హైదరాబాద్, కర్నూల్  నుంచి జూరాల ప్రాజెక్టుకు వచ్చి అనేక మంది చనిపోయారు. వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి మెయిన్  లెఫ్ట్  కెనాల్ కు ఈతకు వెళ్లిన జెన్​కో ఇంజనీర్​రాజేంద్ర ప్రసాద్, ఆయన తోడల్లుడు శ్రావణ్  నీటి ఉధృతిలో కొట్టుకుపోయి చనిపోయారు. 

ఈ ప్రమాదంలో నలుగురు  పిల్లలను అక్కడే చేపలు పడుతున్న జాలరులు కాపాడారు. మహబూబ్​నగర్  జిల్లా కేంద్రానికి చెందిన ఓ డాక్టర్  తన తండ్రి అస్తికలు నదిలో కలిపిన తర్వాత స్నానం చేస్తూ నీటి ఉధృతిలో కొట్టుకుపోయాడు. నాలుగేండ్ల కింద హైదరాబాద్ నుంచి విహార యాత్రకు వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు యువతులు చనిపోయారు. ఏడాది వ్యవధిలో వేర్వేరు సందర్భాల్లో ఈత కోసం వచ్చి నీట మునిగి  నలుగురు చనిపోయారు. ఇంజనీరింగ్  విద్యార్థి హర్ష గౌడ్   గతంలో ఆత్మకూర్ సమీపంలోని కెనాల్​లో ఈతకు వెళ్లి నీటిలో మునిగి పోయాడు. 

నివారణ చర్యలేవి?

జూరాలకు వచ్చే పర్యాటకులు ఎలాంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. జింకల పార్కు ఏర్పాటు చేయాలని ఎన్నో ఏండ్లుగా ప్రపోజల్స్​ ఉన్నా కాగితాలకే పరిమితం అవుతోంది. దీనికి తోడు తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ఇరిగేషన్​ ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆదివారం, సెలవులు, పండుగ రోజుల్లో జూరాల ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. వారిని ప్రమాదాల బారిన పడకుండా రక్షణ, భద్రత చర్యలు తీసుకోవడం లేదు. కనీసం గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడం లేదని అంటున్నారు. 

పోలీసుల గస్తీ ఏర్పాటు చేయాలి..

జూరాల ప్రాజెక్టును చూసేందుకు వస్తున్న వారు ప్రమాదాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలి. వరద ఉధృతి తెలియక చాలా మంది ఈతకు వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రధాన కాలువల్లోకి దిగకుండా చూడాల్సిన బాధ్యత ప్రాజెక్టు అధికారులపై ఉంది. పోలీసుల గస్తీ ఏర్పాటు చేసి మొబైల్ వైద్య సేవలు అందుబాటులోకి ఉంచాలి.

ఎ.అశ్విన్ కుమార్, మత్స్యకార సంఘం అధ్యక్షుడు, ఆత్మకూర్