ఆయన వెనుకుంది ఏ పార్టీయో అందరికీ తెలుసు.. వాళ్లు ఆడిస్తున్నట్టు ఆడుతుండు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

ఆయన వెనుకుంది ఏ పార్టీయో అందరికీ తెలుసు.. వాళ్లు ఆడిస్తున్నట్టు ఆడుతుండు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్
  •  మూడుసార్లు పోటీ చేస్తే డిపాజిట్​రాలె
  • దళితుల్లో  ఏ వర్గానికి  నేను వ్యతిరేకం కాదు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి 

సూర్యాపేట: మందకృష్ణ మాదిగ తనపై రేటింగ్​కోసమే తప్పుడు ఆరోపణులు చేస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి అన్నారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ..  తన కుటుంబంపై కృష్ణ మాదిగ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. 

‘ఆయన వెనకాల ఏ పార్టీ ఉందో అందరికీ తెలుసు. వాళ్లు ఆడిపిస్తున్నట్టు ఆడుతుండు. మాల, మాదిగలది పొలిటికల్​గొడవ. మా నాన్న కాకా వెంకటస్వామీ , నేను దళితుల ఐక్యత కోసమే పనిచేశాం. ఇప్పటికీ చెప్తున్నా దళితుల్లో ఏ వర్గానికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు. ప్రజల్లో ఆదరణ లేని కృష్ణ మాదిగ.. మూడుసార్లు ఎన్నికల్లో పోటీచేసి డిపాజిట్ కూడా రాలేదు. కుటుంబంలో ముగ్గురికి  పదవులంటూ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అగ్రవర్ణాల్లో ఉన్న పది శాతం రిజర్వేషన్ లో వర్గీకరణ లేనిది, మరి ఎస్సీల్లో ఎందుకు  ఉండాలి..? ముందుగా ఎస్సీల్లో ఏ వర్గానికి ఎన్ని ఉద్యోగాలున్నాయో లెక్క తేల్చాలి..’ అని వివేక్​ వెంకటస్వామి అన్నారు. 

డిజిటల్​యుగంలో కులాహంకారాన్ని ప్రదర్శిస్తుండ్రు 

సూర్యాపేటలో పరువు హత్య దారుణం 

సూర్యాపేట: డిజిటల్​యుగంలో కొంతమంది కులాహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని, సూర్యాపేటలో పరువు హత్య దారుణమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి అన్నారు. ఇవాళ సూర్యాపేట లోని మామిళ్ల గడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ  పరువు హత్యకు గురైన విషయాన్ని తెలుసుకొని  కుటుంబాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి పరామర్శించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.  బాధిత  కుటుంబానికి రూ. కోటి సాయంతో పాటు, ప్రభుత్వం ఉద్యోగం, ఐదెకరాల భూమి కొనుగోలు చేసి ఇవ్వాలని డిమాండ్​ చేశారు.  సీఎం  రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.  తక్షణమే ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు.  కుటుంబ సభ్యులకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.  రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు తాను అండగా ఉంటామన్నారు.  నిందితులకు శిక్ష పడే విధంగా సీఎంతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు.