మహబూబాబాద్: పదవులు తీసుకోగానే సరిపోదని.. కష్టపడి పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం (డిసెంబర్ 8) మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పేదలకు ఇండ్లు భూములను పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాదేనని అన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రుణ మాఫీ చేశామన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణాలు రీ షెడ్యూల్ చేయకపోవడంతో కొందరు రుణమాఫీ అర్హతను కోల్పోయారని విమర్శించారు. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని.. అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.