రాష్ట్ర హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరధే..

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ (సీజే)గా జస్టిస్ అలోక్ అరధే నియమితులయ్యారు. ప్రస్తుతం కర్నాటక హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ అలోక్.. పదోన్నతిపై తెలంగాణకు రానున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు సీజేగా సేవలందించిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇటీవల సుప్రీంకోర్టు సీజేగా పదోన్నతిపై వెళ్లారు. దీంతో సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో కొలీజియం ఈ నెల 5న తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరధే పేరును కేంద్రానికి సిఫార్సు చేసింది. కొలీజియం సిఫారసులను రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రం పంపగా.. ఆ ఫైల్​పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. అలాగే ఒడిశా హైకోర్టు సీజేగా జస్టిస్ సుభాషిస్ తలపత్రా, గుజరాత్  హైకోర్టు సీజేగా జస్టిస్ సునీతా అగర్వాల్, కేరళ హైకోర్టు సీజేగా జస్టిస్ ఆశిష్ జితేంద్ర దేశాయ్ కూ ప్రమోషన్  ఇచ్చారు. చత్తీస్​గఢ్  జడ్జి పి.శ్యాం కోషిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘవాల్  బుధవారం రాత్రి ట్వీట్  చేశారు.