కృష్ణా జలాలపై వాటా తేలేవరకు ‘డిండి’ స్కీమ్ పడకేసినట్లే

  • 7 మండలాల్లో 130 చెక్ డ్యాంలు నిర్మించాలని ప్రపోజల్స్
  • హాలియా, కనగల్​వాగులపై నిర్మాణం 

నల్గొండ, వెలుగు: మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పిన సర్కార్​చెక్​డ్యామ్ లతోనే సరిపెట్టనుంది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేలకపోవడంతో డిండి లిఫ్ట్ ఇరిగేషన్​ స్కీం ప్రశ్నార్థకరంగా మారింది. 2015లో ప్రారంభించిన డిండి లిఫ్ట్ స్కీమ్ కింద రిజర్వాయర్లు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడంలేదు. ఇటీవల మునుగోడులో మంత్రి కేటీఆర్ జరిపిన రివ్యూలోనూ చెక్​డ్యామ్​లకు ప్రపోజల్స్​రెడీ చేయాలని ఆదేశించారు. దీంతో నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఇరిగేషన్​ఆఫీసర్లు రిమోట్ సెన్సింగ్ ద్వారా సర్వే చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న వాటికి  అదనంగా ఇంకా ఎక్కడెక్కడ చెక్​డ్యామ్​లు నిర్మించే అవకాశం ఉందో పరిశీలిస్తున్నారు. అవసరం, అవకాశాల ఆధారంగా సర్వే చేస్తున్న ఆధికారులు ఆయా ప్రాంతాల్లో ఉన్న వాగులపై స్టడీ చేస్తున్నారు. ప్రధానంగా హాలియా, కనగల్, సిసిలేరు, పసునూరు, కల్వకుంట్ల వంటి పెద్దవాగులపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఏడు మండలాల్లో 35 చెక్​డ్యామ్​లు ఉండగా.. మరో130 నిర్మించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

భూగర్భ జలాల పెంపుపై దృష్టి

మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా డిండి లిఫ్ట్​ ఇరిగేషన్ స్కీంను 2015లో మొదలు పెట్టినా.. ఇప్పటికీ పూర్తికాలేదు. మునుగోడు నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో సాగునీరు, తాగునీరు ఇస్తామని ఎన్నికల టైంలో రూలింగ్​పార్టీ హామీ ఇచ్చింది. డిండికి ఇప్పట్లో మోక్షం కలిగే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా చెక్​డ్యామ్​లపై దృష్టి పెట్టింది. చెక్​ డ్యామ్​లతో భూగర్భజలాలు పెరిగి, తాగునీటి సమస్య కొంత వరకు తీరుతుందని, చెక్​డ్యాంలలో నిల్వ చేసిన నీటితో చెరువులు, కుంటలు నింపి సాగునీరు అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

రూ.300 కోట్లతో ప్రపోజల్స్

చౌటుప్పుల్ మండలం తంగడపల్లి, పంతంగి టోల్​ప్లాజా నుంచి నారాయాణ్​పూర్, మునుగోడు, కనగల్​ మండలాల మీదుగా ప్రవహించే హాలియా వాగు, చండూరు, నాంపల్లి మండలాల్లో ప్రవహించే శేషిలేటి వాగు, సిసిలేరు, పసునూరు, కల్వకుంట్ల వాగులపైన రూ.300 కోట్లతో130 చెక్ డ్యామ్​లు నిర్మించేందుకు ప్లాన్​ జరుగుతోంది. డీపీఆర్​రెడీ చేస్తున్నారు. చెక్​డ్యామ్ లతో నియోజకవర్గంలో కొంత వరకు ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని, డిండి లిఫ్ట్ స్కీం పూర్తయ్యేదాకా  ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయని చెబుతున్నారు. 

ప్రభుత్వానికే క్లారిటీ లేదు

కృష్ణా జలాల్లో వాటా తేలే వరకు డిండి ఇరిగేషన్​ప్రాజెక్టు పైన పెట్టుకున్న ఆశలు నెరవేరేలా లేవు. పాలమూరు, డిండి లిఫ్ట్​ఇరిగేషన్​స్కీంలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది. మరోవైపు అసలు డిండి స్కీంకు ఎక్కడి నుంచి నీటిని తరలించాలనే దానిపైన ప్రభుత్వానికే ఇంకా క్లారిటీ లేదు. ఈ సమస్యలన్నీ తేలితేనే డిండి స్కీం, దానికి అనుసంధానంగా నిర్మిస్తున్న 9 రిజర్వాయర్లకు మోక్షం కలిగేది. అలాగే డిండి పూర్తయ్యే వరకు నిర్మాణంలో ఉన్న కిష్టరాయినిపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్లకు నీటి ప్రవాహాలు ఉండవు. నియోజకవర్గం పరిధిలోని 83 గ్రామాల్లో 1,76,320 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందే అవకాశం లేదు.