91,157 కేసుల్లో తీర్పు.. రికార్డుల్లోకెక్కిన జస్టిస్ అమర్​నాథ్ గౌడ్

  • వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డులో చోటు

హైదరాబాద్, వెలుగు: త్రిపుర హైకోర్టు జడ్జి జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ అరుదైన ఘనత సాధించారు. జడ్జిగా అత్యధిక కేసులు పరిష్కరించి రికార్డు సృష్టించారు. ‘వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్’ రికార్డుల్లోకి ఎక్కారు. ఈ సందర్భంగా జస్టిస్ అమర్​నాథ్ గౌడ్​కు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవల రాజ్​భవన్​లో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్​ను ప్రదానం చేశారు. 

జస్టిస్ అమర్​నాథ్ గౌడ్ 2017 నుంచి ఇప్పటివరకు 91,157 కేసులు పరిష్కరించారు. రోజుకు సగటున 109 కేసులను పరిష్కరించి రికార్డు సృష్టించారు. హైదరాబాద్​కు చెందిన జస్టిస్ అమర్​నాథ్ గౌడ్.. 2017లో తెలంగా ణ, ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత 2021, అక్టోబరు 28న త్రిపుర హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. 2022, నవంబరు 11 నుంచి 2023, ఏప్రిల్ 16 వరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ హైకోర్టులో 40శాతం పెండింగ్ కేసులను, త్రిపుర హైకోర్టులో 60 శాతం పెండింగ్ కేసులను పరిష్కరించారు.