క్లీన్​గా ఉంటేనే కరోనా కంట్రోల్

దాదాపు మూడు నెలలుగా  ప్రపంచమంతా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు కరోనా. చైనాలోని వూహాన్ లో పుట్టిన ఈ వైరస్ అన్ని దేశాలను వణికిస్తోంది. ఏ దేశంలో చూసినా మొహానికి మాస్క్ వేసుకున్న ప్రజలే కనిపిస్తున్నారు. రోజురోజుకు కరోనా తీవ్రత పెరుగుతుండడంతో  ప్రభుత్వాలు కూడా ముందు జాగ్రత్తగా అనేక చర్యలు తీసుకుంటున్నాయి. స్కూళ్లు, కాలేజీలను బంద్ పెట్టాయి. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో జనం గుమికూడటం పై ఆంక్షలు పెట్టాయి. ప్రజలు కూడా అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. ప్రయాణాలు మానుకుంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కరోనా లాంటి డేంజరస్ వైరస్​లపై  అవగాహన పెంచాలంటున్నారు  హెల్త్ కేర్ నిపుణులు. వ్యక్తిగత పరిశుభ్రతను పల్లె జనం పాటిస్తే కరోనాను కంట్రోల్ చేయవచ్చంటున్నారు.

మనదేశంలోనూ  కరోనా వైరస్  రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటివరకు 137 మంది ఈ మహమ్మారి బారిన పడ్డట్లు లెక్కలు తేల్చి  చెబుతున్నాయి. మనదేశంలో  కరోనా ప్రస్తుతం ‘స్టేజ్–2’ లో ఉంది. కేవలం నెలరోజుల్లోనే ‘స్టేజ్–3’ కు వెళ్లే అవకాశాలున్నాయని వైద్య శాస్త్ర నిపుణులు  చెబుతున్నారు. ఈ దశలో కరోనా కట్టడి చేయడానికి గ్రామీణ ప్రాంతాలపై  దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత విషయంలో మన పల్లెలు బాగా వెనకబడ్డాయన్నది వీరి వాదన.  పల్లె జనానికి వ్యక్తిగత శుభ్రత పై అవగాహన లేకపోవడం దీనికి ముఖ్య కారణం అంటున్నారు.

చేతులు కడుక్కునే అలవాటే తక్కువ

మనదేశ జనాభాలో 66 శాతం మంది పల్లెల్లోనే బతుకుతున్నారు. పట్టణ, నగర ప్రజలకు అందుబాటులో ఉన్న హెల్త్​ కేర్‌‌ సర్వీసెస్ కు ఊరి జనం బాగా దూరంగా ఉన్నారు. దీనికి కూడా అనేక కారణాలున్నాయి. పల్లెల్లో హెల్త్ కండిషన్స్ ను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ప్రధాన కారణమన్న విమర్శ చాలా రోజుల నుంచి ఉన్నదే. కరోనా విషయంలో తరచూ  చేతులు కడుక్కోమని డాక్టర్లు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్లతో శుభ్రం చేసుకోమని కూడా సలహా ఇస్తున్నారు. అయితే  పల్లె జనానికి అసలు చేతులు కడుక్కునే అలవాటే చాలా తక్కువ. పసిపిల్లలకు  పాలివ్వడానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కునే అలవాటు కేవలం 14.7శాతం మంది మహిళల్లోనే ఉందని  తాజా అధ్యయనం వెల్లడించింది. అలాగే చిన్నారులకు అన్నం తినిపించడానికి ముందు చేతులు క్లీన్ చేసుకునే అలవాటు కూడా పల్లె జనంలో బాగా తక్కువ. ఇలాంటి అలవాటు ఉన్న వాళ్లు 26.3 శాతం మాత్రమే ఉన్నారని లెక్కలు తేల్చి చెబుతున్నాయి. ఇవే కాదు చిన్న పిల్లలకు స్నానం చేయడానికి ముందు వ్యక్తిగత శుభ్రత గురించి ఆలోచించే వాళ్లు కూడా తక్కువ శాతమే ఉంటున్నారు. వీటన్నిటి ఫలితంగా కరోనా విజృంభించడానికి అవకాశాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ ఎక్కడ?

గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ కేర్ సిస్టం పై  ప్రభుత్వాలు మరింత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఇప్పటికే ‘ప్రైమరీ హెల్త్ సెంటర్లు’ అంటూ మనదేశంలో ఒక వ్యవస్థ ఉంది. ఈ పీహెచ్​సీలను మరింత బలోపేతం చేయాలంటున్నారు. సామాన్య పల్లె జనానికి హెల్త్ కేర్ సిస్టంను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నది  నిపుణుల సలహా. పల్లెజనం ఎక్కువగా ఏయే వ్యాధులకు గురవుతున్నారు, నివారణ చర్యలేంటి? రోగాలు విజృంభిస్తే వాళ్లకున్న ఆప్షన్స్ ఏంటి? ఈ వివరాలన్నిటినీ పక్కాగా ికార్డు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు హెల్త్ కేర్ నిర్వాహకులు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్నా చాలా పల్లెల్లో ఇప్పటికీ అందుకు సంబంధించి సరైన అవగాహన లేదు. అపోహలతోనే పల్లెజనం కాలం గడుపుతున్నారు. ఒక్క కరోనా అనే కాదు ఏ వైరస్ కు సంబంధించైనా, ఏ అంటు వ్యాధికి సంబంధించైనా గ్రామీణ ప్రాంతాల్లో ముందుగా అవగాహన కల్పించడానికి  ప్రభుత్వాలు చొరవ చూపాలి.

మరిన్ని కఠిన చర్యలు అవసరం

కరోనాను కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో  నిర్ణయాలు తీసుకుంది. అనేక దేశాల నుంచి విమానాల రాకపోకల్ని నిషేధించడంతో పాటు 14 దేశాల నుంచి వచ్చే వాళ్లను రెండు వారాల పాటు క్వారంటైన్ చేయాలని కూడా నిర్ణయించింది. ఇవన్నీ మంచి నిర్ణయాలే. వీటికెవరూ అభ్యంతరం చెప్పరు. అయితే కేవలం వీటితోనే కరోనా ను కంట్రోల్ చేయగలం అనుకోవడం కరెక్ట్ కాదు. మరిన్ని కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందంటున్నారు డాక్టర్లు. కరోనా విషయంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమంతట తామే స్కూళ్లు, కాలేజీలు, ఫంక్షన్ హాళ్లు, సినిమా థియేటర్లు మూసివేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. పర్సనల్ హైజిన్ కు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను కట్టడి చేయడం ఈజీయేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యుహెచ్​ఓ) అధికారులు కూడా అంటున్నారు. ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించాలి. పల్లెల్లో నివసించే ఎక్కువ మంది ప్రజలు ఆర్థికంగా  పేదలు. పగలంతా కాయకష్టం చేస్తే కానీ  మూడు పూటలా తిండి గడవని పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఒంట్లో నలతగా అనిపించినా డాక్టరు దగ్గరకు వెళ్లడానికి  వీళ్ల దగ్గర పైసలుండవు. దీంతో కొన్ని వందల ఏళ్లుగా తమకు తెలిసిన చిట్కా వైద్యాన్నే నమ్ముకుంటారు. అయితే మామూలు వ్యాధులు వేరు. అంటువ్యాధులు వేరు. అంటువ్యాధుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా వాయువేగంతో అంటువ్యాధి వ్యాపించే స్కోప్ ఉంది. ఈ నేపథ్యంలో  కరోనా  వైరస్ లాంటి అంటువ్యాధులు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  పల్లె జనానికి అవగాహన కల్పించడంలో సర్కార్లు వెనకబడుతున్నాయన్న విమర్శ వినిపిస్తోంది.

డయేరియాతో ఏడాదికి పది వేల మంది బలి

డయేరియాను చాలా మంది చిన్న విషయంగా తీసుకుంటారు. కానీ దేశవ్యాప్తంగా ఏడాదికి పది వేలమందిని ఈ వ్యాధి బలి తీసుకుంటోంది. వీళ్లలో ఎక్కువ మంది చిన్నారులే. డయేరియాను నివారించడానికి కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లక్కర్లేదు. వేలు, లక్షలు పెట్టి ఆపరేషన్లు చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో  కనీస  జాగ్రత్తలు తీసుకున్నా డయేరియాను నివారించవచ్చంటున్నారు హెల్త్ కేర్ నిపుణులు. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కునే అలవాటు లేకపోవడం వల్లనే  ఊరి జనం రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని చెబుతున్నారు. జలుబును సింపుల్ గా నివారించవచ్చు. అయితే ఈ విషయంలో కూడా అవగాహన లేకపోవడం వల్ల, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం వల్ల మామూలు జలుబు కూడా చివరకు న్యూమోనియాకు దారి తీస్తోంది.

See Alos: ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

రైతు రుణమాఫీ: అర్హులను ఇలా గుర్తిస్తారు

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలో కవిత