- జూరాలకు రాని వరద నీరు
- నీళ్లు లేక వెలవెలబోతున్న ఎత్తిపోతల పథకాలు
- ఆరుతడి పంటల సాగుపై రైతుల నజర్
వనపర్తి, వెలుగు: తెలంగాణలో కృష్ణానదికి ముఖ ద్వారమైన C వ్యక్తమవుతోంది. ఈ సారి వానాకాలం సేద్యం 15 రోజుల ముందే ప్రారంభించాలని ప్రభుత్వం సూచించినప్పటికీ, వర్షాభావ పరిస్థితులతో పంటల సాగు నెల రోజులు వెనక్కి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. కృష్ణానదిపై ఆధారపడ్డ పలు సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీరందించడం ఈసారి ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది. కృష్ణానదిపై ఉన్న జూరాల ప్రాజెక్ట్ నిండాలంటే కర్నాటకలోని నారాయణపూర్, ఆల్మట్టి, ఉజ్జయిని ప్రాజెక్టులు నిండి గేట్లు ఎత్తాలి. ఆల్మట్టి ప్రాజెక్ట్ లో 129.72 టీఎంసీలకు గాను ప్రస్తుతం 20.43 టీఎంసీలే ఉన్నాయి. నారాయణపూర్ డ్యాంలో 37.64 టీఎంసీలకు గాను 18.20 టీఎంసీలే ఉన్నాయి. భారీ వరదలు వస్తే తప్ప జూరాలకు ఇప్పుడప్పుడే నీళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పొలాలకు నీరందాలంటే జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు రావాలి.
ఎత్తిపోతల పథకాలు వెల వెల..
జిల్లాలోని పంట భూములకు సాగు నీరందించే ప్రధాన ఎత్తిపోతల పథకాలైన బీమా, కల్వకుర్తి నుంచి సాగునీరు అందాలంటే ఇటు జూరాల అటు శ్రీశైలం ప్రాజెక్ట్ లకు నీళ్లు రావాలి. బీమా ప్రాజెక్ట్ కింద 1.9 లక్షల ఎకరాలకు గాను, 60 వేల ఎకరాలకుమాత్రమే గత సీజన్ లో నీరందించారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి కాల్వలు, ఇతర రిజర్వాయర్ల పనులు పూర్తి కాలేదు. అలాగే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 3.60 లక్షల ఎకరాలకు గాను, 1.50 లక్షల ఎకరాలకే నీరందిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కోయిల్ సాగర్, నెట్టెంపాడు పథకాలకు సైతం కృష్ణానది నీళ్లే ఆధారం. ప్రతీ ఏడాది జులై చివరి వారంలో రైతులు నాట్లు వేసుకునేందుకు సిద్దమయ్యేవారు. జూరాల, శ్రీశైలం బ్యాక్ వాటర్ అంతంతమాత్రంగా ఉండడంతో రిజర్వాయర్ కు పంపింగ్ ప్రారంభం కాలేదు. దీంతో రైతులు ఎప్పటిలాగే ఆగస్టులోనే వరినాట్లు వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీమా ప్రాజెక్ట్ ఫేజ్ 1, 2 ఎత్తిపోతల పథకాల ద్వారా సంగంబండ, శంకర సముద్రం, రంగసముద్రం, ఏనుకుంట రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం జూరాల, రామన్ పాడు ప్రాజెక్టుల్లో నిల్వలను తాగునీటి అవసరాలకే వాడుకోవాలన్న నిబంధన ఉండడంతో సాగునీటి పథకాల పంప్ హౌస్ లను తెరవడం లేదు. ఈ పరిస్థితిలో రైతులు నారు మళ్లు పోసుకోవాలా వద్ద అన్న సందిగ్ధంలో పడ్టారు. మరికొందరు బావులు, బోర్ల కింద సేద్యానికి సిద్దమవుతున్నారు.
స్వల్పకాలిక రకాల వైపు చూపు..
నీటి లభ్యత అంతంతమాత్రంగా ఉండడంతో జిల్లా రైతులు స్వల్పకాలిక రకాలపై దృష్టి పెడుతున్నారు. వీటిలో ఎక్కువ శాతం దొడ్డు రకం వడ్లే ఉండడం, వీటికి మార్కెట్లో సరైన డిమాండ్ ఉండకపోవడంతో రైతులు తర్జనభర్జన పడుతున్నారు. ఆరుతడి పంటలు సాగు చేయాలని అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రచారం ప్రారంభించారు. అయితే ఏ పంటలు సాగుచేయాలో, విత్తనాలు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయన్న విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. వరికి ప్రత్యామ్నయంగా మొక్కజొన్న, జొన్న, సజ్జ, ఇతర చిరుధాన్యాలతో పాటు పొద్దుతిరుగుడు, ఆముదం పంటలు సాగు చేసే అవకాశాలు ఉన్నా విత్తనాలు అందుబాటులో లేక రైతులు అయోమయానికి గురవుతున్నారు.