బీసీల్లో రాజకీయ చైతన్యం

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చినట్లే బీసీ వర్గాల్లో కూడా చైతన్యం మొదలైంది. ఎన్నికలొస్తే రాజకీయ పార్టీలు బీసీల జపం చేయడం అలవాటైపోయింది.  కులవృత్తులు చేసుకునే జనసమూహమే బీసీ వర్గాలైనందున జనాభాలో వారు అత్యధికంగా అంటే 50 శాతానికి పైగా ఉంటారు. దాంతో రాజకీయ పార్టీలు కూడా వారి ప్రాధాన్యతను గుర్తిస్తుంటాయి. అయితే, అనాదిగా వారిని ఓటు బ్యాంకుగా చూడటమే ఈ ప్రాంతీయ పార్టీలకు అలవాటైపోయింది. దానికి తోడు శాసనసభ, లోక్ సభలలో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించినట్లు రిజర్వేషన్లు వీరికి లేకపోవడం వల్ల కూడా వీరు తీవ్రంగా నష్టపోతున్నారు. సమతౌల్యంపేరుతో కొన్ని సీట్లు ఇచ్చినా, గెలిచినవారికి ప్రాధాన్యం తక్కువే. 

మంత్రి పదవులు కూడా లెక్కకే ఇస్తారు. అధికారం ఏమీ ఉండదు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నచోట బీసీ నేతలు మంత్రులైనా  వారి చేతిలో అధికారం నేతిబీరకాయ చందంగా ఉంటుంది. రాజకీయ అధికారం లేకుండా బీసీ వర్గాల అభివృద్ధి సాధ్యంకాదనేది బీసీ కులాలు తెలుసుకున్నాయి. జనాభాలో 50 శాతానికి పైగా తామున్నప్పటికీ తగిన ప్రాధాన్యత లేదన్న బాధ, వేదన వారిలో తీవ్రస్థాయిలో నెలకొంది. తమలో ఐకమత్యంలేకపోవడం వల్లే పరిస్థితి ఇలా ఉందని వారికి స్పష్టమైంది. రాజకీయ భాగస్వామ్యం కోసం వారు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు.

బీసీ మేధావులు, నాయకుల్లో కదలిక

బీసీ వర్గాలలోని ఉత్సాహవంతులైన యువత రాజకీయంగా ఎదగడానికి చేయవలసిన ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా అన్ని విధాల వెనుకబడిన తాము ఏకం కాకపోతే మరో వందేళ్లైనా తమ బతుకుల్లో మార్పు రాదని వారికి అర్ధమైంది. ముఖ్యంగా బీసీ వర్గాలలోని మేధావులు, ఉద్యోగులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే, బీసీ కులాలన్నీ ఏకం కావడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీసీలలో  నాయకత్వ కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముందు దానిని అధిగమించే ప్రయత్నంలో అన్ని జిల్లాల్లో యువతను ప్రోత్సహిస్తున్నారు.  బీసీలలో ఎవరి కులాలు వారివి, ఎవరి వాదాలు, ఎవరి ఆలోచనలు, ఎవరి అభిప్రాయాలు వారివి. విభిన్న దృక్పథాలతో ఉన్న వారందరినీ కలపడానికి బీసీ అనే భావనతో ముందుకు వెళ్లడానికి మేధావి వర్గం ప్రయత్నిస్తోంది. ఆయా కుల సంఘాలు తమ ఉనికిని చాటుకుంటూనే, బీసీ వర్గాలుగా ఏకమవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

బీసీ డిక్లరేషన్లు ప్రకటిస్తున్న పార్టీలు

బీసీ ఉద్యమానికి మరింత ఊపునిచ్చేవిధంగా తెలంగాణలో బీసీ జర్నలిస్టులు కూడా రాజకీయంగా ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.  తెలంగాణలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు బీఆర్ఎస్ చెప్పడమేగాక  బీసీలకు రూ.లక్ష సహాయం పథకం కూడా ప్రకటించింది. బీజేపీ ఏకంగా పలు అంశాలతో  బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. కాంగ్రెస్ కూడా బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని తెలిపింది.  ఈసారి  పార్టీలు పోటీపడి బీసీలకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. దానిని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనలో బీసీ నేతలు ఉన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా బీసీలు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వారికి మద్దతు ఇచ్చి గెలిపించాలని బీసీ నేతలు  ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారు.  పోటీ పడే అభ్యర్థులందరూ బీసీలయితే ఏకాభిప్రాయంతో ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వాలని, అలా సాధ్యం కానిపక్షంలో తటస్థంగా ఉండటం మంచిదన్న ఆలోచన కూడా వారిలో ఉంది. ఆర్థికంగా స్థితిమంతులు, విద్యావంతులైన బీసీ యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

కుల వ్యవస్థ వేళ్లూనుకుపోయిన మన సమాజంలో ఇతర కులాల సహాయ, సహకారం లేకుండా రాజకీయంగా ఎదగడం ఎవరికీ సాధ్యం కాదు. అందువల్ల రాజకీయంగా అన్ని కులాలతో సఖ్యతగా ఉండాలన్న నిర్ణయంతో ఉన్నారు. అలాగే, ఆయా కులాల పెద్దలను కలిసి అన్ని బీసీ కుల, ఉద్యోగ, వృత్తి సంఘాలను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థికంగా కూడా తగిన స్థాయిలో తమ వర్గానికి చెందిన వ్యాపారులు, ఉద్యోగుల నుంచి నిధులు సేకరించడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు. ప్రతి జిల్లాలో భారీ స్థాయిలో బీసీ సభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీల బలం నిరూపించే  ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు.

- శిరందాసు 
నాగార్జున రావు,
 సీనియర్ జర్నలిస్ట్