గద్వాల, వెలుగు: జూరాలకు వరద వచ్చి వందల క్యూసెక్కుల నీరు దిగువకు పోతున్నా జూరాల ప్రాజెక్ట్ రైట్ కెనాల్(సోమనాద్రి కాల్వ)కు సాగునీరు ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్ లో నారు పోసుకున్న రైతులు ఆగస్టు వచ్చినా నీరు విడుదల చేయకపోవడంతో పంట పొలాల్లో పనులు చేయలేకపోతున్నారు. కాలువలకు నీరు విడుదల చేసే ముందు బ్రిడ్జి పనులు, రిపేర్లు అంటూ హడావుడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుడి కాలువ కింద 36వేల ఎకరాలు సాగవుతుండగా, ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు.
నారుమళ్లు ముదురుతున్నయ్..
జూరాల రైట్ కెనాల్ కింద 36 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తారు. వానాకాలం పంటగా రైతులు వరి పంట సాగు చేస్తారు. ఇప్పటికే అనంతపురం, బీరెల్లి, లత్తిపురం, బసల్ చెరువు, ములకలపల్లి, భీంపురం, అగ్రహారం తదితర గ్రామాల్లో రైతులు ఆర్ఎన్ఆర్, బీపీటీ రకం వరి విత్తనాలు అలికి నారుమళ్లు వేశారు. ఆరుద్ర కారైలో నారు పోశాక 25 నుంచి 30 రోజుల్లో నాటు వేయాలి, నారు పోసి 40 రోజులు దాటిపోతున్నా కాలువల్లో నీరు రాకపోవడంతో పంట పొలాల్లో కరిగేటు చేయలేని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. నారు మళ్లు ముదిరి పంట దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు.
ఎండాకాలంలో పనులు చేయలే..
జూరాల రైట్ కెనాల్ పరిధిలో ఏవైనా రిపేర్లు ఉంటే ఎండాకాలంలో చేయాలి. కానీ ఎండాకాలం అయిపోయే దాక రిపేర్ల జోలికి పోలేదు. గద్వాల పట్టణంలోని కృష్ణ రోడ్ కి వెళ్లే దారిలో బ్రిడ్జి పనులు మూడేండ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. గతంలో ఎప్పుడో పనులు కంప్లీట్ చేయాల్సిన కాంట్రాక్టర్, కాలువకు నీళ్లు వదిలే ముందు వర్క్స్ స్టార్ట్ చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని రైతులు అంటున్నారు. ఒక బ్రిడ్జి నిర్మాణం కోసం సాగు నీళ్లివ్వకుండా రైతులను గోస పెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
పనులతో లేట్ అవుతోంది..
రైట్ కెనాల్ పై గద్వాల పట్టణం సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణంతో నీళ్లు విడుదల చేయడం ఆలస్యమవుతోంది. స్లాబ్ పడ్డాక నీళ్లు వదులుతాం. ప్రస్తుతం జములమ్మ రిజర్వాయర్ నుంచి నారు మడులకు నీళ్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. తొందర్లోనే జూరాల నుంచి నీటిని విడుదల చేస్తాం. - జుబేర్ అహ్మద్, ఈఈ, జూరాల
నారు పోసి 40 రోజులు దాటింది..
నాకు ఐదెకరాల పొలం ఉంది. నాట్లు వేసేందుకు ఆర్ఎన్ఆర్ వరి రకం నారు కోసి 40 రోజులు దాటింది. కాలువకు నీళ్ల రాకపోవడంతో కరిగేటు చేయలేదు. నీళ్లు వచ్చుడు ఆలస్యమైతే నష్టం వస్తుంది. - యుగంధర్ రెడ్డి, రైతు, బీరెల్లి